إعدادات العرض
“నా తరువాత, మీ గురించి నేను భయపడే వాటిలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు…
“నా తరువాత, మీ గురించి నేను భయపడే వాటిలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు దాని అలంకరణ”
అబూ సఈద్ అల్ ఖుద్రీ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబర్’పై కూర్చుని ఉన్నారు. మేమంతా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం చుట్టూ కూర్చుని ఉన్నాము, అపుడు వారు ఇలా అన్నారు: “నా తరువాత, మీ గురించి నేను భయపడే వాటిలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు దాని అలంకరణ”. ఒక వ్యక్తి “ఓ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం! ఏమీ, మంచి చెడును తీసుకు వస్తుందా?” అని ప్రశ్నించాడు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండి పోయారు. అక్కడున్నవారు అతడిని “ఏమైంది నీకు? నీవు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో మాట్లాడుతావా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మాట్లాడుతున్నది నీతో కాదు కదా?” అని మందలించారు. అయితే మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఏదో అవతరిస్తున్నట్లుగా గమనించినాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నుదుటిపై పట్టిన చెమట బిందువులను తుడిచి వేసుకుని “ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడ?” అని అడిగారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ ప్రశ్న అడిగినందుకు అతడిని మెచ్చుకుంటున్నట్లుగా అనిపించింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మంచి ఎప్పుడూ చెడును పుట్టించదు. నిజానికి అది నీటి ప్రవాహం ఒడ్డున పెరిగే ఒక రకం పచ్చిక లాంటిది, అది జంతువులను చంపుతుంది లేదా అనారోగ్యానికి గురి చేస్తుంది, ఒక జంతువు ఖదీరా (ఒక రకమైన కూరగాయ) తిని, ఆపై సూర్యుని వైపు తిరిగి, మలవిసర్జన చేసి, మూత్ర విసర్జన చేసి, మళ్ళీ మేస్తుంది తప్ప (తినేసి అలాగే ఉండిపోయి ప్రాణం మీదకు తెచ్చుకోదు). నిస్సందేహంగా ఈ సంపద మధురమైనది, పచ్చగా (ఆకర్షణీయంగా) ఉంటుంది. అయితే తన సంపదలో నుండి పేదవారికి, అనాథలకు, అన్నీ కోల్పోయిన ప్రయాణీకులకు దానం చేసేవాని సంపద ధన్యమైనది." లేక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బహుశా ఇలా అన్నారు: “నిస్సందేహంగా, దానిని (సంపదను) ధర్మవిరుద్ధంగా సంపాదించేవాడు ఎంత తిన్నప్పటికీ సంతృప్తి చెందని వానిలాంటి వాడు. మరియు అతని సంపద పునరుత్థాన దినమున అతనికి వ్యతిరేకంగా సాక్షిగా మారుతుంది.”
الترجمة
العربية বাংলা Bosanski English Español فارسی Français Bahasa Indonesia Русский Tagalog Türkçe اردو 中文 हिन्दी ئۇيغۇرچە Hausa Kurdî Kiswahili Português සිංහල Nederlands Tiếng Việt অসমীয়া ગુજરાતી አማርኛ پښتو ไทย മലയാളം नेपाली Magyar ქართულიالشرح
ఒకరోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మెంబెర్ పై కూర్చుని తన సహాబాలతో మాట్లాడుతున్నారు, అపుడు వారు ఇలా అన్నారు: “నేను (చని) పోయిన తరువాత, మీ గురించి నేను భయపడే విషయాలలో ఒకటి ఏమిటంటే మీ కొరకు తెరువబడే ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మరియు అలంకారాలు, దాని ఆనందాలు – మరియు జీవితం ఎంతో స్వల్పమైనది అయినప్పటికీ ప్రజలు గొప్పగా చెప్పుకునే వస్తువులు, దుస్తులు, పంటలు మరియు ఇతర వస్తువులు. ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఇలా అడిగాడు: “ఈ ప్రాపంచిక వైభవం, దాని సౌందర్యము మొదలైనవి అల్లాహ్ తరఫు నుండి ఆయన అనుగ్రహం మరియు శుభాలు కదా! మరి ఆ శుభాలే వెనుదిరిగి శాపాలుగా, శిక్షలుగా మారుతాయా?” దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మౌనంగా ఉండి పోవడం చూసి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆగ్రహానికి గురయ్యారేమో అనుకుని అక్కడున్న వారు ఆ ప్రశ్నించిన వానిని మందలించారు. తరువాత అక్కడున్న వారికి – ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై ఎదో అవతరిస్తున్నది అన్న విషయం స్పష్టమై పోయింది. కొద్ది సేపటికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం (వహీ అవతరణ కారణంగా) తన నుదిటికి పట్టిన చెమటను తుడుచుకుని “ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎక్కడ?” అని అడిగారు. అతడు: “హాజరుగా ఉన్నాను ఓ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం” అన్నాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ను స్తుతించి, ఆయనకు ప్రశంసలు అర్పించి ఇలా అన్నారు: “నిజమైన మంచితనం మంచితనాన్ని మాత్రమే తీసుకు వస్తుంది. కానీ ఈ ప్రాపంచిక వైభవం, దాని అలంకారం, సౌదర్యము – ఇవి స్వచ్ఛమైన మంచితనం కాదు. ఎందుకంటే దాని ఆకర్షణ, ప్రలోభము, మరియు పోటీ మొదలైనవి సంపూర్ణంగా పరలోక జీవితంపై శ్రద్ధ వహించ కుండా, వాటిలోనే నిమగ్నమై పోయేలా చేస్తాయి. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఒక ఉదాహరణ ద్వారా వివరించినారు: వసంతకాలపు మొక్కలు మరియు ఖదిర్’ని (ఇది ఒక రకమైన మొక్క, దీనిని పశువులు ఇష్టంగా తింటాయి) అధికంగా తినడం వల్ల ఆ మొక్కలు పశువులను చంపవచ్చు లేదా మృత్యువు అంచులకు చేర్చవచ్చు. దీనికి మినహాయింపు – ఖదిర్ తినే పశువు, దాని కడుపు రెండు వైపులా నిండిపోయే వరకు తిని, తరువాత అది సూర్యుని వైపునకు తిరిగి, తన కడుపు నుండి పేడని విసర్జిస్తుంది, లేదా మూత్రవిసర్జన చేస్తుంది. తరువాత అది తన కడుపులో ఉన్న దానిని పైకి తెచ్చి నెమరు వేస్తూ, నమిలిన తరువాత మింగుతుంది, తరువాత మళ్ళీ మేయడం ప్రారంభిస్తుంది. సంపద మధురంగా, పచ్చగా ఆకర్షణీయంగా ఉండే ఒక రకమైన మొక్క లాంటిది. ఆ మొక్క ఒకవేళ చాలా ఎక్కువగా ఉంటే అది ప్రాణం తీయగలదు, లేదా దాదాపు మృత్యువు అంచుల వరకూ తీసుకు వెళ్ళగలదు. నిజానికి సంపద అవసరమైనదే. దానిని ధర్మబధ్ధమైన మార్గములో, కొద్ది మొత్తములో తీసుకుని, అవసరానికి తగినంత మాత్రమే ఉపయోగించినట్లయితే, అది అతనికి ఎటువంటి హాని కలుగజేయదు. ఒక ముస్లిం తన సంపదలో కొద్ది భాగాన్ని పేదలకు, అనాథలకు, సర్వమూ కోల్పోయిన బాటసారులకు పంచినట్లయితే (దానము చేసినట్లయితే), ఆ సంపద అతనికి ఒక మంచి సహచరునిగా మారుతుంది. ఎవరైతే సంపదను ధర్మబద్ధంగా సంపాదించి తనతో ఉంచుకుంటాడో అది అతనికి ఒక వరం లాంటిది. కానీ ఎవరైతే దానిని అధర్మంగా, అధర్మ మార్గాలలో సంపాదిస్తాడో అతడు ఎంత తిన్నా సంతృప్తి చెందని వ్యక్తి లాంటి వాడు. ఆ సంపద తీర్పు దినమున అతనికి వ్యతిరేకంగా సాక్షిగా నిలబడుతుంది.فوائد الحديث
ఇమాం అన్’నవవీ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథులో ఎవరైతే సంపదను ధర్మబద్ధంగా మరియు దర్మబద్ధమైన మార్గాలలో సంపాదిస్తాడో, మరియు సంపదను ధర్మబద్ధంగా ఖర్చుచేస్తాడో, అటువంటి సంపద యొక్క ఘనత ఉన్నది.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన జాతి (ఉమ్మత్ యొక్క) పరిస్థితిని గురించి వివరించారు, మరియు వారి కొరకు ఈ లోకపు వైభవాలు, అలంకరణలు మరియు సౌందర్యాల కారణంగా వారి కొరకు ప్రలోభాలు ఎలా తెరవబడతాయో వివరించారు.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శనం చేయు విధానం, ఉపమానాలు మరియు ఉదాహరణలతో కూడి ఉండి, అవి ఆ విషయపు అర్థానికి దగ్గరగా ఉంటాయి. అవి ఆ విషయాన్ని మరింత ప్రభావ వంతంగా అర్థం చేసుకునేలా ఉంటాయి.
