"ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక…

"ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు*. ఎవరైతే ఒక కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తాడో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని కష్టాన్ని సులభతరం చేస్తాడు. ఎవరైతే తోటి ముస్లిం లోపాలను దాచిపెడతారో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని లోపాల్ని దాచి పెడతాడు. అల్లాహ్ యొక్క దాసుడు (ముస్లిం) తన తోటి సోదరునికి సహాయం చేస్తున్నంత కాలం, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయం చేస్తాడు. ఎవరైతే జ్ఞానం అన్వేషించే మార్గంలో నడుస్తారో, అల్లాహ్ అతనికి స్వర్గానికి చేర్చే మార్గాన్ని సులభతరం చేస్తాడు. అల్లాహ్ యొక్క గృహాలలో (మస్జిదులలో) నుండి ఒక గృహంలో ప్రజల సమూహం ఒక చోట చేరి, అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దాన్ని తమలో తాము అధ్యయనం చేస్తుంటే, అల్లాహ్ యొక్క ప్రశాంతత ఆ సమూహంపై వర్షిస్తుంది, ఆయన దయ వారిని ఆవరిస్తుంది, దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు మరియు అల్లాహ్ తన సన్నిధిలో ఉన్న వారితో, ఆ సమూహం గురించి ప్రస్తావిస్తాడు. మరియు ఎవరి కర్మలు వారిని వెనుకబడేలా చేస్తాయో, వారి వంశం కూడా వారిని ముందుకు తీసుకు రాలేదు."

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: "ఎవరైతే ఒక విశ్వాసిని ఈ ప్రాపంచిక కష్టాలలోని ఒక కష్టం నుండి విముక్తి చేస్తారో, ప్రళయ దినాన అల్లాహ్ అతడిని ఒక కష్టం నుండి విముక్తి చేస్తాడు. ఎవరైతే ఒక కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తాడో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని కష్టాన్ని సులభతరం చేస్తాడు. ఎవరైతే తోటి ముస్లిం లోపాలను దాచిపెడతారో, అల్లాహ్ ఈ ప్రపంచంలోనూ, పరలోకంలోనూ అతని లోపాల్ని దాచి పెడతాడు. అల్లాహ్ యొక్క దాసుడు (ముస్లిం) తన తోటి సోదరునికి సహాయం చేస్తున్నంత కాలం, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయం చేస్తాడు. ఎవరైతే జ్ఞానం అన్వేషించే మార్గంలో నడుస్తారో, అల్లాహ్ అతనికి స్వర్గానికి చేర్చే మార్గాన్ని సులభతరం చేస్తాడు. అల్లాహ్ యొక్క గృహాలలో (మస్జిదులలో) నుండి ఒక గృహంలో ప్రజల సమూహం ఒక చోట చేరి, అల్లాహ్ గ్రంథాన్ని పఠిస్తూ, దాన్ని తమలో తాము అధ్యయనం చేస్తుంటే, అల్లాహ్ యొక్క ప్రశాంతత ఆ సమూహంపై వర్షిస్తుంది, ఆయన దయ వారిని ఆవరిస్తుంది, దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు మరియు అల్లాహ్ తన సన్నిధిలో ఉన్న వారితో, ఆ సమూహం గురించి ప్రస్తావిస్తాడు. మరియు ఎవరి కర్మలు వారిని వెనుకబడేలా చేస్తాయో, వారి వంశం కూడా వారిని ముందుకు తీసుకు రాలేదు."

