“ఓ రసూలుల్లాహ్! సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఎవరైనా ఒకడు నా నుంచి ధనాన్ని కాజేయాలనే ఉద్దేశ్యంతో నా వద్దకు…

“ఓ రసూలుల్లాహ్! సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఎవరైనా ఒకడు నా నుంచి ధనాన్ని కాజేయాలనే ఉద్దేశ్యంతో నా వద్దకు వస్తే, మీరు ఏమంటారు?”

అబూ హురైరాహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అడిగాడు: “ఓ రసూలుల్లాహ్! సల్లల్లాహు అలైహి వసల్లం, ఒకవేళ ఎవరైనా ఒకడు నా నుంచి ధనాన్ని కాజేయాలనే ఉద్దేశ్యంతో నా వద్దకు వస్తే, మీరు ఏమంటారు?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీ ధనాన్ని అతనికి ఇవ్వవద్దు”, అపుడు అతడు ఇలా అన్నాడు: “ఒకవేళ అతడు నాతో పోరాటానికి దిగితే?”; దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “నీవు కూడా అతనితో పోరాడు” అన్నారు. మళ్ళీ అతడు: “ఒకవేళ ఆ పోరాటంలో అతడు నన్ను చంపివేస్తే?” అని అడిగాడు, దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “అపుడు నీవు “షహీదు”గా పరిగణించబడతావు” అన్నారు; అపుడు అతడు మళ్ళీ: “ఒకవేళ నేనే అతడిని చంపివేస్తే?” అని అడిగాడు. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతడు నరకంలో ఉంటాడు.”

[ప్రామాణికమైన హదీథు] [ముస్లిం నమోదు చేసినారు:]

الشرح

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు: ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! , “ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి నా డబ్బును బలవంతంగా లాక్కోవడానికి వస్తే మీరు ఏమంటారు?” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "నీవు అతనికి లొంగిపోయి నీ డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు." దానికి ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఒకవేళ అతడు నాతో పోరాటానికి దిగితే?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అతనితో ఎదురు పోరాటం చేయడానికి నీకు కూడా అనుమతి ఉన్నది.” అపుడు ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఒకవేళ అతడు నన్ను చంపివేస్తే?” ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “నీవు షహీదుగా (అమరవీరునిగా) పరిగణించబడతావు” అన్నారు. ఆ వ్యక్తి మళ్ళీ ఇలా అన్నాడు: “మరి ఒకవేళ నేను అతడిని చంపివేస్తే?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం: “పునరుత్థాన దినమున ఆ వ్యక్తి నరకాగ్నిలో వేయబడడానికి అర్హుడవుతాడు” అన్నారు.

فوائد الحديث

ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “తన ఇంటి స్త్రీలను రక్షించడం ఆ ఇంటి యజమాని యొక్క విధి, ఇందులో ఎటువంటి భేదాభిప్రాయం లేదు. అయితే తనను తాను రక్షించుకోవడం కోసం ఎదుటి వ్యక్తిని చంపడం అనే విషయంపై మన మద్’హబ్ మరియు ఇతర మద్’హబ్ ల మధ్య భేదాభిప్రాయాలున్నాయి. ఆస్తి రక్షణ అనుమతించబడినదే, అయితే అది వాజిబ్ కాదు (విధి కాదు)."

ఆచరణకు ముందు ఙ్ఞానం అవసరం అనడానికి ఈ హదీథు ఒక ఋజువు. ఈ హదీథులో సహాబీ, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లంను ఆచరణకు ముందు అసలు ఏమి ఆచరించాలో అడిగి తెలుసుకోవడం మనం చూస్తాము.

దురాక్రమణదారుడిని తరిమికొట్టడంలో క్రమంగా ఒక విధానాన్ని అనుసరించాలి - అతనితో పోరాటానికి దిగే ముందు అతనితో మాట్లాడడం, నచ్చజెప్పడం, లేదా సహాయం కొరకు ఎవరినైనా పిలవడం మొదలైనవి చేయాలి. కానీ అతడు పోరాటం ప్రారంభిస్తే, మన లక్ష్యం అతన్ని తరిమికొట్టడం అయి ఉండాలి, అతడిని చంపడం కాదు.

