కాదు, మీరు ఇలా చెప్పండి: 'మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము.…

కాదు, మీరు ఇలా చెప్పండి: 'మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము'

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన: "ఆకాశాలలో, భూమిపై ఉన్న సమస్తమూ అల్లాహ్ దే. మీరు మీ మనస్సులలో ఉన్న విషయాలను వెల్లడి చేసినా లేక దాచినా, వాటి గురించి అల్లాహ్ మీతో లెక్క తీసుకుంటాడు. ఆ తర్వాత ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు. మరియు అల్లాహ్ ప్రతి దానిపై సర్వశక్తిమంతుడు" [అల్ బఖరహ్ 2:284] అన్న ఖుర్ఆన్ వచనం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై అవతరించినప్పుడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులకు అది భారంగా తోచింది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి తమ మోకాళ్ళపై కూర్చొని, “ఓ రసూలుల్లాహ్! మాలో నిర్వర్తించగల శక్తి ఉన్న ఆచరణలే మాపై మోపబడ్డాయి: నమాజ్, ఉపవాసాలు, జిహాద్ మరియు దానధర్మాలు. కాని ఇప్పుడు మీపై ఈ ఆయతు అవతరించింది. దీనిని భరించే శక్తి మాలో లేదు” అని విన్నవించుకున్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: «మీకు పూర్వం గ్రంథప్రజలు (యూదులు, క్రైస్తవులు) "మేము విన్నాము కాని అంగీకరించట్లేదు" అన్నట్లుగా మీరు కూడా అలాగే జవాబు చెబుదామని అనుకుంటున్నారా ఏమిటి? కాదు, మీరు ఇలా చెప్పండి: 'మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము'». వారు అన్నారు: "మేము విన్నాము. శిరసావహించాము. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరికి మేమంతా నీవైపునకే మరలివస్తాము". ప్రజలు ఆ వచనాలను పలుకగా, వారి నాలుకలు వాటితో పలచబడిన తరువాత, అల్లాహ్ దాని వెనుకే ఈ ఆయతును అవతరింపజేశాడు: {ప్రవక్త తనపై తన ప్రభువు నుండి అవతరించిన దాన్ని విశ్వసించాడు. ఈ ప్రవక్తను అనుసరించే వారు కూడా దానిని హృదయపూర్వకంగా స్వీకరించారు. వారంతా అల్లాహ్ నూ, ఆయన దూతలనూ, ఆయన గ్రంథాలనూ, ఆయన ప్రవక్తలనూ విశ్వసించారు. వారు ఇలా అంటారు: మేము ఆయన ప్రవక్తలలో ఏ ఒక్కరినీ భేదభావంతో చూడము. మేము ఆదేశం విన్నాం. శిరసా వహించాం. ప్రభూ! క్షమాభిక్ష పెట్టు అని మేము నిన్ను అర్థిస్తున్నాము. చివరకు మేమంతా నీవైపునకే మరలి వస్తాము} [అల్ బఖరహ్ 2:285]. వారు అలా చేయగానే, అల్లాహ్ దానిని రద్దుపరచి, ఈ ఆయతును అవతరింపజేశాడు: {ఏ ప్రాణిపైనా అల్లాహ్ దాని శక్తిసామర్థ్యాలకు మించిన బరువు బాధ్యతలను మోపడు. తాను సంపాదించిన పుణ్యానికి సత్ఫలితాన్నీ, తాను కూడబెట్టిన పాపానికి దుష్ఫలితాన్నీ ప్రతి వ్యక్తీ అనుభవిస్తాడు. ఓ మా ప్రభూ! మేము మరచినా లేక తప్పు చేసినా మమ్మల్ని పట్టుకోకు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {ప్రభూ! మాకు పూర్వం వారిపై మోపిన భారాన్ని మాపై మోపకు!} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {ప్రభూ! ఏ బరువును మోసే శక్తి మాలో లేదో, దానిని మాపై మోపకు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు. {మమ్మల్ని మన్నించి వదలిపెట్టు. మమ్మల్ని క్షమించు. మమ్మల్ని కరుణించు. నీవు మాకు రక్షకుడవు. అవిశ్వాసులకు వ్యతిరేకంగా నీవు మాకు సహాయపడు} [అల్ బఖరహ్ 2:286] దానికి ఆయన «సరే» అన్నాడు.

