“నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు…

“నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు పరుస్తాడు

అబ్దుల్లాహ్ బిన్ అమర్ బిన్ ఆస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా, తీర్పు దినము నాడు నా ఉమ్మత్’ నుండి అల్లాహ్ ఒక వ్యక్తిని ఎన్నుకుని సృష్టి అంతటి ముందు హాజరు పరుస్తాడు. అతడి ముందు (చెడు కర్మలు రాయబడిన) తొంభైతొమ్మిది దస్తావేజులు పరుచబడతాయి. ఒక్కొక్కటి కంటిచూపు మేర దూరమంత పెద్దవిగా ఉంటాయి. అప్పుడు ఆయన (అల్లాహ్) ఇలా పలుకుతాడు “వీటిలో ఏ ఒక్కదానినైనా నిరాకరించగలవా నీవు? వీటిని రాసిన వారు (తప్పుగా రాసి) నీకు ఏమైనా అన్యాయం చేసినారా?” దానికి అతడు “లేదు నా ప్రభూ!” అంటాడు. అపుడు ఆయన “మరి నీ వద్ద జావాబు ఏమైనా ఉందా?” అని అడుగుతాడు. దానికి అతడు “లేదు నా ప్రభూ!” అంటాడు. అపుడు అల్లాహ్ “నిశ్చయంగా మావద్ద నీవు చేసిన ఒక మంచి పని ఉన్నది. ఈ దినము నీకు ఎటువంటి అన్యాయమూ జరుగదు” అని ఒక పత్రాన్ని బయటకు తీస్తాడు. దానిపై “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుదు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క దాసుడు మరియు సందేశహరుడు”). అల్లాహ్ అతనితో “నీ కర్మల త్రాసును తీసుకురా” అంటాడు. దానికి అతడు “ఓ నా ప్రభూ! నా పాపపు పనుల ఈ చిట్ఠాల (బరువు) ముందు ఈ కాగితం ముక్క ఏమి పనికి వస్తుంది?” అంటాడు. అపుడు ఆయన “ఈ దినము నీకు ఎలాంటి అన్యాయం జరుగదు” అని బదులిస్తాడు. పాపపు కర్మల చిట్ఠాలు త్రాసులో ఒక పళ్ళెంలో ఉంచబడతాయి. మరొక పళ్ళెం లో ఆ పత్రం ఉంచబడుతుంది. పాపపు కర్మ చిట్టాలు తేలికగా పైకి లేచిపోతాయి. ఆ పత్రం మహా బరువుగా తూగుతుంది. ఎందుకంటే అల్లాహ్ పేరు కంటే బరువైనది ఏదీ లేదు”.

[దృఢమైనది]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పేర్కొన్నారు: తీర్పు దినము నాడు అల్లాహ్ సృష్టి మొత్తములో తన ఉమ్మత్ నుండి ఒక వ్యక్తిని ఎన్నుకుంటాడు అతడి లెక్కా పత్రము చూడడానికి. అల్లాహ్ అతడి ముందు తొంభైతొమ్మిది దస్తావేజులను ఉంచుతాడు. అందులో అతడు ప్రపంచములో చేసిన చెడు పనులన్నీ నమోదు చేయబడి ఉంటాయి. ఒక్కొక్క దస్తావేజు ఎంత పొడవుగా ఉంటుందంటే కను చూపు మేర దూరమంత పెద్దగా ఉంటుంది. అపుడు అల్లాహ్ అతడితో “ఈ దస్తావేజులలో రాయబడి ఉన్న వాటిలో ఏ ఒక్క దానినైనా నీవు నిరాకరిస్తావా?" రక్షక దైవదూతలు (రాయడంలో) ఏమైనా అన్యాయం చేసారా?” అని ప్రశ్నిస్తాడు. ఆ వ్యక్తి “లేదు నా ప్రభూ!” అని సమాధానమిస్తాడు. అపుడు అల్లాహ్ “ప్రపంచంలో ఆచరించి వచ్చిన వీటి గురించి మరి నీ సమాధానం ఏమిటి? ఏమైనా (చేయవలసిన పనిని) వదిలి వేయడం ద్వారా నీ వల్ల చెడు జరిగిందా, లేక ఏమైనా తప్పు జరగడం వల్ల చెడు జరిగిందా, లేక అఙ్ఞానం కారణంగా చెడు జరిగిందా?” అని ప్రశ్నిస్తాడు. ఆ మనిషి “ఓ నా ప్రభూ! నావద్ద సమాధానం ఏమీ లేదు” అంటాడు. అపుడు మహోన్నతుడైన అల్లాహ్ ఇలా అంటాడు “(వాటన్నింటితో పాటు) మా వద్ద నీవు చేసిన ఒక మంచి పని కూడా ఉంది. ఈ రోజు నీకు ఎలాంటి అన్యాయమూ జరుగదు”. ఇంకా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అపుడు అల్లాహ్ ఒక పత్రాన్ని బయటకు తీస్తాడు. దానిపై “అష్’హదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహ్, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు” (నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుదు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క దాసుడు మరియు సందేశహరుడు”) అని రాసి ఉంటుంది. మహోన్నతుడైన అల్లాహ్ అతనితో “నీ కర్మల త్రాసు తీసుకునిరా” అంటాడు. ఆ మనిషి అమితాశ్చర్యంగా “ఓ నా ప్రభూ! ఈ చిట్ఠాల బరువు ముందు ఈ కాగితం ముక్క ఏమి బరువు తూగుతుంది?” అంటాడు. అపుడు అల్లాహ్ “నీకు ఏమాత్రం అన్యాయం జరుగదు” అని సమాధానమిస్తాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా అన్నారు: ఆ పాపపు కర్మ చిట్ఠాలు ఒక పళ్ళెం లో, ఆ కాగితపు ముక్క మరొక పళ్ళెం లో ఉంచబడతాయి. ఆ కాగితపు ముక్క ఉంచిన పళ్ళెం ఎక్కువ బరువు తూగుతుంది. అంతే అల్లాహ్ అతడిని క్షమిస్తాడు.

فوائد الحديث

తౌహీదు వాక్యము ఉచ్ఛారణ యొక్క ఘనత: “అల్లాహ్ తప్ప మరొక నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు” అనే సాక్ష్యము కర్మల పళ్ళెములో అధిక బరువు తూగింది అనే ఈ విషయం ద్వారా మనకు తెలుస్తున్నది.

కేవలం పలుకుట మాత్రమే సరిపోదు: నాలుకతో “అల్లాహ్ తప్ప మరో నిజ ఆరాధ్యుదు ఏవరూ లేరు” అని కేవలం పలుకుట మాత్రమే సరిపోదు. ఆ వాక్యం యొక్క అర్థాన్ని ఆకళింపు చేసుకోవడం, దాని ప్రకారం ఆచరించడం కూడా అవసరం.

తౌహీదు యొక్క ఘనత మరియు తౌహీదును విశ్వసించుటలో నిజాయితీ; పాపములు క్షమించబడుటకు ఒక కారణం అవుతాయి.

హృదయాలలో నిజాయితీ యొక్క స్థాయిని అనుసరించి, ఈమాన్ (విశ్వాసము) హెచ్చు తగ్గులు కలిగి ఉంటుంది. కొంతమంది ఈ వాక్యాన్ని పలుకుతారు. అయితే వారు తాము చేసిన పాపములను అనుసరించి శిక్షించబడతారు.

التصنيفات

అంతిమ దినంపై విశ్వాసం., తౌహీద్ ప్రామఖ్యతలు