“ఈ రెండు సలాహ్’లు (నమాజులు) కపటవిశ్వాసులపై భారమైనవి. ఈ రెండింటిలో ఏమి (దాగి) ఉన్నదో మీకు తెలిస్తే, మీ మోకాళ్ళపై…

“ఈ రెండు సలాహ్’లు (నమాజులు) కపటవిశ్వాసులపై భారమైనవి. ఈ రెండింటిలో ఏమి (దాగి) ఉన్నదో మీకు తెలిస్తే, మీ మోకాళ్ళపై ప్రాకుతూ రావల్సి వచ్చినా మీరు వాటి కొరకు (మస్జిదుకు) వస్తారు

ఉబయ్ ఇబ్న్ క’ఆబ్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “ఒక రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన నాయకత్వములో మాకు ఫజ్ర్ నమాజు చదివించారు. తరువాత “ఫలానా అతణ్ణి చూసారా?” అని అడిగారు. దానికి అక్కడ ఉన్న వారు “లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం “మరి ఫలానా అతణ్ణి చూసారా?” అని ప్రశ్నించారు. దానికి వారు “లేదు” అని సమాధానమిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఈ రెండు సలాహ్’లు (నమాజులు) కపటవిశ్వాసులపై భారమైనవి. ఈ రెండింటిలో ఏమి (దాగి) ఉన్నదో మీకు తెలిస్తే, మీ మోకాళ్ళపై ప్రాకుతూ రావల్సి వచ్చినా మీరు వాటి కొరకు (మస్జిదుకు) వస్తారు. (నమాజులో) మొదటి వరుస దైవదూతల శ్రేణి లాంటిది. దాని ఘనతను మీరు తెలుసుకుంటే అందులో చేరడానికి మీరు పోటీ పడతారు. ఒక వ్యక్తి మరొక వ్యక్తితో కలిసి (జమాఅత్’గా) నమాజు ఆచరించుట, అతడు ఒంటరిగా నమాజు ఆచరించుట కంటే పరిశుద్ధమైనది. మరియు అతడు మరో ఇద్దరితో కలిసి నమాజు ఆచరించుట ఒక్క వ్యక్తితో కలిసి నమాజు ఆచరించుట కంటే పరిశుద్ధమైనది. సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే అది (ఆ జమాఅత్) సర్వోన్నతుడైన అల్లాహ్’కు అంత ప్రీతిప్రదమైనది అవుతుంది.

[దృఢమైనది]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరోజు ఫజ్ర్ నమాజు చదివించినారు, తరువాత ఆయన: “ఫలాన అతను మనతో నమాజు ఆచరించినారా?” అని అడిగారు. సహాబాలు “లేదు” అని జవాబిచ్చారు. తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మరొక వ్యక్తిని గురించి “మరి ఫలానా అతను హాజరయ్యాడా?” అని అడిగారు. వారు “లేదు” అని జవాబిచ్చారు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: ‘ఫజ్ర్’ మరియు ‘ఇషా’ నమాజులు కపట విశ్వాసులపై అత్యంత భారమైనవి. వారిలో సోమరితనం ఎక్కువ ఉంటుంది. పైగా తాము నమాజులకు హాజరువుతున్నామనే విషయం చీకటిలో కనిపించదు; వారి ప్రదర్శనా లాలస తీరదు. ఓ విశ్వాసులారా, ప్రతిఫలం పరంగా మరియు పుణ్యఫలం పరంగా ఫజ్ర్ మరియు ఇషా నమాజులలో ఏమి (శుభం దాగి) ఉన్నదో మీకు గనుక తెలిస్తే – ఎందుకంటే కష్టానికి తగిన అనుపాతంలో ప్రతిఫలం ఉంటుంది గనుక – మీరు మీ చేతులు మరియు మోకాళ్ళపై ప్రాకుతూ రావలసి వచ్చినా మీరు ఆ నమాజుల కొరకు (మస్జిదునకు) వస్తారు. నమాజులో ఇమాం వెనుక ఇమాం కు దగ్గరగా ఉండే మొదటి వరుస, సామీప్యములో సర్వోన్నతుడైన అల్లాహ్ కు దగ్గరగా ఉండే దైవదూతల వరుస వంటిది. ఒక వ్యక్తి ఒంటరిగా చేసే నమాజు కంటే మరొక వ్యక్తితో కలిసి (జమాఅత్’గా) చేసే నమాజు ప్రతిఫలం మరియు ప్రభావంలో గొప్పది మరియు ఇద్దరు వ్యక్తులతో కలిసి చేసే నమాజు ఒక వ్యక్తితో కలిసి చేసే నమాజు కంటే ఉత్తమమైనది. చాలా మంది ఆరాధకులు పాల్గొన్న నమాజు అల్లాహ్‌కు మరింత ప్రియమైనది మరియు ఉత్తమమైనది.

فوائد الحديث

మస్జిదు యొక్క ఇమామ్ జమాఅత్ యొక్క స్థితిని, జమాఅత్’తో నమాజు ఆచరించుటకు వచ్చే వారిని గురించి అడగడం, వారిని గురించి తెలుసుకోవడం, ఎవరు జమాఅత్ తో నమాజుకు హాజరు కాలేదో వారిని గురించి వాకబు చేయడం – ఇవన్నీ షరియత్ లోని విషయాలే.

ఫజ్ర్ మరియు ఇషా నమాజులను క్రమం తప్పకుండా జమాఅత్’తో ఆచరించుట ఈమాన్ (విశ్వాసము) యొక్క గుర్తు.

ఈ హదీథులో ఇషా మరియు ఫజ్ర్ నమాజుల యొక్క ఘనత మరియు గొప్ప ప్రతిఫలం గురించి పేర్కొనబడింది; ఎందుకంటే ఆ నమాజులు ఆచరించుట కొరకు మస్జిదునకు రావడం అనేది స్వయంతో పోరాడడం మరియు అల్లాహ్ యొక్క విధేయతలో పట్టుదలతో ఉండడాని సూచిస్తుంది. అందుకని వాటిని ఆచరించుట యొక్క ప్రతిఫలం కూడా మిగతా వాటికన్నా ఎక్కువ.

సామూహిక నమాజు (జమాఅత్ ఏర్పరిచి నమాజును ఆచరించుట) అనేది ఇద్దరు లేక ఎక్కువమందితో స్థాపించబడుతుంది.

ఇందులో నమాజులో మొదటి వరుస యొక్క ఘనత, మరియు నమాజులో మొదటి వరుసలో స్థానం పొందుటకు ఎల్లప్పుడు ముందుండాలని ప్రోత్సాహం ఉన్నది.

జమాఅత్’తో చేసే నమాజులలో జమాఅత్ (సమూహము) ఎంత పెద్దదిగా ఉంటే దాని ఘనత కూడా అంత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే సామూహిక నమాజులో సమూహం (జమాఅత్) ఎంత పెద్దదిగా ఉంటే దాని ప్రతిఫలం కూడా అంత గొప్పగా ఉంటుంది.

మంచి పనులు - వాటికి షరియా యొక్క ప్రాధాన్యత ప్రకారం, మరియు వాటి గుణవిశేషణాలను బట్టి అవి యోగ్యతలో విభిన్నంగా ఉంటాయి.

التصنيفات

జమాత్ తో చదివే నమాజ్ ప్రాముఖ్యత మరియు దాని ఆదేశాలు