[ప్రామాణికమైన హదీథు] [ముస్లిం నమోదు చేసినారు:]

الشرح

మహోన్నతుడు, పరమ పవిత్రుడైన అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై తన ఈ వాక్కును అవతరింపజేసినప్పుడు: {ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా అల్లాహ్ దే!} సృష్టిపరంగా, అధికారం పరంగా, నియంత్రణ మరియు పర్యాలోచన పరంగా. {మరియు మీరు మీ మనస్సులలో ఉన్నది} అంటే మీ హృదయాలలో ఉన్నది, {వెలిబుచ్చినా} అంటే బహిర్గతం చేసినా లేదా గోప్యంగా ఉంచినా, {లేదా దానిని దాచినా} అంటే రహస్యంగా ఉంచినా లేదా మీ హృదయాలలో దాచిపెట్టినా, {అల్లాహ్ మీ నుంచి దాని లెక్క తీసుకుంటాడు} ప్రళయదినాన. {ఆయన తాను కోరిన వారిని క్షమిస్తాడు} తన అనుగ్రహం మరియు కారుణ్యంతో, {మరియు తాను కోరిన వారిని శిక్షిస్తాడు} తన న్యాయంతో, {మరియు అల్లాహ్ ప్రతి వస్తువుపై శక్తి గలవాడు} ఆయనను ఏదీ అసమర్థునిగా చేయలేదు. సహాబాలు దానిని విన్నప్పుడు, అది వారికి చాలా భారంగా తోచింది; ఎందుకంటే దానిలో హృదయంలో మెదిలే ఆలోచనలపై కూడా పట్టు ఉంటుందని ఉంది. వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి వెళ్ళి, (ఆయన ఎదురుగా) మోకాళ్ళపై కూర్చొని ఇలా విన్నవించుకున్నారు: “ఓ రసూలుల్లాహ్! ఇంతకు ముందు మాపై, మేము నిర్వర్తించగల శారీరక ఆచరణలే మోపబడ్డాయి; ఉదాహరణకు నమాజ్, ఉపవాసాలు, జిహాద్ మరియు దానధర్మాలు. కాని ఇప్పుడు మీపై ఈ ఆయతు అవతరించింది, మరియు మేము దానిని పూర్తి చేయలేము.” అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు: “యూదులు మరియు క్రైస్తవులు చెప్పినట్లుగా మీరు కూడా: {మేము విన్నాము మరియు అవిధేయత చూపాము} అని చెప్పాలని అనుకుంటున్నారా? దానికి బదులుగా ఇలా చెప్పండి: {మేము విన్నాము మరియు విధేయులం అయ్యాము. ఓ మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే.}” సహాబాలు అల్లాహ్ మరియు ఆయన సందేశహరుని ఆదేశానికి స్పందించి, ఇలా అన్నారు: “మేము విన్నాము మరియు విధేయులం అయ్యాము. మా ప్రభూ! మేము నీ క్షమాభిక్షను అర్ధిస్తున్నాము. కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే.” ముస్లింలు తమ నోళ్ళతో దాన్ని పలికి, వారి ఆంతర్యాలు దానికి లొంగిపోయినప్పుడు; ప్రవక్త మరియు ఆయన సమాజమును ప్రశంసిస్తూ అల్లాహ్ ఈ వచనమును అవతరింపజేశాడు: {آمَنَ الرَّسُولُ بِمَا أُنْزِلَ إِلَيْهِ مِنْ رَبِّهِ وَالمُؤْمِنُونَ} మరియు వారి నోళ్ళు మరియు హృదయములు అల్లాహ్ ఆజ్ఞకు లొంగిపోయాయి. {వారంతా అల్లాహ్ ను, ఆయన దూతలను, ఆయన గ్రంథాలను మరియు ఆయన ప్రవక్తలను విశ్వసించారు. మేము ఆయన ప్రవక్తల మధ్య ఎలాంటి భేదభావాలను చూపము.