ఇందులో దానధర్మాలు చేయుట గురించి, సంపదను సత్కార్యాలలో ఖర్చు చేయుటను గురించి ప్రోత్సాహము మరియు సంపదను (పిసినారితనముతో) ఆపుకుని ఉంచుకొనుట పట్ల హెచ్చరిక ఉన్నాయి.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క “నిశ్చయంగా మంచితో పాటు చెడు రాదు” అనే ప్రకటన నుండి అర్థమయ్యేది ఏమిటంటే: జీవనాధారము (సంపద, ఆహారము, పోషణము మొ.) సమృధ్ధిగా ఉన్నప్పటికీ, అది అనుగ్రహము, శుభము, మంచి విషయములో భాగముగానే పరిగణించబడుతుంది. అయితే పిసినారితనం కారణంగా అది అర్హులైన వారికి చేరకుండా నిలిపి ఉంచుకోబడితే; లేదా ధర్మబద్ధం కాని దానికి విరుద్ధమైన విషయాలపై ఖర్చు చేయబడితే అపుడు అది కీడుగా, చెడుగా భావించబడుతుంది. అంతేకాకుండా అల్లాహ్ “మంచి” అని నిర్ణయించినది ఏదీ ఎన్నటికీ “చెడు” కాదు, అలాగే అల్లాహ్ “చెడు” అని నిర్ణయించినదేదీ ఎన్నటికీ “మంచి” కాదు. అయితే ఇందులో భయపడవలసిన అంశం ఏమిటంటే, “మంచి” ప్రసాదించబడిన వ్యక్తి దానిని వినియోగించే విధానాన్ని బట్టి అతనికి అది చెడు కావచ్చు.
జవాబు చెప్పడానికి, కొద్దిగా ఆలోచించవలసిన అవసరం ఉంటే, తొందరపడి సమాధానం చెప్పరాదు.
ఇమాం అత్’తైబీ ఇలా అన్నారు: “దీని నుండి నాలుగు ఉదాహరణలను వెలికి తీయవచ్చును: ఒక పశువు దానిని ఆబగా, చాలా అధికంగా తింటుంది; అలా తినడంలో అది సంతోషిస్తుంది, అది అందులో ఎంతగా మునిగిపోతుందీ అంటే దాని ఉదరపు రెండు ప్రక్కలు కూడా ఉబ్బిపోతాయి. అయినా తినడం ఆపదు; అది దానికి వినాశనాన్ని తీసుకుని వస్తుంది. మరో పశువు కూడా మొదటి దాని లాగానే తింటుంది, కానీ వ్యాధి తీవ్రమైన తర్వాత దానిని నివారించడానికి ఉపాయాలను ఆశ్రయిస్తుంది, కానీ ఆ వ్యాధి దానిని అధిగమించి చంపుతుంది. మూడవది కూడా మొదటి దాని లాగానే తింటుంది, కానీ దానికి హాని కలిగించే దానిని త్వరగా తొలగించుకోవడానికి, అది జీర్ణమయ్యే వరకు దానిని దూరంగా నెట్టడానికి ప్రయత్నిస్తుంది, అది సురక్షితంగా ఉంటుంది. మరియు నాలుగవది, అధికంగా తినదు లేదా అత్యాశకు లోనై తినదు, తన ఆకలిని సంతృప్తిపరిచేంత మరియు తన శ్వాసను నిలిపి ఉంచుకునేంత మాత్రమే తింటుంది, దానికి మాత్రమే తనను తాను పరిమితం చేస్తుకుంటుంది. మొదటిది ఒక అవిశ్వాసి యొక్క ఉదాహరణ, రెండవది ఒక పాపి యొక్క ఉదాహరణ, అతడు పాపపు పనులకు పాల్బడకుండా ఉండుటలో నిర్లక్ష్యంగా ఉంటాడు, పాపపు పనులను చేయడాన్ని ఆపడు, మరియు పశ్చాత్తాపం చెందడంపట్ల నిర్లక్ష్యంగా ఉంటాడు, అప్పటికే అది చాలా ఆలస్యం అయిపోతుంది. మూడవ ఉదాహరణ మంచి పనులను, చెడు పనులను కలగాపులగంగా ఆచరిస్తూ ఉండేవాడు. అతడు పశ్చాత్తాప పడుటలో తొందరపడతాడు, మరియు అతని పశ్చాత్తాపము అంగీకరించ బడుతుంది.
