ఇస్లాం అంటే, నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని…

ఇస్లాం అంటే, నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, సలాహ్’ను (నమాజును) స్థాపించుట, జకాతు చెల్లించుట, రమదాన్ మాసములో ఉపవాసాలు ఉండుట మరియు తగిన స్తోమత ఉంటే (కాబా) గృహానికి తీర్థయాత్ర చేయుట

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “ఒకరోజు మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి, నిగనిగలాడే నల్లని తల వెంట్రుకలు కలిగిన ఒక వ్యక్తి మా ముందుకు వచ్చినాడు. దూరం నుండి ప్రయాణించి వస్తున్న జాడలేవీ అతనిపై లేవు, మాలో ఎవరూ కూడా అతడిని ఎరుగరు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అభిముఖంగా, తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి, తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి కూర్చున్నాడు. తరువాత అతడు “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ! నాకు ఇస్లాం అంటే ఏమిటో చెప్పు?” అన్నాడు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “ఇస్లాం అంటే, నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, సలాహ్’ను (నమాజును) స్థాపించుట, జకాతు చెల్లించుట, రమదాన్ మాసములో ఉపవాసాలు ఉండుట మరియు తగిన స్తోమత ఉంటే (కాబా) గృహానికి తీర్థయాత్ర చేయుట” అని సమాధాన మిచ్చినారు. అది విని అతడు “నీవు సత్యము పలికినావు” అన్నాడు. మాకు ఆశ్చర్యం అనిపించింది – అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్న అడుగుతున్నాడు, మరియు ఆయన సత్యమే పలికినారని ధృవీకరిస్తున్నాడు కూడా. తరువాత అతడు “విశ్వాసము అంటే ఏమిటో చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “విశ్వాసము అంటే – నీవు అల్లాహ్’ను విశ్వసించుట, ఆయన దూతలను (దైవదూతలను) విశ్వసించుట, ఆయన గ్రంథాలను విశ్వసించుట, ఆయన సందేశహరులను విశ్వసించుట, అంతిమ దినమును విశ్వసించుట మరియు విధివ్రాతను, అందులోని మంచిని చెడును విశ్వసించుట” అని సమాధానమిచ్చినారు. దానికి అతడు “నీవు సత్యము పలికినావు” అన్నాడు. తరువాత అతడు “ఇహ్’సాన్ అంటే ఏమిటో చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇహ్’సాన్ అంటే – నీవు అల్లాహ్’ను (నీ ఎదురుగా) చూస్తున్నట్లుగా ఆయనను అరాధించుట, నీవు ఆయనను చూడలేక పోయినప్పటికీ ఆయన నిన్ను చూస్తున్నాడు (అని గమనించు)” అని సమాధాన మిచ్చినారు. తరువాత అతడు “ప్రళయ ఘడియను గురించి చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దానిని గురించి, ప్రశ్నించ బడుతున్న వాడు, ప్రశ్నిస్తున్న వాని కంటే ఎక్కువగా ఎరుగడు” అని సమాధాన మిచ్చినారు. అతడు “దాని సంకేతాలైనా తెలియజేయి నాకు” అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “బానిస యువతి తన యజమానురాలికి జన్మనిస్తుంది, వొంటిపై బట్టలు, కాళ్ళకు చెప్పులు కూడా లేని నిరుపేద పశువుల కాపర్లు ఆకాశ హర్మ్యాలను నిర్మించడం’లో ఒకరితో నొకరు పోటీ పడుటను చూస్తావు నీవు” అన్నారు. తరువాత ఆ మనిషి వెళ్ళిపోయినాడు. నేను కొద్దిసేపు అలాగే ఉండిపోయాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో “ఓ ఉమర్! ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా నీకు?” అన్నారు. నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరుని కి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. దానికి ఆయన “అతడు జిబ్రీల్ అలైహిస్సలాం, మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చినాడు” అన్నారు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఉమర్ ఇబ్నె ఖత్తాబ్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు – జిబ్రయీల్ అలైహిస్సలాం సహబాల వద్దకు ఎవరో తెలియని ఒక మనిషి రూపంలో వచ్చారు. స్వచ్ఛమైన అతి తెల్లని వస్త్రాలు ధరించి ఉన్నారని, ఆయన తల వెంట్రుకలు నిగనిగలాడుతూ అతి నల్లగా ఉన్నాయని, సుదూర ప్రయాణికుడు అనడానికి అతనిలో అలసట, వొంటిపై దుమ్ము, చెదిరిన వెంట్రుకలు, బట్టలపై ధూళి వంటి చాయలేవీ లేవు అని అతడి రూపురేఖలను గురించి వివరించినారు. తామందరూ అక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉన్నామని, తమలో ఎవరూ అతడిని ఎరుగరు అని అన్నారు. అతడు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ఎప్పటి నుంచో ఎరిగిన వానిలా, ఆయన ముందు కూర్చుని ఇస్లాం ను గురించి ప్రశ్నించినాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘షహాదతైన్’, సలాహ్ ను స్థాపించుట, జకాతు చెల్లించుట, రమజాన్ నెల ఉపవాసములు మరియు స్థోమత కలిగి ఉంటే హజ్ చేయుట మొదలైన వాటితో కూడిన ఇస్లాం మూల స్తంభములను గురించి చెప్పినారు. ఆ ప్రశ్నించిన వ్యక్తి “నీవు సత్యము చెప్పినావు” అన్నాడు. సహబాలందరూ ఆశ్చర్య పోయినారు – పైకి ఏమీ ఎరుగని వాడిలా ప్రశ్నిస్తాడు, తరువాత దానిని ధృవీకరిస్తాడు – అని. తరువాత అతడు ఈమాన్ గురించి ప్రశ్నించినాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈమాన్ యొక్క ఆరు మూల స్తంభములను గురించి వివరించినారు. అందులో అల్లాహ్ యొక్క ఉనికిని విశ్వసించుట, ఆయన గుణగణములను విశ్వసించుట, ఆయన కార్యములలో ఆయన ఏకైకుడని (ఆయనకు సాటి, సహాయకులు ఎవరూ లేరని) విశ్వసించుట, ఉదాహరణకు సృష్టి; ఆరాధనలు అన్నింటికీ ఆయన మాత్రమే ఏకైక అర్హుడని విశ్వసించుట. మరియు దైవదూతలను అల్లాహ్ కాంతితో సృష్టించినాడని, వారు అల్లాహ్ యొక్క గౌరవనీయులైన దాసులని, ఎప్పుడూ అల్లాహ్ పట్ల అవిధేయులు కారు అని, అల్లాహ్ యొక్క ఆఙ్ఞలకు అనుగుణంగా ఆచరిస్తారని విశ్వసించుట, అల్లాహ్ తరఫు నుండి ఆయన సందేశహరులపై అవతరింప జేయబడిన గ్రంథములను విశ్వసించుట, ఉదాహరణకు ఖుర్’ఆన్, తౌరాత్ మరియు ఇంజీలు మొదలైనవి, మరియు ఆయన సందేశహరులను విశ్వసించుట, ఎవరైతే అల్లాహ్ తరఫున ఆయన ధర్మాన్ని వ్యాపింప జేసినారో; వారిలో నూహ్, మూసా మరియు ఈసా అలైహిముస్సలాం మొదలైన మిగతా సందేశహరులు, ప్రవక్తలు ఉన్నారని, వారిలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లహ్ యొక్క చిట్టచివరి సందేశహరుడు అని విశ్వసించుట మరియు అంతిమ దినము నందు విశ్వసించుట – ఇందులో మరణానంతరం సమాధి నుండి మొదలుకుని ‘అల్ బర్జఖ్’ యొక్క జీవితం వరకు (మరణానికీ తీర్పు దినమునకు మధ్య ఉండే సంధి కాలపు జీవితం), మరియు మనిషి మరణానంతరం తిరిగి లేప బడతాడు అని, అతడి ఆచరణల లెక్క తీసుకో బడుతుంది అని, చివరికి అతడి అంతిమ నివాస స్థానము స్వర్గము గానీ లేక నరకము గానీ అవుతుంది అని విశ్వసించుట, తన అనంతమైన ఙ్ఞానము, వివేకముల ఆధారంగా అల్లాహ్ (ప్రళయ దినము వరకు) జరుగబోయే ప్రతి విషయాన్ని గురించి ముందుగానే రాసి ఉంచినాడని, జరిగే ప్రతి విషయమూ, అది ఎందుకొరకు సృష్టించబడినదో ఆ లక్ష్యము కొరకు జరుగుతుందని మరియు ఆయన ముందుగానే రాసి ఉంచిన దాని ప్రకారమే జరుగుతుందని విశ్వసించుట. తరువాత ఆవ్యక్తి ‘అల్ ఇహ్’సాన్’ ని గురించి తెలుపమని అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేసారు – అల్ ఇహ్’సాన్ అంటే అల్లాహ్ ను మన ఎదురుగా చూస్తూ ఉన్నట్లుగా ఆయనను ఆరాధించుట. ఆరాధనలో ఆ స్థాయిని చేరుకోలేక పోయినట్లయితే, అల్లాహ్ తనను చూస్తున్నాడని గ్రహించుట. వీటిలో మొదటిది (అల్లాహ్ ను మన ఎదురుగా చూస్తున్నట్లుగా ఆయనను ఆరాధించుట) అత్యుత్తమ స్థాయి, రెండవ స్థాయి అల్లాహ్ మనల్ని చూస్తున్నాడనే , స్పృహ కలిగి ఉండుట. తరువాత అతడు ‘ప్రళయ ఘడియ ఎపుడు?’ అని ప్రశ్నించాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ప్రళయ ఘడియకు చెందిన ఙ్ఞానమును అల్లాహ్ తన ఙ్ఞానములో భద్రపరిచి ఉంచాడు. కనుక సృష్టితాలలో ఎవరూ దానిని గురించి ఎరుగరు, చివరికి ప్రశ్నించ బడుతున్నవాడు మరియు ప్రశ్నించే వాడు కూడా” అని వివరించారు. తరువాత అతడు ‘కనీసం ప్రళయ ఘడియ సంకేతాలైనా చెప్పమని’ అడిగాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం - ఉంపుడు గత్తెలు విపరీతంగా పెరిగి పోవడం, ఆ కారణంగా వారి సంతానం పెరిగి పోవడం, లేదా తల్లుల పట్ల సంతానం యొక్క అవిధేయత విపరీతంగా పెరిగిపోవడం, వారు తమ సేవకులు, బానిసలు అన్నట్లుగా వ్యవహరించడం, అలాగే యుగాంతము సమీపిస్తున్న కాలములో పశువుల కాపరులకు, నిరుపేదలకు సైతము ఈ ప్రపంచ సుఖాలను సాధించుట తేలికై పోతుంది, వారు పెద్దపెద్ద భవనాలను నిర్మించడంలో ఆర్భాటము, అట్టహాసము ప్రదర్శిస్తుంటారు – అని వీటిని ‘ప్రళయ ఘడియ’ సమీపిస్తున్నది అనడానికి కొన్ని సంకేతాలుగా వివరించినారు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశ్నలు అడిగిన ఆ వ్యక్తి జిబ్రయీల్ అలైహిస్సలాం అని, సహబాలకు ఈ ‘దీన్ అల్ హనీఫా’ (స్వచ్ఛమైన ధర్మము) ను గురించి తెలియజేయడానికి వచ్చినారు అని తెలియ జేసినారు.