} అంతేకాక, మేము వారందరినీ విశ్వసిస్తాము. {మరియు వారు ఇలా అన్నారు: మేము} నీ మాటను {విన్నాము} మరియు నీ ఆజ్ఞకు {విధేయులం అయ్యాము}. మేము {మా ప్రభూ నీ క్షమాభిక్షను} మరియు నీ మన్నింపును అర్ధిస్తున్నాము. {మరియు కడకు మేము మరలి రావలసింది నీ వద్దకే}, తీర్పు దినాన తిరిగి రావలసిన చోటు కూడా నీ వద్దకే. వారు అలా చేసి, అల్లాహ్ ఆజ్ఞలను వింటూ, విధేయత చూపుతూ, చెప్పమని ఆజ్ఞాపించబడిన దానిని చెప్పినప్పుడు; అల్లాహ్ ఈ సమాజంపై భారాన్ని తగ్గించి, ఆ ఆయతును తన ఈ మాటతో రద్దు చేశాడు: {అల్లాహ్ ఏ ప్రాణిపై కూడా దాని శక్తికి మించిన భారాన్ని మోపడు}, అనగా దాని శక్తి, సామర్థ్యం మరియు ప్రయత్నం మేరకు మాత్రమే (మోపుతాడు). {దానికి} తాను సంపాదించిన మరియు చేసిన మంచికి ప్రతిఫలం (పుణ్యం) లభిస్తుంది, {మరియు దానిపై} తాను చేసిన పాపానికి మరియు అపరాధానికి శిక్ష పడుతుంది. మరియు అల్లాహ్ ఒకరి పాపానికి మరొకరిని శిక్షించడు, అలాగే ఒకరి మనస్సులో మెదిలే (చెడు) ఆలోచనలకు కూడా శిక్షించడు. {رَبَّا لَا تُؤَاخِذْنَا} అంటే మమ్మల్ని శిక్షించకు, {إِنْ نَسِينَا} అంటే మేము గుర్తుంచుకోలేకపోయినా, {أَوْ أَخْطَأْنَا} అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా మరచిపోయి సరైన మార్గాన్ని వదిలేసినా. అప్పుడు అల్లాహ్ వారి ఈ ప్రార్థనను స్వీకరించి ఇలా పలికాడు: సరే, నేను అంగీకరించాను. {ఓ మా ప్రభూ! మాపై భారం మోపకు} అంటే కష్టాన్ని, బరువును, {పూర్వం వారిపై మోపినట్లు} అంటే బనీ ఇస్రాయీల్ మరియు ఇతరులపై. దానికి అల్లాహ్ సమాధానమిస్తూ ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను. {ఓ మా ప్రభూ! మేము సహించలేని భారం మాపై వేయకు} అంటే మేము మోయలేని విధులు, పరీక్షలు మరియు ఇతర విషయాల భారం. అల్లాహ్ ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను. {మమ్మల్ని మన్నించు} అంటే మా పాపాలను మా నుండి తుడిచివేయి, {మమ్మల్ని క్షమించు} అంటే మా పాపాలను మాపై కప్పిపుచ్చి, వాటిని ఉపేక్షించు, {మమ్మల్ని కరుణించు} నీ అపారమైన కరుణతో. {నీవే మా సంరక్షకుడవు} మరియు మా యజమానివి; {కావున మాకు సహాయం చేయి} సాక్ష్యాలను స్థాపించడం మరియు ఆధిపత్యం ద్వారా {సత్యతిరస్కారులకు విరుద్ధంగా} వారితో చేసే పోరాటంలో మరియు ధర్మయుద్ధంలో . అప్పుడు అల్లాహ్ సమాధానమిచ్చి, ఇలా అన్నాడు: అవును, నేను అలా చేశాను.

