“నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్లాహ్ (తన దాసుల) పాపాలను తుడిచి వేస్తాడు, మరియు…

“నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్లాహ్ (తన దాసుల) పాపాలను తుడిచి వేస్తాడు, మరియు (స్వర్గములో) వారి స్థానాలను ఉన్నతం చేస్తాడు?

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను ఒక విషయం వైపునకు మార్గదర్శనం చేయనా – దాని ద్వారా అల్లాహ్ (తన దాసుల) పాపాలను తుడిచి వేస్తాడు, మరియు (స్వర్గములో) వారి స్థానాలను ఉన్నతం చేస్తాడు?”. దానికి సహాబాలందరూ “తప్పనిసరిగా ఓ రసూలుల్లాహ్!” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అనుకూలంగా లేని పరిస్థితులలోనూ పరిపూర్ణంగా ఉదూను ఆచరించుట; మస్జిదునకు ఎక్కువ అడుగులతో వెళ్ళుట (ప్రతిరోజూ ఐదు నమాజులను మస్జిదులో ఆచరించుట); ఒక నమాజు తరువాత మరొక నమాజు కొరకు వేచి చూచుట. మరియు అది ‘అర్’రిబాత్’ అనబడుతుంది”.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలను ఇలా ప్రశ్నించారు – పాపాలు క్షమించబడుటకు, సురక్షితంగా ఉన్న ఆచరణల గ్రంథాల నుండి ఆ పాపాలు తుడిచి వేయబడుటకు, మరియు స్వర్గములో స్థానములు ఉన్నతం అయ్యేందుకు కారణమయ్యే ఆచరణల వైపునకు, తాను వారికి మార్గదర్శకం చేయాలని వారు కోరుకుంటున్నారా? అని. అపుడు సహాబాలు “అవును ఓ ప్రవక్తా! మాకు అది కావాలి” అన్నారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: మొదటిది: ఉదూ చేయడానికి అనుకూలంగా లేని పరిస్థితులు ఉన్నపుడు, లేదా ఉదూ చేయడం కష్టమైన పరిస్థితులు ఉన్నపుడు కూడా సమగ్రంగా, సంపూర్ణంగా ఉదూ చేయడం. ఉదాహరణకు – నీళ్ళు బాగా చల్లగా ఉండి వేడి చేసే సదుపాయం లేనపుడు, నీళ్ళు కొద్ది పరిమాణములోనే ఉన్నపుడు, లేదా శరీరమంతా నొప్పులతో ఉన్నపుడు, లేదా నీళ్ళు మరీ వేడి వేడిగా ఉన్నపుడు - ఇలాంటి పరిస్థితులలో కూడా సంయమనం పాటిస్తూ, ఉన్న ఉపకరణాలనే ఉపయోగిస్తూ సమగ్రంగా, సంపూర్ణంగా ఉదూ చేయడం. రెండవది: ఇంటికి దూరంగా ఉన్న మస్జిదులకు ఎక్కువ అడుగులు వేస్తూ వెళ్ళుట. ‘అడుగు’ అంటే (నడకలో) రెండు పాదాల మధ్య దూరము. ఇంటికి దూరంగా ఉన్న మస్జిదులకు నడిచి వెళ్ళండి, తరచుగా దీనిని పునరావృతం చేయండి. రోజూ ఆచరించవలసిన ఐదు పూటల సలాహ్’లను మస్జిదులో ఆచరించండి. మూడవది: సలాహ్ సమయం కొరకు వేచి ఉండుట; అంటే ఈ గుణం సలాహ్ తో మన హృదయానికి ఉండే అనుబంధాన్ని తెలుపుతుంది; సలాహ్ కొరకు తయారు కావడం, మస్జిదుకు చేరుకుని జామఅత్ కొరకు వేచి చూస్తూ కూర్చోవడం, అలాగే సలాహ్ పూర్తి అయిన తరువాత (వీలైతే) అక్కడే కూర్చుని తరువాతి సలాహ్ కొరకు వేచి చూచుట – ఇవన్నీ దీని క్రిందకే వస్తాయి. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా వివరించారు: ఇవి వాస్తవములో రక్షణ మరియు స్థిరత్వములకు సంబంధించిన ఆచరణలు. ఈ ఆచరణలు మన ఆత్మ వైపునకు షైతాను యొక్క దారికి అడ్డుగోడలా ఉంటాయి, దారిని అడ్డుకుంటాయి, మూసివేస్తాయి. వాంఛలు, కోరికలను అదుపులో ఉంచుతాయి; షైతాను గుసగుసలను అనుమతించ కుండా ఆత్మ అడ్డుకునేలా చేస్తాయి; ఆ విధంగా అల్లాహ్ సైన్యం షైతాను సైన్యాన్ని ఓడిస్తుంది. అదీ నిజానికి గొప్ప జిహాద్; మరో మాటలో ఇది శత్రువు నుండి (అతడు ప్రవేశించకుండా) సరిహద్దును కాపాడడం.

فوائد الحديث

ఇందులో (ప్రతి ఒక్కరూ ఐదు నమాజులను) మస్జిదులో జామఅత్’తో ఆచరించుట యొక్క ప్రాముఖ్యత, మరియు దానిని పరిరక్షించవలసిన ఆవశ్యకతను చూడవచ్చు.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విషయాన్ని బోధించే విధానంలో ఒక మంచి విధానాన్ని ప్రదర్శించేవారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ముందుగా ఆ విషయానికి సంబంధించిన గొప్ప బహుమతితో ప్రారంభించి, ప్రశ్నల రూపంలో వారిలో మరింత ఉత్సుకత నింపేవారు. తరువాత ఆ విషయాన్ని వెల్లడించారు. విషయాన్ని బోధించే విధానాలలో ఇది ఒకటి.

ప్రశ్న మరియు సమాధానాలతో సమస్యను ముందుంచడం వల్ల కలిగే ప్రయోజనం: సందిగ్ధత మరియు స్పష్టీకరణ కారణంగా ఆ ప్రసంగం ఆత్మను తాకుతుంది.

ఇమామ్ ఆన్’నవవీ రహిమహుల్లాహ్ ఇలా అన్నారు: “ఇది “అర్’రిబాత్’, అంటే: అది మనం కావాలని కోరుకునే బంధం. ‘రిబాత్’ అనే పదం యొక్క మూలార్థము ‘దేనినైనా బంధించి ఉంచడం, దానిని పరిమితం చేయడం’; అంటే దాసుడు తనను తాను (తన ప్రభువు యొక్క) విధేయతకు బంధించుకుని ఉండడం. ధర్మపండితులు ఇంకా ఇలా అన్నారు: అది ఉత్తమమైన బంధం; ధర్మ పండితులు ఇంకా ఇలా అన్నారు: ‘జిహాద్’ అంటే తన ఆత్మతో తాను స్వీయజిహాద్ (స్వీయపోరాటం) చేయడం. మరియు అది (ప్రతి ఒక్కరికీ) అందుబాటులో ఉన్న బంధం, మరియు (ప్రతి ఒక్కరికీ) సాధ్యమయ్యే బంధం, అది సాధ్యమే. అంటే: ఇది (అర్’రిబాత్) అటువంటి బంధాలలో ఒకటి.

ఈ హదీసులో “రిబాత్” అనే పదం చాలా సార్లు పునరావృతం అయ్యింది. అది (ال) అనే డెఫినైట్ ఆర్టికిల్ (నిర్దిష్టోపపదం) తో ప్రస్తావించబడినది. ఇది ఈ ఆచరణ యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో తెలియజేస్తుంది.

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు