“దైవవాణి అవతరణ (వహీ అవతరణకు) సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి అనుభవంలోనికి వచ్చిన మొట్టమొదటి…

“దైవవాణి అవతరణ (వహీ అవతరణకు) సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి అనుభవంలోనికి వచ్చిన మొట్టమొదటి విషయం నిద్రలో ఆయన యొక్క శుభస్వప్నాలు

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఉల్లేఖన: “దైవవాణి అవతరణ (వహీ అవతరణకు) సంబంధించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి అనుభవంలోనికి వచ్చిన మొట్టమొదటి విషయం నిద్రలో ఆయన యొక్క శుభస్వప్నాలు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) చూసిన ఏ స్వప్నము కూడా అరుణోదయం తనవెంట వెలుగు తీసుకువచ్చినట్లు నిజం కాకుండా పోలేదు. తరువాత ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏకాంతంగా గడపడం ఇష్టపడసాగినారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘హిరా’ గుహకు వెళ్ళిపోయేవారు, అక్కడ ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ‘తహన్నుత్’లో గడిపేవారు (తహన్నుత్: తనవెంట తగినంత ఆహారసామాగ్రి తీసుకుని వెళ్ళి, ఇంటికి, కుటుంబము వద్దకు తిరిగి వచ్చేదాకా బహు దూరంగా ఏకాంతములో ఆరాధనలో, స్వీయ మేధోమధనములో గడపడం). తరువాత తిరిగి ఖదీజహ్ (రదియల్లాహు అన్హా) వద్దకు వెళ్ళేవారు, మరల అన్ని రాత్రులకొరకు సరంజామా తీసుకుని వెళ్ళడానికి. అలా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిరా గుహలో ఉండగా చివరికి ‘సత్యం’ ఆయన వద్దకు వచ్చేసింది. ఆయన వద్దకు ఓ దైవదూత వచ్చి “చదువు” అని అన్నాడు. దానికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) “నాకు చదువు రాదు” అని పలికారు. ఈ విషయమై ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇంకా ఇలా అన్నారు: “అతడు (ఆ దైవదూత) నన్ను ఒడిసి పట్టుకుని నేను భరించలేనంత గట్టిగా నన్ను అదిమాడు. తరువాత నన్ను వదిలి తిరిగి అన్నాడు “చదువు”, దానికి నేను “నాకు చదవడం రాదు” అన్నాను, ఆ దైవదూత రెండోసారి నన్ను ఒడిసి పట్టుకుని నేను భరించలేనంత గట్టిగా నన్ను అదిమాడు. తరువాత నన్ను వదిలి తిరిగి అన్నాడు “చదువు”, దానికి నేను “నాకు చదవడం రాదు” అన్నాను, ఆ దైవదూత మూడోసారి నన్ను ఒడిసి పట్టుకుని నేను భరించలేనంత గట్టిగా నన్ను అదిమాడు. తరువాత ఇలా అంటూ నన్ను వదిలివేసాడు: “చదువు, నీ ప్రభువు నామమున, ఎవరైతే సర్వమూ సృష్టించినాడో; ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు, చదువు! నీ ప్రభువు పరమదయాళువు (సూరహ్ అల్ అలఖ్ 96:1-3)”. ప్రవక్త (స) ఈ మూడు వాక్యాలతో వెనుకకు మరలినారు. వారి గుండె వణుకుతున్నది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నేరుగా ఖదీజా బింత్ ఖువైలిద్ (రదియల్లాహు అన్హా) వద్దకు వెళ్ళి వణుకుతూ “నన్ను (దుప్పటితో) కప్పు, నన్ను (దుప్పటితో) కప్పు” అన్నారు. వారు ఆయనను కప్పినారు. అలా కొద్ది సేపటిని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నుండి భయము, విభ్రాంత స్థితి దూరమైనాయి. