“నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి…

“నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి మినష్’షైతాన్” (నేను షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను) అని పలికినట్లయితే అతడు ఉన్న స్థితి (కోప స్థితి) తొలిగి పోతుంది”

సులైమాన్ ఇబ్న్ సురద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “నేను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద కూర్చుని ఉన్నాను. అప్పుడు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, ఒకరినొకరు అవమానకరంగా దూషించుకుంటున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి ముఖం కోపంతో ఎర్రబారింది, అతని మెడనరాలు ఉబ్బిపోయాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నాకు ఒక మాట తెలుసు, ఒకవేళ అతడు దానిని పలికినట్లయితే, అది అతణ్ణి ప్రశాంతపరుస్తుంది, అతడు “అఊదుబిల్లాహి మినష్’షైతాన్” (నేను షైతాను నుండి అల్లాహ్ యొక్క శరణు వేడుకుంటున్నాను) అని పలికినట్లయితే అతడు ఉన్న స్థితి (కోప స్థితి) తొలిగి పోతుంది”. అక్కడ ఉన్నవారు అతనితో (కోపంతో ముఖము ఎర్రబారిన వ్యక్తితో) “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరుకోమన్నారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు ఇద్దరు వ్యక్తులు తగవులాడుకుంటున్నారు, వారిలో ఒకతని ముఖం కోపంతో ఎర్రబారి, అతడి మెడనరాలు ఉబ్బిపోయాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “నాకు ఒక మాట తెలుసు. ఒకవేళ అతడు ఆ మాట పలికినట్లయితే అతడి కోపం దూరమై పోతుంది. అతడు ఇలా పలకాలి “అఊదు బిల్లాహి మినష్’షైతానిర్రజీం” (నేను శపించబడిన షైతాను బారి నుండి అల్లాహ్ రక్షణ కోరుతున్నాను)” అన్నారు. అక్కడ ఉన్న వారు అతనితో “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అఊదు బిల్లాహి మినష్’షైతానిర్రజీం” అని పలుకమని చెప్పినారు” అని తెలియజేసారు. దానికి అతడు “నేనేమైనా పిచ్చివాడినా?” అన్నాడు. మతిస్థిమితం కోల్పోయిన వాడు తప్ప షైతాను నుండి ఎవరూ రక్షణ కోరుకోరు అని అతడు భావించినాడు.

فوائد الحديث

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మార్గదర్శకత్వం మరియు దిశానిర్దేశం చేయవలసిన కారణం ఉన్నపుడు ఆవిధంగా చేయడానికి ఎల్లప్పుడూ చురుకుగా ఉండేవారు.

కోపము, ఆగ్రహము ఇవి షైతాను నుండి వస్తాయి.

ఇందులో, కోపావస్థలో, లేదా క్రోధము ఆవహించి ఉన్నపుడు శపించబడిన షైతాను నుండి అల్లాహ్ యొక్క రక్షణ కోరాలనే ఆదేశం ఉన్నది; దివ్య ఖుర్’ఆన్ లో అల్లాహ్ ఇలా అంటున్నాడు: وَإِمَّايَنزَغَنَّكَمِنَٱلشَّيۡطَٰنِنَزۡغٞفَٱسۡتَعِذۡبِٱللَّهِۚ (ఒకవేళ షై'తాన్‌ నుండి నీకు ప్రేరేపణ కలిగితే! నీవు అల్లాహ్‌ శరణువేడుకో!) (సూరహ్: అల్ ఆరాఫ్ 7:200)

ఇందులో తిట్లు, శాపనార్థాలు, దూషణలు మొదలైనవానికి వ్యతిరేకంగా హెచ్చరిక ఉన్నది; ఎందుకంటే అవి ప్రజల మధ్య శత్రుత్వానికి దారితీస్తాయి.

ఇంతకు ముందు ఆ సలహా విని ఉండని వారికి, సలహా ఇవ్వాలి, తద్వారా వారు దాని నుండి ప్రయోజనం పొందుతారు.

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కోపానికి వ్యతిరేకంగా హెచ్చరించినారు, ఎందుకంటే అది చెడుకు, దుర్మార్గానికి దారి తీస్తుంది, వివేకము కోల్పోయేలా చేస్తుంది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్నడూ కోపానికి గురి అయ్యేవారు కారు – అల్లాహ్ యొక్క పవిత్రమైన హద్దులు ఉల్లంఘించబడితే తప్ప. అది “ప్రశంసనీయమైన కోపము” అనబడుతుంది.

కోపంతో ముఖం అంతా ఎర్రబడిపోయి, కంఠనాళాలు ఉబ్బిపోయిన వ్యక్తి “నేనేమైనా పిచ్చివాడినా?” అన్న మాటలపై వ్యాఖ్యానిస్తూ ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ వ్యక్తి కపటవాదులలో ఒకడు కావచ్చు, లేదా మొరటు అరబ్బులలో ఒకడు కావచ్చు.”

التصنيفات

దుర్గుణాలు, సాధారణ విషయాల దుఆలు