ఒక ముస్లిం యొక్క రక్తము, అతని సంపద మరియు అతని గౌరవం పవిత్రమైనవి.

ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “తెలుసుకోండి, “షహీదు” (అమరవీరులు) మూడు రకాలు. వారిలో ఒక రకం: అవిశ్వాసులతో యుద్ధానికి ధర్మబద్ధమైన కారణాలలో ఏదైనా కారణం వలన వారితో జరిగిన యుద్ధములో వీరమరణం పొందిన వ్యక్తి. ఇటువంటి వ్యక్తికి షరియత్’లో పారలౌకిక బహుమానము, పుణ్యమునకు సంబంధించి మరియు ఇహలోక జీవితానికి సంబంధించి షహీదుకు సంబంధించిన నియమాలే వర్తిస్తాయి, అంటే అటువంటి షహీదునకు మరణానంతర స్నానం (జనాజా గుసుల్) చేయించబడదు, మరియు సాధారణంగా మృతుని కొరకు ఆచరించబడే నమాజు (సలాతుల్ జనాజహ్) ఆచరించబడదు. రెండవ రకం: ఈ రకానికి చెందిన వారు పారలౌకిక పుణ్యం పరంగా “షహీదులు”గా పరిగణించబడతారు; ఇహలోక పరంగా కాదు. ఉదాహరణకు: విపరీతమైన కడుపునొప్పి కారణంగా మృతిచెందిన వ్యక్తి, కత్తితో పొడవబడి చనిపోయిన వ్యక్తి; భవనం కూలి దాని క్రింద నలిగి చనిపోయిన వ్యక్తి; తన ఇంటివారిని, తన సంపదను రక్షిస్తూ చనిపోయిన వ్యక్తి మరియు ప్రామాణికమైన హదీథులలో ‘షహీదు”లుగా పేర్కొనబడిన ఇతరులు ఈ విభాగంలోనికి వస్తారు. వీరికి ‘జనాజా గుసుల్’ చేయించబడుతుంది మరియు వీరి కొరకు ‘సలాతుల్ జనాజహ్’ కూడా ఆచరించబడుతుంది. పరలోకములో వీరికి, మొదటి రకానికి చెందిన షహీదులుగా చనిపోయిన వారికి లాగానే ప్రతిఫలం కూడా లభిస్తుంది. అయితే సరిగ్గా మొదటి విభాగములోని వారికి లభించిన పుణ్యము మరియు ప్రతిఫలమే ఈ రెండవ విభాగానికి చెందిన వారికి కూడా లభించ వలసిన అవసరం లేదు. మూడవ రకం: ఈ రకానికి చెందిన “షహీదు” ఎవరంటే, ఇతడు ‘జిహాదు’లో యుద్ధ సంపద నుండి దొంగిలించిన వాడై ఉంటాడు, లేదా అటువంటి పనికి పాల్బడిన వాడై ఉంటాడు. ఇతడు ‘జిహాదులో’ చంపబడినప్పటికీ, ఇతడు ‘షహీదు’ (అమరవీరుడు) అనడాన్ని తిరస్కరించే హదీథులు ఉన్నాయి. ఈ వ్యక్తికి ప్రాపంచిక కోణములో ‘షహీదు’ (అమరవీరుడు) యొక్క నియమాలు వర్తిస్తాయి. అంటే, ఇతనికి ‘జనాజా గుసుల్’ చేయించబడదు, మరియు ‘సలాతుల్ జనాజా నమాజు’ ఆచరించబదు. అలాగే పరలోకములో ‘షహీదు’ కు లభించే పూర్తి ప్రతిఫలాన్ని పొందడు.”

التصنيفات

ధర్మ ఉద్దేశాలు, పాపకార్యముల ఖండన