నరకపు వాసులలో నేను చూడని రెండు రకాలు ఉన్నారు, వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆవు తోకలవంటి కొరడాలు కలిగిన జాతి,…

నరకపు వాసులలో నేను చూడని రెండు రకాలు ఉన్నారు, వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆవు తోకలవంటి కొరడాలు కలిగిన జాతి, వాటితో వారు ప్రజలను కొడుతున్నారు; తాము స్వయంగా చెడు వైపునకు మొగ్గు చూపుతూ, చెడు వైపునకు ఆహ్వానిస్తూ దుస్తులు ధరించి కూడా నగ్నంగా కనిపించే స్త్రీలు

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: నరకపు వాసులలో నేను చూడని రెండు రకాలు ఉన్నారు, వారిని నేను ఎన్నడూ చూడలేదు. ఆవు తోకలవంటి కొరడాలు కలిగిన జాతి, వాటితో వారు ప్రజలను కొడుతున్నారు; తాము స్వయంగా చెడు వైపునకు మొగ్గు చూపుతూ, చెడు వైపునకు ఆహ్వానిస్తూ దుస్తులు ధరించి కూడా నగ్నంగా కనిపించే స్త్రీలు; వారి తలలు (కొప్పులు) ఒంటెల మూపురాల మాదిరి ఎత్తుగా ఉండి ఒక వైపునకు వంగి ఉంటాయి. వారు స్వర్గములో ప్రవేశించలేరు, స్వర్గపు పరిమళం కూడా చూడలేరు – వాస్తవానికి స్వర్గపు పరిమళం చాలా చాలా దూరం నుండి వస్తూ ఉంటుంది.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రెండు రకాల ప్రజలను గురించి హెచ్చరించినారు. వారిని ఆయన ఎప్పుడూ చూడలేదు, అంటే ఆ రెండు రకాల ప్రజలు ఆయన కాలంలో లేరు, ఆయన తరువాతి కాలంలో ఉంటారు. మొదటి రకం ప్రజల లక్షణాలు: వీరు ఆవు తోకల వంటి పొడవాటి కొరడాలు కలిగి ఉంటారు. వాటితో ప్రజలను కొడుతూ ఉంటారు. వీరు ప్రజలను అన్యాయంగా కొట్టే పోలీసులు మరియు అణచివేతదారుల సైనికులు. రెండవ రకం ప్రజల లక్షణాలు: వీరు స్త్రీలు. వీరు సాధారణంగా స్త్రీ స్వభావంలో భాగమైన పవిత్రత, నమ్రత, బిడియం అనే వస్త్రాన్ని తొలగించిన స్త్రీలు. వారి వర్ణన: వారు తమ చర్మం రంగును బహిర్గతం చేసే పారదర్శక దుస్తులను ధరిస్తారు కాబట్టి వారు దుస్తులు ధరించినప్పటికీ, వాస్తవార్థంలో నగ్నంగా ఉంటారు; మరియు వారు తమ శరీర భాగాలను కొన్నింటిని కప్పి ఉంచి, తమ అందాన్ని చూపించడానికి ఇతర భాగాలను బహిర్గతం చేస్తారు. వారు తమ వస్త్రధారణతో, మరియు పొగరైన నడకతో మగవారి హృదయాలను తమ వైపునకు త్రిప్పుకుంటారు. వారు తమ భుజాలను కవ్వించే విధంగా వంచి నడుస్తారు; మరియు ఇతరులను కూడా వారు అనుసరించే దుర్మార్గపు మార్గాల వైపునకు ఆహ్వానిస్తారు. అంతేకాదు, వారి తలలు (కొప్పులు) ఒక వైపునకు వొంగి ఉండే, ఒంటె యొక్క మూపురం లాగా ఉంటాయి, ఎందుకంటే వారు తమ తలలను ఉత్తరీయము లేక అటువంటి వస్త్రాలను (స్కార్ఫ్’ల వంటివి) చుట్టడం ద్వారా ఘనంగా, పెద్దదిగా కనబడేలా చేస్తారు. ఒంటెల మూపురాలతో పోలిక ఎందుకంటే, వారి తల వెంట్రుకలు మరియు వారి జడలు వారి తలల పైభాగానికి ఎగిసిపోయి ఉంటాయి. వారు ఆ తల వెంట్రుకలను జడలుగా వేరు చేసి, ఒంటె మూపురం ఒకవైపుకు వాలిపోయి ఎలా ఉంటుందో, అలా తలకు ఒకవైపు వాలిపోయేలా చేస్తారు. ఈ వర్ణన ఏ స్త్రీలకైతే సరిపోతుందో, వారికి ఈ హదీసులో కఠినమైన హెచ్చరిక ఉన్నది. వారు స్వర్గములోనికి ప్రవేశించలేరు, దాని పరిమళాన్ని కూడా ఆస్వాదించలేరు, కనీసం దాని దరిదాపులకు కూడా వెళ్ళలేరు – వాస్తవానికి స్వర్గపు పరిమళం దూరదూరాల నుండి కూడా ఆఘ్రాణించబడుతుంది

فوائد الحديث

ఏ పాపమూ ఎరుగని, ఏ తప్పూ చేయని అమాయక ప్రజలను కొట్టడం, హింసించడం నిషేధము.

దౌర్జన్య పరులకు, వారి దౌర్జన్యానికి సహాయపడడం, సహకరించడం నిషేధము.

స్త్రీలు తమ అలంకారాన్ని, సౌందర్యాన్ని బహిర్గతం చేయడానికి వ్యతిరేకంగా, అన్ని వేళలా తప్పనిసరిగా కప్పి ఉంచవలసిన తమ శరీర భాగాలు (ఔరహ్) ప్రస్ఫుటమయ్యేలా బిగుతు దుస్తులు ధరించడానికి, మరియు అతి పలుచని దుస్తులు ధరించడానికి వ్యతిరేకంగా వారికి ఇందులో హెచ్చరిక ఉన్నది.

ఈ హదీసులో - ముస్లిం స్త్రీలు అల్లాహ్ యొక్క ఆదేశాలకు కట్టుబడి ఉండాలని, ఆయన ఆగ్రహానికి గురి చేసే మరియు పునరుత్థాన దినమున అత్యంత బాధాకరమైన శిక్షలో పడి ఉండడానికి ఆమెను అర్హురాలిగా చేసే ఆచరణల నుండి దూరంగా ఉండాలని హితబోధ ఉన్నది.

ఈ హదీసు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తత్వ సంకేతాలలో ఒకటి, ఆయన చేసిన భవిష్యవాణులలో ఒకటి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన చూడని విషయాల గురించి చెప్పారు. అవి ఆయన కాలంలో జరుగలేదు, తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పినట్లుగానే జరుగుతున్నాయి.

التصنيفات

స్వర్గము,నరకము యొక్క లక్షణాలు