“ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు

“ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు

అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో పాటు పన్నెండు యుద్ధాలలో పాల్గొన్నారు. ఆయన ఇలా ఉల్లేఖిస్తునారు: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి నేను నాలుగు విషయాలు విన్నాను. అవి నాకు బాగా నచ్చాయి: “ఏ స్త్రీ తన భర్తతో, లేదా ఒక ‘మహ్రం’ తో తప్ప రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించరాదు; రెండు దినములు ఉపవాసాములు పాటించరాదు ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు, మరియు ఈద్ అల్ అజ్’హా దినము నాడు; ఫజ్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) ఉదయించే వరకు ఏ నమాజు లేదు, అస్ర్ నమాజు తరువాత సూర్యుడు (పూర్తిగా) అస్తమించే వరకు ఏ నమాజు లేదు; మూడు మస్జిదులకు తప్ప తీర్థయాత్ర చేయరాదు – మస్జిదుల్ హరాం, మస్జిదుల్ అఖ్సా, మరియు ఈ మస్జిద్ (అంటే మదీనాలో ఉన్న ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మస్జిద్ - మస్జిదె’నబవీ).”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాలుగు విషయాలను నిషేధించినారు: మొదటిది: ఒక స్త్రీ తన భర్త లేదా ఆమె ‘మహరమ్ పురుషులలో’ ఒకరు లేకుండా రెండు రోజుల సుదూర ప్రయాణంలో (ఒంటరిగా) ప్రయాణించకుండా నిషేధించడం; ‘మహరమ్ పురుషులు’ అంటే ఆమెను వివాహం చేసుకోవడం శాశ్వతంగా నిషేధించబడినవారు, ఉదాహరణకు: ఆమె బంధువులలో - ఆమె కొడుకు, తండ్రి, మామ, సోదరుడు, సొదరుని కొడుకు, సోదరి కొడుకు, తల్లి సోదరులు, లేదా తండ్రి సోదరులు వంటి బంధువులు మొదలైన వారు. రెండవది: ఒక ముస్లిం ఈద్ అల్ ఫిత్ర్ దినము నాడు మరియు ఈద్ అల్ అద్’హా దినము నాడు ఉపవాసము పాటించుటను నిషేధించినారు; అతడు మొక్కుబడిగా మొక్కుకుని ఉన్న ఉపవాసమును పాటించ దలచినా, లేక స్వచ్ఛంద (నఫిల్) ఉపవాసము పాటించ దలచినా, లేక పరిహారంగా పాటించవలసి ఉన్న ఉపవాసమును పాటించదలచినా – ఈ రెండు దినములలో పాటించరాదు. మూడవది: అస్ర్ నమాజు తరువాత సూర్యాస్తమయం వరకు ఏదైనా నఫిల్ నమాజు పాటించుట, మరియు ఫజ్ర్ నమాజు తరువాత సూర్యోదయం వరకు ఏదైనా నఫిల్ నమాజు పాటించుట – ఈ రెండూ నిషేధించబడినవి. నాలుగవది: మూడు మస్జిదులకు తప్ప – ఏదైనా ఒక నిర్దుష్ఠ ప్రదేశానికి, ఆ ప్రదేశము మహత్తు గల ప్రదేశము అని, లేదా అది మహా ఘనత గల ప్రదేశము అని, లేదా ఆ ప్రదేశాన్ని దర్శించడం వల్ల పుణ్యాలు రెట్టింపు అవుతాయని – ఇలాంటి విశ్వాసాలతో ప్రయాణించడం నిషేధించబడినది. కనుక, ఏ ఇతర మస్జిదులకు ప్రత్యేకంగా ప్రయాణం చేసి వెళ్ళరాదు, ఎందుకంటే ఈ మూడు మస్జిదులలో మాత్రమే పుణ్యఫలం రెట్టింపు అవుతుంది – అవి ఒకటి మస్జిదుల్ హరాం, రెండు మస్జిదున్’నబవీ మరియు మూడు మస్జిదుల్ అఖ్సా.

فوائد الحديث

‘మహ్రం’ వెంట లేకుండా ప్రయాణించుట (షరియత్’లో) స్త్రీలకు అనుమతించబడలేదు.

ప్రయాణములో ఒక స్త్రీ మరొక స్త్రీకి మహ్రమ్ కాదు; ఎందుకంటే ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఆమె భర్త లేక మహ్రమ్” అని పేర్కొన్నారు.