ఇబ్నుల్ మునీర్ (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: “ఈ హదీథులో చాలా మంచి ఉపమానాలు ఉన్నాయి. మొదటిది: సంపదను మరియు దాని పెరుగుదలను ఒక మొక్క మరియు దాని రూపంతో పోల్చడం. రెండవది: సంపద సముపార్జన మరియు దాని మార్గాలపై శ్రద్ధ వహించే వ్యక్తిని గడ్డిపై శ్రద్ధ వహించే జంతువులతో పోల్చడం. మూడవది: సంపద పేరుకు పోవడాన్ని, దానిని తిండిపోతుతనముతో, కడుపుబ్బా తినడంతో పోల్చడం; నాలుగవది: ప్రజల హృదయాలలో సంపదకు గొప్ప విలువ ఉన్నప్పటికీ, దానిని బయటకు వెళ్ళనీయకుండా అతిశయోక్తిలా అనిపించే స్థాయికి పిసినారితనం వహించడాన్ని జంతువు మలవిసర్జన చేసిన దానితో పోల్చడం; ఇది ఒక మంచి పోలిక, షరియత్’లో పిసినారితనం వహించి సంపదను నిలిపి ఉంచుకోవడం అసహ్యంగా పరిగణించబడుతుందని ఇది తెలియజేస్తుంది. ఐదవది: దానిని (సంపదను) సేకరించడానికి, దానిని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించని వ్యక్తి – అతడిని, సూర్యుని (నులువెచ్చని) ఎండను ఆస్వాదిస్తూ విశ్రాంతి తీసుకునే గొర్రెతో పోల్చడం. ప్రశాంతత, నెమ్మది మరియు విశ్రాంతి పరంగా చూస్తే ఇది అత్యంత ఉత్తమమైన స్థితి. ఇది దాని ప్రయోజనాలను గురించి, దాని అవగాహనను సూచిస్తుంది. ఆరవది: సంపదను సేకరించి, దానిని ధర్మబద్ధంగా ఖర్చు చేయకుండా నిలిపి ఉంచుకునే వాని మరణాన్ని, తనకు హాని కలిగించే దాని గురించి పట్టించుకోని జంతువు మరణంతో పోల్చడం. ఏడవది: సంపదను శత్రువుగా మారే అవకాశం ఉన్న సహచరుడితో పోల్చడం; డబ్బును కలిగి ఉండి దానిపై ప్రేమతో దానిని ఖర్చు చేయకుండా, పిసినారితనంతో గట్టిగా కట్టి ఉంచినట్లుగా ఆపుకుని ఉంచుకున్నపుడు, అది అర్హులైన వారికి అందకుండా చేయడంతో సమానం అవుతుంది. మరియు దాని యజమానిని శిక్షించడానికి దారితీస్తుంది. ఎనిమిదవది: సంపదను తప్పుడు మార్గాలలో, ధర్మవిరుద్ధంగా సంపాదించే వానిని ఎంత తిన్నా ఎప్పుడూ సంతృప్తి చెందని వ్యక్తితో పోల్చడం.
అస్-సింది (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రకటన ప్రకారం, రెండు విషయాలు నెరవేర్చబడాలి. మొదటిది: దానిని న్యాయంగా, ధర్మబద్ధంగా సంపాదించడం. రెండవది: దానిని సరైన మార్గాల్లో ఖర్చు చేయడం. రెండు షరతులలో ఏదైనా తప్పిపోయినప్పుడు, అది హానికరం అవుతుంది. దీనిని ఇలా కూడా చెప్పవచ్చు: ఇది రెండు పరిమితుల మధ్య సంబంధాన్ని సూచిస్తుంది, సంపాదించే వాడు, దానిని ధర్మబద్ధంగా సంపాదిస్తే తప్ప, దానిని సరైన మార్గాల్లో ఖర్చు చేయడానికి అతనికి (అల్లాహ్) సహాయం అందదు.
التصنيفات
ఇహలోక ఇష్టత ఖండన