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా ఇలా తెలిపినారు: ఒక ముస్లిమ్ తన తోటి ముస్లిమ్ సోదరుడి కోసం చేసే పనులకు తగినట్లుగా అల్లాహ్ అతనికి ప్రతిఫలం ప్రసాదిస్తాడు. ఈ లోకంలో ఎవరు ఒక విశ్వాసి కష్టాన్ని నివారిస్తారో, లేదా తగ్గిస్తారో, లేదా పూర్తిగా తొలగిస్తారో, తీర్పు దినాన అల్లాహ్ కూడా అతని నుండి ఒక కష్టాన్ని తొలగిస్తాడు. ఎవరైనా కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేస్తే, అల్లాహ్ అతని కష్టాన్ని ఈ లోకంలోనూ, పరలోకంలోనూ సులభతరం చేస్తాడు. ఎవరైతే ఒక ముస్లిమ్ యొక్క లోపాన్ని దాచిపెడతారో, అంటే ఇతరులకు తెలియకుండా అతడు చేసిన తప్పులను, పొరపాట్లను దాచిపెడతారో, అల్లాహ్ కూడా అతని లోపాలను, తప్పులను, పొరపాట్లను ఈ లోకంలోనూ, పరలోకంలోనూ దాచి పెడతాడు. తన దాసుడు తన తోటి సహోదరుని ధార్మిక, ప్రాపంచిక ప్రయోజనాల్లో సహాయం చేస్తూ ఉన్నంత వరకు, అల్లాహ్ కూడా ఆ దాసుడికి సహాయంగా ఉంటాడు. ఈ సహాయం దుఆ, ఆచరణలు, సంపద ద్వారా కావచ్చు. ఎవరైనా అల్లాహ్ కోసం ధార్మిక జ్ఞానం సంపాదించేందుకు ప్రయాణిస్తారో, అల్లాహ్ అతని కొరకు స్వర్గం దారిని సులభతరం చేస్తాడు. అల్లాహ్ ఆరాధనా గృహాలలో (మస్జిదులలో) ఒక సమూహం అల్లాహ్ యొక్క గ్రంథాన్ని (ఖుర్ఆన్) పఠిస్తూ, పరస్పరం అధ్యయనం చేస్తూ ఉంటే, వారిపై ప్రశాంతత వర్షిస్తుంది; అల్లాహ్ కరుణ వారిని ఆవరిస్తుంది; దైవదూతలు వారిని చుట్టుముట్టుతారు; అల్లాహ్ ఆ సమూహం గురించి తన సమీపంలో ఉన్న వారి వద్ద ప్రశంసిస్తాడు. అల్లాహ్ తన దాసుడిని పరమోన్నతమైన సంఘంలో ప్రస్తావించడం ఎంత గొప్ప గౌరవమో కదా! ఎవరి వద్ద మంచి పనులు తక్కువగా ఉంటాయో, అతను ఎక్కువ మంచి పనులు చేసిన వారి స్థాయికి చేరుకోలేడు. కాబట్టి, స్వయంగా మంచి పనులు చేయకుండా తన వంశము, కులము పేరు మీద ఆధారపడకూడదు.

فوائد الحديث

ఇబ్న్ దకీక్అల్-ఈద్ (రహిమహుల్లాహ్) అన్నారు: "ఇది గొప్ప హదీథు. ఇందులో అనేక రకాల జ్ఞానం, నియమాలు, మరియు మంచితనపు నైతికతలు ఉన్నాయి. ఇది ముస్లిముల అవసరాలను తీర్చడం అంటే వారికి ఏ విధమైన సహాయం చేయడమైనా — అది జ్ఞానం ద్వారా కావచ్చు, ధనం ద్వారా కావచ్చు, సహాయపడడం ద్వారా కావచ్చు, ఉపయోగకరమైన సలహా ఇవ్వడం ద్వారా కావచ్చు, సరైన మార్గదర్శనం చేయడం ద్వారా కావచ్చు లేదా ఇతర మార్గాల్లోనూ కావచ్చు — వీటి గొప్పతనాన్ని ఈ హదీథు స్పష్టం చేస్తున్నది."

కష్టంలో ఉన్నవారి కష్టాన్ని సులభతరం చేయడం విషయంలో ప్రోత్సహించబడింది.