ప్రయాణం అని పిలవబడే ప్రతిదీ భర్త లేదా మహరమ్ వ్యక్తి వెంట లేని స్త్రీ కొరకు నిషేధించబడింది; మరియు ఈ హదీసును ప్రశ్నించేవారి పరిస్థితి మరియు వారి నివాస స్థలం పరిస్థితుల నేపధ్యములో అర్థం చేసుకోవలసి ఉంటుంది.

ఒక స్త్రీ యొక్క మహ్రమ్ ఎవరు అంటే: ఆమె భర్త, లేదా ఆమెతో ఉన్న బంధుత్వము కారణంగా ఆమెను వివాహం చేసుకోవడం శాశ్వతంగా నిషేధించబడిన పురుషుడు; అంటే ఉదాహరణకు ఆమె తండ్రి, ఆమె కొడుకు, తండ్రి సహోదరులు (చిన్నాన్న, పెదనాన్న మొ.), మరియు తల్లి సహోదరులు (మేన మామలు); లేదా తన చనుబాలు త్రాపించిన పెంపుడు తల్లి ద్వారా బంధువులు అయిన వారు ఉదా: ఆమె భర్త (పెంపుడు పాల తండ్రి) మరియు పెంపుడు పాల తండ్రి వైపున ఆయన సోదరులు; లేదా వివాహము ద్వారా బంధువులైన పురుషులు, ఉదాహరణకు: భర్త తండ్రి (మామ). మహ్రమ్ ముస్లిం అయి ఉండాలి, యుక్త వయస్కుడు అయి ఉండాలి, మతిస్థిమితము గలవాడై ఉండాలి, మరియు నమ్మదగినవాడై ఉండాలి. ఎందుకంటే ఒక మహ్రమ్ తన వెంట ఉన్న స్త్రీని రక్షించాలని, ఆమెను సురక్షితంగా ఉంచాలని మరియు ఆమెను శ్రధ్ధగా చూసుకోవాలని ఆశించడం జరుగుతుంది.

ఇస్లామిక్ షరియహ్ స్త్రీల రక్షణ, వారి సంరక్షణ పట్ల శ్రద్ధ వహిస్తుంది.

ఫజ్ర్ మరియు అస్ర్ నమాజుల తరువాత నఫీల్ నమాజులు ఆచరించుట నిషేధించబడినది. అయితే ఈ నియమము సమయానికి ఆచరించలేకపోయిన ఫర్జ్ నమాజులకు, ఏదైనా హేతువు ఉన్న కారణంగా స్వచ్ఛందంగా ఆచరించవలసి వచ్చే నమాజులకు వర్తించదు, అంటే ఉదాహరణకు: తహియ్యతుల్ మస్జిద్ నమాజు మొదలైనవి;

సూర్యుడు ఉదయిస్తూ ఉండగా నమాజు ఆచరించుట హరాం (నిషేధము). అలాకాక సూర్యుడు పూర్తిగా ఉదయించిన తరువాత, అంటే ఒక బల్లెం అంత ఎత్తుకు ఉదయించిన తరువాత ఆచరించవచ్చును, దానికి సూర్యుడు ఉదయించుట మొదలైనప్పటి నుండి పది నిమిషాలు లేక ఒక పావుగంట సమయం పడుతుంది.

అస్ర్ సమయం సూర్యుడు అస్తమించే వరకు ఉంటుంది.

ఇందులో మూడు మస్జిదులకు ప్రత్యేకంగా ప్రయాణమై వెళ్ళవచ్చును అనే అనుమతి ఉన్నది.

అలాగే మిగతా మస్జిదుల కంటే, ఈ మూడు మస్జిదుల ఘనత మరియు వాటిని దర్శించడం వలన కలిగే ప్రయోజనాలు తెలుస్తున్నాయి.

సమాధులను సందర్శించడానికి ప్రయాణించడం అనుమతించబడలేదు; అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధి అయినా సరే. అయితే మదీనా వాసులకు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సమాధిని సందర్శించడానికి అనుమతి ఉన్నది, అలాగే షరియత్ అనుమతించిన ఏదైనా ప్రయోజనం కొరకు అక్కడికి (మదీనాకు) ప్రయాణించి వచ్చిన వారికి కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సమాధిని సందర్శించడానికి అనుమతి ఉన్నది.

التصنيفات

మస్జిదుల్ హరామ్,మస్జిదె నబవీ,బైతుల్ మక్దిస్ ఆదేశాలు, స్త్రీల ఆదేశాలు, మక్కా,మదీనా మరియు అఖ్సా చరిత్ర