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) కు జరిగిందంతా వివరించి ఇలా అన్నారు: “నిజంగా, నా ప్రాణం పోతుందేమో అన్నంత భయం కలిగింది”. దానికి ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: “లేదు! అల్లాహ్ మిమ్మల్ని అగౌరవం పాలు చెయ్యడు. మీరు బంధువుల పట్ల సత్ప్రవర్తన కలిగి ఉంటారు, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటారు, నిరుపేదలకు సహాయం చేస్తారు, అతిథులకు ఆహారాన్ని ఆశ్రయాన్ని ఇస్తారు, మరియు విపత్తుల బారిన పడిన వారికి సహాయం చేస్తారు” అని ధైర్యం చెప్పారు. తరువాత ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ను తన పినతండ్రి కుమారుడైన ‘వరఖ ఇబ్న్ నౌఫాల్ ఇబ్న్ అసద్ ఇబ్న్ అబ్దుల్ ఉజ్జా ఇబ్న్ ఉమ్మె ఖదీజహ్ వద్దకు తీసుకు వెళ్ళినారు. అఙ్ఞాన కాలములోనే వరఖా క్రైస్తవ ధర్మాన్ని స్వీకరించిన వ్యక్తి. హిబ్రూ (ఇబ్రానీ) భాషలో రచనలు చేసేవాడు. కనుక చేతనయినంత వరకు హిబ్రూ భాషలో బైబిల్ రాసేవాడు.అప్పుడు ఆయన వృద్ధుడూ మరియు చూపులేని వాడు కూడా. ఆయనతో ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) “అన్నా, మీ సోదర కుమారుని మాటలేమితో ఒకసారి వినండి” అని కోరినారు. దానికి వరఖా “ఓ నా సోదరుని కుమారుడా! నీవు చూసినది ఏమిటో చెప్పు” అన్నారు. రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయనకు తాను చూసినది ఏమిటో వివరించినారు. అది విని ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) తో వరఖా ఇలా అన్నారు “మూసా అలైహిస్సలాం వద్దకు దైవవాణిని పంపడానికి అల్లాహ్ పంపిన ‘నామూసే’ ఆయన (నామూస్: దైవదూత). నేను యవ్వనవంతునిగా ఉంటే ఎంత బాగుండును, నీ వాళ్ళు నిన్ను వెళ్లగొట్టే రోజు వరకు నేను జీవించి ఉంటే ఎంత బాగుండును”. అది విని రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విస్మయంగా “ఏమిటీ, నా వాళ్ళు నన్ను వెళ్ళగొడతారా?” అన్నారు. దానికి వరఖా ఇలా అన్నాడు: “అవును, నీవు తీసుకువచ్చిన దాని వంటి విషయముతో వచ్చిన వారెవరూ, వారి స్వంత మనుషులే వారితో శత్రువులుగా వ్యవహరించకుండా ఒక్కరూ లేరు. నేను ఆ రోజు వరకు జీవించి ఉంటే, నేను గట్టిగా మద్దతునిస్తాను.” తరువాత కొద్ది కాలానికే వరఖా చనిపోయాడు. అల్లాహ్ తరఫునుండి వహీ అవతరణ (దివ్యవాణి అవతరణ) కొద్ది రోజులపాటు నిలిచిపోయింది.