“మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో?

“మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో?

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “మీకు తెలుసా పేదవాడు అంటే ఎవరో?” అక్కడ ఉన్న వారు ఇలా అన్నారు: “మాలో పేదవాడు అంటే ధనము లేనివాడు మరియు ఆస్తిపాస్తులు లేనివాడు”. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “నిశ్చయంగా నా ఉమ్మత్ (ముస్లిం సమాజము) యొక్క అసలైన పేదవాడు ఎవరంటే – అతడు పునరుథ్థాన దినమున నమాజులతో, ఉపవాసాలతో, దానధర్మాలు, జకాతు దాతృత్వాలతో వస్తాడు; అయితే వీటన్నింటితో పాటు అతడు ఒకరిని అన్యాయంగా అవమానించి ఉంటాడు; మరొకరిని అకారణంగా దూషించి ఉంటాడు; ఇంకొకరి సంపదను అన్యాయంగా తినేసి ఉంటాడు; ఒకరి రక్తాన్ని అధర్మంగా చిందించి ఉంటాడు; మరొకరిని అకారణంగా కొట్టి ఉంటాడు. అతడు వీటన్నింటితో పాటు కూడా వస్తాడు. అణచివేతకు గురిచేయబడిన ప్రతి ఒక్కరికి ఇతని మంచి పనుల నుండి ఇవ్వబడుతుంది. అంతేగాక ఒకవేళ న్యాయం పూర్తిగాక ముందే ఇతని మంచి పనులు అయిపోతే, అణచివేతకు గురి అయిన వారి పాపాలలో కొన్ని ఇతనిపై వేయబడతాయి మరియు అతడు నరకాగ్నిలో పడవేయబడతాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను అడిగారు – పేదవాడు అంటే ఎవరో తెలుసా మీకు అని. దానికి వారు “మాలో పేదవాడు అంటే సంపద గానీ, ఆస్తిపాస్తులు గానీ లేనివాడు” అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “నా ఉమ్మత్ యొక్క పేదవాడు ఎవరంటే, అతడు పునరుథ్థాన దినమున నమాజులు, ఉపవాసాలు, జకాత్ మరియు దానధర్మాలు వంటి అనేక సత్కార్యాలతో వస్తాడు. కానీ వాటితో పాటు ఒకరిని అవమానపరిచి ఉంటాడు; మరొకరిని దూషించి ఉంటాడు; ఇంకొకరి పట్ల అపవాదులు ప్రచారం చేసి ఉంటాడు; ఒకరి ఆస్తిని తినేసి ఉంటాడు; మరొకరి హక్కును చెల్లించడానికి నిరాకరించి ఉంటాడు; ఒకరి రక్తాన్ని చిందించి అన్యాయం చేసి ఉంటాడు; మరొకరిని అన్యాయంగా కొట్టి అవమానపరిచి ఉంటాడు. పునరుథ్థాన దినమున అతడు అనేక సత్కార్యాలతో పాటు వీటతో కూడా వస్తాడు. ఇతని చేత అణచివేతకు గురైన వానికి ఇతని మంచిపనులలో నుండి ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా అతని మంచి చెడుల మధ్య న్యాయం పూర్తిగా జరుగక ముందే ఇతని సత్కార్యాలన్నీ అయిపోతే, ఇతని చేత అణచివేతకు గురైన వాని పాపాలలో కొన్ని ఇతని ఖాతాలలో వేయబడతాయి. అపుడు అతడు నరకాగ్నిలోనికి విసిరి వేయబడతాడు. అపుడు అతని పేరున ఒక్క సత్కార్యం కూడా మిగిలి ఉండదు.

فوائد الحديث

ఈ హదీథులో నిషేధించబడిన విషయాలలో పడకుండా, ప్రత్యేకించి అల్లాహ్ యొక్క దాసుల భౌతిక మరియు నైతిక హక్కులకు సంబంధించిన నిషేధించిన విషయాలలో పడకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించడం జరిగింది.

సృష్ఠితాలలో వాటి మధ్య హక్కులు - వివాదాలు, కలహాల మీద ఆధారపడి ఉంటాయి; అదే సృష్ఠికర్త యొక్క హక్కులు - షిర్క్ మినహా (బహుదైవారాధన), క్షమాగుణం పై ఆధారపడి ఉంటాయి.

ప్రత్యేకించి విద్యాబోధనలోనూ, మరియు మార్గదర్శకత్వం చేయు విషయంలోనూ ఎదుటి వారితో సంభాషిస్తున్నట్లు ఉండే విధానాన్ని అనుసరించడం వారిని ఆ విషయం పట్ల ఉత్తేజపరుస్తుంది, వారి దృష్ఠిని ఆకర్షిస్తుంది, వారిలో విషయం పై ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఈ హదీథులో నిజమైన పేదవాడు అంటే ఎవరో వివరించబడినది – అసలైన పేదవాడు ఎవరంటే తీర్పు దినము నాడు అతని నుండి అతని మంచిపనులన్నింటినీ ఋణప్రదాతలు తీసేసుకున్న తరువాత తన పేరున ఒక్క మంచిపని కూడా మిగలని వాడు.

తీర్పు దినమునాడు పాపపరిహారం మనం చేసిన మంచి పనులన్నింటినీ మింగి వేయవచ్చు – చివరికి వాటిలో ఏమీ మిగలదు.

సృష్టితాల పట్ల అల్లాహ్ వ్యవహరించే విధానం న్యాయం మరియు సత్యంపై ఆధారపడి ఉంటుంది.

التصنيفات

పరలోక జీవితం, దుర్గుణాలు