فوائد الحديث

వారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కారణంగా ఈ ఉమ్మత్‌పై ఉన్న అల్లాహ్ తఆలా కారుణ్యం యొక్క వివరణ. ఆయన హోదాను గొప్ప చేస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: {మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.} [అల్-అంబియా 21:107].

పవిత్ర ఖుర్ఆన్ లో ఆయతుల రద్దు నిరూపితమై ఉన్నది మరియు ఖుర్ఆన్ లో కొన్ని ఆయతులు పఠించబడతాయి కానీ వాటి ఆదేశము రద్దు చేయబడినది, కావున వాటిపై ఆచరించబడదు.

అల్లాహ్ ఆజ్ఞకు సంపూర్ణ విధేయత చూపడంలో మరియు ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆజ్ఞను అనుసరించడంలో సహాబాల రదిఅల్లాహు అన్హుమ్ ఘనత.

గత సమాజాలు అల్లాహ్ తఆలా ఆదేశాలను తిరస్కరించి అనుసరించిన మార్గాన్ని తన ఉమ్మత్ కూడా అనుసరిస్తుందేమోనని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ పట్ల తీవ్రమైన భయాన్ని కలిగి ఉండేవారు.

సర్వోన్నతుడైన అల్లాహ్ ఆదేశానికి శిరసావహించడం విధి మరియు ఆయన ఆదేశాన్ని వ్యతిరేకించడంలో గ్రంథప్రజల సారూప్యతను కలిగి ఉండటం నుండి హెచ్చరిక ఉన్నది.

పూర్వపు సమాజాలపై ఈ ఉమ్మతు యొక్క ప్రాధాన్యతను గూర్చిన వివరణ ఉన్నది. ఎందుకంటే వారు తమ ప్రవక్తలతో, "మేము విన్నాము మరియు అవిధేయత చూపాము" అని అన్నారు. అయితే ఈ ఉమ్మతు, "మేము విన్నాము మరియు విధేయత చూపాము" అని పలికింది.

ఈ ఉమ్మత్ యొక్క ఘనత, దాని నుండి సంకటాన్ని ఎత్తివేయడంలో, మతిమరుపు మరియు పొరపాటు పట్టుకోబడకూడదని చేసిన ప్రార్థన స్వీకరించబడటంలో, గత సమాజాలపై ఉన్న భారాలను ఎత్తివేయడంలో, మరియు అది భరించలేని భారాన్ని దానిపై మోపకపోవడంలో ఉంది.

మహోన్నతుడైన అల్లాహ్ మన శక్తికి మించిన భారాన్ని మనపై మోపడు, మరియు మన హృదయాలలో మెదిలే దురాలోచనల వైపు మనం మొగ్గు చూపనంత వరకు, వాటితో సంతృప్తి చెందనంత వరకు, మరియు వాటిని ఆచరించనంత వరకు, అవి మనకు హాని కలిగించవు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు సహాబాల రదియల్లాహు అన్హుమ్ తరువాత వచ్చేవారి కోసం కూడా ఇది ఒక దుఆగా ఉండాలనే ఉద్దేశ్యంతో, అల్లాహ్ తన గ్రంథంలో ఈ దుఆను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరియు విశ్వాసుల పక్షాన తెలియజేశాడు. కావున, ఈ దుఆను కంఠస్థం చేయడం మరియు దీనిని అధికంగా పఠించడం వాంఛనీయం.

التصنيفات

సూరాలు మరియు ఆయతుల ప్రాముఖ్యతలు., వచనాల వ్యాఖ్యానం