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా (రదియల్లాహు అన్హా) ఇలా తెలియజేస్తున్నారు: రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) కు వచ్చిన మొదటి దివ్యవాణి ఆయనకు నిద్రలో ఒక నిజమైన కల రూపంలో వచ్చింది. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) నిద్రలో ఏ కలను వచ్చినా, అది స్పష్టంగా వచ్చిన తెల్లవారుజాము వెలుగు వలె నిజమై పోయేది. తరువాతా ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఏకాంతముగా గడపడం ఇష్టం కాసాగింది. ఆయన తనను తాను ఇతరుల నుండి వేరు చేసుకుని హిరా గుహలో, తన కుటుంబము వద్దకు తిరిగి వచ్చేంత వరకు, అనేక రాత్రులు ఆరాధనలో గడిపేవారు. అన్ని రోజులు గడపడానికి సరిపడా సరంజామా తీసుకుని వెళ్ళేవారు. సరంజామా నిండుకున్నప్పుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) విశ్వాసుల మాతృమూర్తి అయిన ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) వద్దకు తిరిగి వచ్చి తిరిగి అన్ని రోజులకు సరిపడా సరంజామా తీసుకుని వెళ్ళేవారు. చివరికి ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) హిరా గుహలో ఉన్నప్పుడు వారి వద్దకు సత్య సందేశం రానే వచ్చింది. జిబ్రయీల్ (అలైహిస్సలాం) ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి “పఠించు” అన్నారు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నాకు తెలీదు ఎలా పఠించాలో” అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ సంఘటను గురించి ఇంకా ఇలా వివరించారు: “అపుడు ఆయన నన్ను తన రెండు బాహువులలోనికి తీసుకుని నేను భరించలేనంత గట్టిగా, ఊపిరాడక అలసిపోయేలా ఒడిసి పట్టుకున్నాడు, తరువాత వదిలి “పఠించు” అన్నాడు. నేను “ఎలా పఠించాలో నాకు తెలియదు” అన్నాను; ఆయన రెండవసారి నన్ను తన రెండు బాహువులలోనికి తీసుకుని నేను భరించలేనంత గట్టిగా, ఊపిరాడక అలసిపోయేలా ఒడిసి పట్టుకున్నాడు, తరువాత వదిలి “పఠించు” అన్నాడు. నేను “ఎలా పఠించాలో నాకు తెలియదు” అన్నాను; ఆయన నన్ను మూడవసారి తన రెండు బాహువులలోనికి తీసుకుని నేను భరించలేనంత గట్టిగా, ఊపిరాడక అలసొపోయేలా ఒడిసి పట్టుకున్నాడు, తరువాత వదిలి ఇలా అన్నాడు: {ఇఖ్ర’బిస్మిరబ్బికల్లజీ ఖలఖ్; ఖలఖల్ ఇన్సాన మిన్ అలఖ్; ఇఖ్ర’ వరబ్బుకల్ అక్రమ్} [“చదువు, నీ ప్రభువు నామమున, ఎవరైతే సర్వమూ సృష్టించినాడో; ఆయనే మానవుణ్ణి రక్తముద్దతో (జీవకణంతో) సృష్టించాడు, చదువు! నీ ప్రభువు పరమదయాళువు] (సూరహ్ అల్ అలఖ్ 96:1-3) అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) మరణ భయంతో హృదయం