.

అబూ హురైరహ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాడు “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! నాకు బంధువులు ఉన్నారు, వారితో నేను బంధుత్వ సంబంధాలను కొనసాగిస్తున్నాను, కానీ వారు నాతో బంధుత్వాన్ని త్రెంచుకున్నారు; నేను వారిపట్ల ప్రేమ, అభిమానాలతో ప్రవర్తిస్తాను, కానీ వారు నా పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తారు; నేను వారి పట్ల సహనంతో వ్యవహరిస్తాను, కానీ వారు నా పట్ల అసహనం, ద్వేషంతో వ్యవహరిస్తారు”. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నీవు (నాతో) చెప్పినట్లుగానే వారితో ఉన్నట్లయితే, నీవు వారికి వేడివేడి బూడిద తినిపిస్తున్న దానితో సమానం. నీవు వారితో ఈ విధంగానే (ప్రవర్తిస్తూ) ఉన్నంత కాలం వారికి వ్యతిరేకంగా అల్లాహ్ నుండి ఒక సహాయకుడు నీతో ఎప్పుడూ ఉంటాడు.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తనకు బంధువులు మరియు రక్తసంబంధీకులూ ఉన్నారని, తాను వారితో మంచిగా వ్యవహరిస్తాననీ, కానీ తనతో వారు దానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనీ; తాను వారితో బంధుత్వాలను మంచిగా నిర్వహిస్తాననీ, వారిని వెళ్ళి చూస్తాననీ, పలుకరిస్తాననీ, కానీ వారు తనతో బంధుత్వాన్ని త్రెంచి వేసుకున్నారనీ; తాను వాళ్లతో దయగా, నమ్మకంగా వ్యవహరిస్తాననీ, కానీ వాళ్లు తనతో అన్యాయంగా, కఠినంగా వ్యవహరిస్తారనీ; తాను వారి పట్ల సహనంగా వ్యవహరిస్తాననీ, కానీ వారు తన పట్ల మాటలలో మరియు చేతలలో చెడుగా వ్యవహరిస్తారనీ విన్నవించుకున్నాడు. తాను ఇప్పుడు విన్నవించుకున్న పరిస్థితులలో కూడా వారితో బంధుత్వాలను నిర్వహించాలా? అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో ఇలా అన్నారు: “పరిస్థితి వాస్తవములో నీవు చెప్పినట్లుగానే ఉన్నట్లయితే; వారి పట్ల ఉత్తమమైన మరియు దయాపూరితమైన నీ వ్యవహరణ ద్వారా; దానికి వ్యతిరేకంగా రోతపుట్టించే వారి వ్యవహారం కారణంగా, భగభగలాడే బూడిదను నీవు వారికి తినిపిస్తున్నట్టు అవుతుంది, స్వయంగా తమ దృష్టిలో తమను తామే వారు అవమానం మరియు పరాభవం పాలయ్యేలా చేస్తున్నావు నువ్వు. అంతేగాక, నీవు చెప్పినట్లుగా నీవు వారికి మేలు చేస్తూ ఉన్నంత కాలం, దానికి వ్యతిరేకంగా వారు నీ పట్ల చెడుగా వ్యవహరిస్తున్నంత కాలం అల్లాహ్ తరఫు నుండి ఒక సహాయకుడు, వారి చెడు వల్ల కలిగే హానిని దూరం చేయుటకుగానూ, నీ వెంట ఉంటాడు.”

فوائد الحديث

అల్లాహ్ సర్వశక్తిమంతుడు చెప్పినట్లుగా, చెడుకు, చెడుతో గాక మంచితో ప్రతిస్పందించడం, చెడుకు పాల్బడిన అపరాధి సత్యమార్గానికి తిరిగి రావడానికి ఒక కారణం అవుతుంది. దివ్య ఖుర్’ఆన్’లో అల్లాహ్ ఇలా అన్నాడు: “చెడును మంచితో తొలగించు; అప్పుడు నీతో విరోధమున్నవాడు కూడా తప్పక నీ ప్రాణస్నేహితు డవుతాడు" (సూరహ్ ఫుస్సిలత్ 41:34).

బాధించబడినా, విశ్వాసియైన దాసుడు అల్లాహ్ యొక్క ఆజ్ఞకు విధేయత చూపడం అనేది, అతనికి అల్లాహ్ యొక్క సహాయం అందడానికి ఒక కారణం అవుతుంది.

బంధుత్వ సంబంధాలను విచ్ఛిన్నం చేయడం, ఈ లోకంలో వేదనకు, దుఃఖానికి కారణం అవుతుంది, పరలోకంలో పాపము మరియు అపరాధంగా పరిగణించబడుతుంది, అతడిని విచారణకు గురిచేస్తుంది.

ఒక ముస్లిం తన మంచి పనులకు అల్లాహ్ నుండి ప్రతిఫలాన్ని ఆశించాలి; ప్రజలు అతడిని అవమానించడం, అతనితో సంబంధాలను త్రెంచేసుకోవడం కారణంగా అతడు మంచి పనులు చేయుటను ఆపరాదు.

బంధువులతో బంధుత్వ సంబంధాలను కొనసాగించేవాడు ఎవరంటే - తనతో బంధుత్వాన్ని కొనసాగించే వారితో బంధుత్వ సంబంధాలను కొనసాగించే వాడు కాదు; ఎవరైతే తనతో సంబంధాలను త్రెంచేసుకున్నారో వారితో కూడా మనస్ఫూర్తిగా బంధుత్వాన్ని కొనసాగించేవాడు.

التصنيفات

బంధుత్వాలను కలపటం యొక్క ప్రాముఖ్యతలు