“ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు…

“ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)

అబ్దుల్లాహ్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను: “ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి) ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సూచించినారు: ఎవరైతే సలాహ్ (నమాజు) కొరకు ముఅజ్జిన్ పలికే అజాన్ పలుకులు వింటే, ఆ అజాన్ పదాలను ముఅజ్జిన్ (పలికిన వెంటనే అతని) వెనుకే తిరిగి వల్లించాలి, “హయ్య అలస్సలాహ్ – హయ్య అలల్ ఫలాహ్” అనే రెండు వాక్యాలు తప్ప. అజాన్ వింటున్న వ్యక్తి ఈ రెండు వాక్యాలు విన్నప్పుడు, “లా హౌల, వలా ఖువ్వత ఇల్లాబిల్లాహ్” అని పలకాలి. అజాన్ పూర్తి అయిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ‘సలవాత్’ (దరూద్) పఠించాలి. ఎందుకంటే ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ఒకసారి ‘సలవాత్’ పఠిస్తారో, దాని కారణంగా అల్లాహ్ వారికి పదింతలుగా ‘సలవాత్’ ను ప్రసాదిస్తాడు. అల్లాహ్ ‘సలవాత్’ ను ప్రసాదించడం అంటే దాని అర్థము అల్లాహ్ అటువంటి దాసుణ్ణి గురించి తన దైవదూతల మధ్య ప్రస్తావించడం, పొగడడం. తరువాత తనకు ‘వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనమని ఆదేశించినారు. అది ఒక సమున్నతమైన స్థానము. (స్వర్గములోని స్థానములన్నింటిలోనూ) అది అత్యున్నతమైన స్థానము. ఆ స్థానము పొందుటకు ఎవ్వరూ అర్హులు కారు, మరియు ఎవరికీ సాధ్యము కాదు – సర్వోన్నతుడైన అల్లాహ్ దాసులందరిలోను కేవలం ఒక్కరికి తప్ప. (దానిని గురించి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఆ ఒక్కరూ నేను కావాలని నా ఆశ” అని. నిజానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలా అనడం వారి వినయాన్ని, అణకువను, నమ్రతను తెలుపుతుంది. ఆ స్థానము పొందడానికి కేవలం ఒక్కరు మాత్రమే అర్హులైనట్లయితే, అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాక ఇంకెవరు కాగలరు. ఎందుకంటే సృష్ఠి మొత్తంలో కేవలం ఆయన మాత్రమే అత్యుత్తముడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలిపినారు – ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు 'వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొంటారో, వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సిఫారసు పొందుతారు.

فوائد الحديث

ఈ హదీసులో ముఅజ్జిన్ పలికిన విధంగా అవే పదాలను తిరిగి పలకాలి అనే హితబోధ ఉన్నది.

అలాగే ఈ హదీసులో ముఅజ్జిన్ యొక్క అజాన్ పూర్తి అయిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై ‘సలవాత్’ (దరూద్) పఠించుట యొక్క ఘనత తెలుస్తున్నది.

అదే విధంగా ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పై దరూద్ పఠించిన తరువాత, వారికి ‘వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్’ను వేడుకోవాలనే హితబోధ ఉన్నది.

‘వసీలహ్’ అంటే దాని అర్థము (స్వర్గములో) అదొక సమున్నతమైన, అత్యున్నతమైన స్థానము అని వివరణ, మరియు అది కేవలం ఒక్కరికి మాత్రమే ప్రసాదించబడుతుంది అనే వ్యాఖ్యానాలు ఉన్నాయి.

(స్వర్గములో) అత్యున్నతమైన స్థానము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు నిర్ధారణ అయి ఉన్నది అనే విషయము, వారి ఘనతను తెలియజేస్తున్నది.

ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు ‘వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకుంటారో వారికి సిఫారసు తప్పనిసరిగా ప్రసాదించబడుతుంది.

స్వర్గములో ఆ అత్యున్నత స్థానము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కే ఇవ్వబడుతుంది అనే విషయం నిర్ధారణగా తెలిసినప్పటికీ, తనకు ఆ స్థానము ప్రసాదించమని అల్లాహ్’ను వేడుకొనండి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన ఉమ్మత్ ను కోరడంలో వారి వినయము, అణకువ, నమ్రత తెలుస్తున్నాయి.

అల్లాహ్ యొక్క కరుణ, ఆయన యొక్క ఘనత అపారమైనవి – ఒక మంచి పనికి బదులుగా దాని ప్రసాదించబడే ప్రతిఫలాన్ని పదింతలుగా హెచ్చించి మరీ ప్రసాదిస్తాడు ఆయన.

التصنيفات

అంతిమ దినంపై విశ్వాసం., అంతిమ దినంపై విశ్వాసం., జిక్ర్ ప్రాముఖ్యతలు, జిక్ర్ ప్రాముఖ్యతలు, అజాన్ మరియు ఇఖామత్, అజాన్ మరియు ఇఖామత్