వణుకుతూ ఆయనపై అవతరించిన ఆ ఆయతులతో తిరిగి వచ్చారు. ఆయన, తన భార్య, విశ్వాసుల తల్లి ఖాదీజా బింత్ ఖువైలిద్ (రజియల్లాహు అన్హా) వద్దకు వెళ్లి ఇలా అన్నారు: “నన్ను దుప్పటితో కప్పివేయి, నన్ను దుప్పటితో కప్పివేయి” అన్నారు. వారు ఆయన (స) ను కప్పివేసారు. కొద్ది సేపటికి ఆయన భయం తొలగిపోయింది. అపుడు ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖదీజా (రదియల్లాహు అన్హా) తో మాట్లాడినారు. ఆమెకు జరిగినదంతా వివరించినారు. ఆయన (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఖదీజా (రదియల్లాహు అన్హా) తో ఇలా అన్నారు: “నా ప్రాణం పోతుందేమో అన్నంత భయపడినాను”. దానికి ఖదీజాహ్ (రదియల్లాహు అన్హా) ఇలా అన్నారు: లేదు, అల్లాహ్ సాక్షిగా, అల్లాహ్ మిమ్మల్ని ఎప్పటికీ అవమానించడు. మీరు కుటుంబ సంబంధాలను కొనసాగిస్తారు, తమను తాము చూసుకోలేని బలహీనులకు సహాయం చేస్తారు మరియు పేదలు మరియు నిరాశ్రయులకు మద్దతు ఇస్తారు, ప్రజలకు మరెవరి దగ్గర దొరకని వాటిని అందిస్తారు. మీరు అతిథులను ఆదరిస్తారు మరియు అవసరమైన సమయాల్లో సహాయం చేస్తారు. ఖదీజా (రదియల్లాహు అన్హా) అతనిని తన బంధువు అయిన వరఖా ఇబ్న్ నౌఫాల్ ఇబ్న్ అసద్ ఇబ్న్ అబ్ద్ అల్-ఉజ్జా వద్దకు తీసుకువెళ్ళినారు. అఙ్ఞాన కాలపు పూర్వపు ఆచారాలను వదిలి క్రైస్తవుడైన వ్యక్తి అతడు. అల్లాహ్ ఇష్టపడినంత వరకు అతను బైబిల్ నుండి హిబ్రూ భాషలో వ్రాసేవాడు. ఆయన కంటిచూపు కోల్పోయిన వృద్ధుడు. ఖదీజా (రదియల్లాహు అన్హా) అతనితో ఇలా అన్నారు: "ఓ సోదరా! నీ మేనల్లుడు చెప్పేది ఒకసారి వినండి." వారఖా అన్నాడు, "ఓ మేనల్లుడా! నీవు ఏమి చూసినావు?" రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) తాను చూసిన దానిని అతనికి చెప్పినారు. వరఖా ఇలా అన్నాడు, "ఆయన, అల్లాహ్ తన ప్రవక్త మూసా (అలైహిస్సలాం) వద్దకు పంపిన దైవదూత జిబ్రీల్ (అలైహిస్సలాం). నేను ఇంకా యువకునిగా మరియు మంచి స్థితిలో ఉంటే బాగుండేది. మీ ప్రజలు నిన్ను బహిష్కరించినప్పుడు నేను జీవించి ఉంటే బాగుండేది." అది విని రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆశ్చర్యంగా "నావారు నన్ను బహిష్కరిస్తారా?" అని అడిగారు. దానికి అతను, "అవును. నువ్వు తెచ్చిన దానిలాంటిది ఏ మనిషి కూడా ఎప్పుడూ తీసుకురాలేదు, అలాంటి వానికి హాని జరిగింది, అణచివేయబడినాడు తప్ప. నీకు అలా జరుగబోయే రోజు చూడటానికి నేను బ్రతికి ఉంటే, నీకు విజయం కలిగేలాగా బలంగా మద్దతు ఇస్తాను" అన్నాడు. ఆ తరువాత వరఖా కొద్ది రోజులకే చనిపోయినాడు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై దివ్యవాణి అవతరణ కొద్ది రోజులపాటు నిలిచిపోయింది.