ఇస్లాం ధర్మంలో, ఒక ముస్లిమ్ తన తోటి ముస్లిమ్‌ సోదరుడికి సహాయం చేయాలని ప్రోత్సహించబడింది. ఎందుకంటే, ఎవరు తన తోటి వానికి ఎంతగా సహాయం చేస్తారో, అల్లాహ్ కూడా అతనికి అదే స్థాయిలో సహాయం చేస్తాడు.

ఒక ముస్లిమ్ లోపాలను దాచిపెట్టే మార్గాల్లో ముఖ్యమైనది – ఇతరుల లోపాలను వెతకకుండా ఉండటం. మన పూర్వీకుల్లో ఒకరు ఇలా అన్నారు: "నేను లోపాలు లేని కొంతమందిని చూశాను. కానీ వారు ఇతరుల లోపాల గురించి మాట్లాడేవారు. దాంతో, ప్రజలు కూడా వారి లోపాలను గుర్తు చేసుకుని, ప్రస్తావించడం ప్రారంభించారు. అలాగే, నేను లోపాలు ఉన్న కొంతమందిని చూశాను. కానీ వారు ఇతరుల లోపాలను ప్రస్తావించకుండా ఉండేవారు. దాంతో, ప్రజలు వారి లోపాలను మరచిపోయారు."

ఇతరుల లోపాలను దాచిపెట్టడం అంటే చెడు పనులను నిషేధించకుండా లేదా వాటిని ఆపడానికి ప్రయత్నించకుండా ఉండడం కాదు. బదులుగా, చెడు పనులను మార్చేందుకు ప్రయత్నించడమూ, అదే సమయంలో వాటిని ఇతరుల ముందు ప్రచారం చేయకుండా దాచిపెట్టడమూ అవసరం. ఇది సాధారణంగా, పాపంలో స్థిరంగా ఉండని లేదా పతనానికి అలవాటు పడని వారికే వర్తిస్తుంది. కానీ, ఎవరైనా చెడు పనులు చేయడంలో ప్రసిద్ధుడై ఉంటే లేదా స్థిరంగా పాపాలు చేస్తూ ఉంటే, అలాంటి వారి లోపాలను దాచిపెట్టడం సిఫార్సు చేయబడదు. బదులుగా, అతని వ్యవహారాన్ని అధికారులకు (సంబంధిత అధికారులకు లేదా పెద్దలకు) తెలియజేయాలి — అయితే, ఇది మరింత పెద్ద హానిని కలిగించకూడదు. ఎందుకంటే, అలాంటి వారి లోపాలను దాచిపెట్టడం వల్ల వారు మరింత ధైర్యంగా చెడు పనులు చేయడానికి ప్రోత్సాహం పొందుతారు. ఇది ఇతర చెడ్డవారికి కూడా ప్రేరణగా మారుతుంది.

విద్యను అభ్యసించటానికి, ఖుర్‌ఆన్‌ను తిలావత్ చేయటానికి మరియు దాని పై అధ్యయనం చేయటానికి ప్రోత్సహించబడినది

ఇమామ్ నవవి (రహిమహుల్లాహ్) ఇలా అన్నారు: "మస్జిదులలో ఖుర్‌ఆన్‌ను చదవడానికి సమూహంగా జమ కావడం ఎంత గొప్ప పుణ్యమైనదో తెలియజేసేందుకు ఈ హదీథు ఒక ఆధారం. అలాగే, పాఠశాలలో, సైనిక శిబిరంలో లేదా ఇలాంటి ఇతర ప్రదేశాలలో ఒచోట చేరి, ఖుర్‌ఆన్‌ చదవడం కూడా, అల్లాహ్ ఇష్టపడ్డట్లయితే, ఇదే పుణ్యాన్ని ఇస్తుంది."

అల్లాహ్ ప్రతిఫలాన్ని మన వంశ పరంపర ఆధారంగా కాకుండా, మన కర్మల ఆధారంగా నిర్ణయిస్తాడు.

التصنيفات

జ్ఞానము ప్రాముఖ్యత