فوائد الحديث

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు దివ్యవాణి అవతరణ ప్రారంభం గురించి ఇందులో ప్రకటించబడుతున్నది.

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి కల కూడా దివ్యవాణి అవతరణ యొక్క విధానాలలో ఒకటి.

ఇంటి నుండి ఆహార పానీయాలు మొదలైన సరంజామా తీసుకుని వెళ్ళడం, అల్లాహ్ పై విశ్వాసానికి, నమ్మకానికి విరుధ్ధమైన విషయమేమీ కాదు. అందుకు షరియత్’లో అనుమతి ఉన్నది. అది మరెవరో కాదు అల్లాహ్’ను విశ్వసించే వారందరి నాయకుడైన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) స్వయంగా ఆచరించి చూపిన విషయం.

ఇందులో అల్లాహ్ యొక్క దాతృత్వం మరియు ఆయన యొక్క ఔదార్యముల పరిపూర్ణత కనిపిస్తుంది; మహిమాన్వితుడైన అల్లాహ్, తన దాసులకు తెలియని వాటిని బోధించినాడు మరియు వారిని అజ్ఞానపు చీకటి నుండి జ్ఞానపు వెలుగులోకి తీసుకు వచ్చినాడు.

‘రాయడం” అనేది ఒక కళ, ఒక శాస్త్రం. ఈ హదీథులో రచనా శాస్త్రం యొక్క గొప్పతనం, దాని ఘనత స్పష్టంగా చూడవచ్చు. దాని అపారమైన ప్రయోజనాల కారణంగా దాని ద్వారా జ్ఞానం నమోదు చేయబడింది, వివేకము, పరిఙ్ఞానము నమోదు చేయబడింది, పూర్వీకుల వృత్తాంతాలు భద్రపరచబడ్డాయి, అల్లాహ్ యొక్క గ్రంథాలు భద్రపరచబడ్డాయి, ధార్మిక పరమైన విషయాలు మరియు ప్రాపంచిక జీవిత విషయాలు సరిదిద్దబడ్డాయి.

ఖుర్’ఆన్ లో అవతరించబడిన మొట్టమొదటి ఆయతు (వచనం) “{ఇఖ్ర’బిస్మిరబ్బికల్లజీ ఖలఖ్;} [“చదువు, నీ ప్రభువు నామమున, ఎవరైతే సర్వమూ సృష్టించినాడో;] (సూరహ్ అల్ అలఖ్ 96:1)

గొప్ప నైతికత, నైతిక విలువలు మరియు మంచి లక్షణాలు కలిగి ఉండడం అనేది చెడు ముగింపులు మరియు వివిధ విపత్తుల నుండి రక్షణకు ఒక మార్గం. ఎవరైతే మంచి పనులు సమృద్ధిగా చేస్తారో వారికి మంచి ముగింపు ఉంటుంది; ధర్మము మరియు ప్రాపంచిక జీవితంలో భద్రత ఆశించబడుతుంది.

ఒక మంచి ప్రయోజనం కోసం ఒక వ్యక్తిని అతని ముఖం పైననే (అతని సమక్షములోనే) ప్రశంసించడం అనుమతించబడుతుంది.

తోటివారిని ఓదార్చాలి మరియు ప్రోత్సహించాలి మరియు వారి భయాన్ని దూరం చేసి, వారి భద్రతకు ఎటువంటి ముప్పు లేదు అని కారణాలను ప్రస్తావించాలి.

ఖదీజా (రదియల్లాహు అన్హా) యొక్క పరిపూర్ణతకు గొప్ప సాక్ష్యం ఈ హదీథు; మరియు అత్యంత స్పష్టమైన రుజువు ఏమిటంటే, బలమైన ఆమె వివేకం, బలమైన ఆమె వ్యక్తిత్వం; మరియు ఆమె గొప్ప అవగాహన ఏమిటంటే, ప్రవక్త (సల్లల్లాహు అలైహి వ సల్లం) గురించి ఆమె వర్ణించిన మాటలలో, ఆమె అన్ని ప్రాథమిక సూత్రాలు మరియు మంచి పనుల పునాదులను మిళితం చేసినారు. ఎందుకంటే దయ, కరుణ అనేవి బంధువుల పట్ల లేదా అపరిచితుల పట్ల చూపబడే గుణవిశేషణాలు. వారికి శారీరక ప్రయత్నం ద్వారా అంటే శారీరకంగా ఏదైనా పని చేసి పెట్టడం ద్వారా, లేదా సంపద ద్వారా; అలాగే తమ వ్యవహారాలను నిర్వహించుకోగల సామర్థ్యం ఉన్నవారికి లేదా అలా చేయలేని వారికి దయ, కరుణ చూపబడుతుంది. వివరణాత్మక ప్రశంసలు అవసరమయ్యే పరిస్థితికి అనుగుణంగా ఆమె తన వాగ్ధాటితో సముచితంగా వివరించినారు.

ఎవరికైనా ఏదైనా పరిస్థితి ఎదురైతే, వారు ఎవరి సలహా మరియు సరైన అవగాహనను, తీర్పును విశ్వసిస్తారో వారికి తెలియజేయాలని సిఫార్సు ఈ హదీథులో సిఫార్సు చేయబడుతున్నది.