فوائد الحديث

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సభ్యత, మర్యాద, వైఖరి తెలుస్తున్నాయి. ఆయన వారిలోని ఒకరివలె సహబాలతో కూర్చొంటారు, వారు ఆయనతో కూర్చొంటారు.

ప్రశ్నించే వాడిని చేరువకు తీసుకోవడం, అతనితో స్నేహపూర్వకంగా వ్యవహరించడాన్ని షరియత్ ప్రోత్సహిస్తుంది. దానితో అతడు భయము గానీ, సంకోచము గానీ లేకుండా ప్రశ్నించ గలుగుతాడు.

ఇందులో తనకు బోధించే గురువు పట్ల గౌరవం కలిగి ఉండాలని, సభ్యత కలిగి ఉండాలనే ఉద్బోధ కనిపిస్తుంది – జిబ్రయీల్ అలైహిస్సలాం విషయాలను గురించి తెలుసుకుంటున్న క్రమంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో వ్యవహించిన తీరు దీనికి ఉదాహరణ.

ఇస్లాం యొక్క మూల స్తంభాలు అయిదు అని, విశ్వాసము యొక్క మూల స్తంభములు ఆరు అని తెలుస్తున్నది.

ఇస్లాం మరియు ఈమాన్ (విశ్వాసము) – ఇస్లాం బాహ్యంగా కనిపించే విషయాల ద్వారా విశదమవుతుంది, ఈమాన్ (విశ్వాసము) అంతరంగానికి సంబంధించిన విషయాల ద్వారా విశదమవుతుంది.

‘దీన్’లో (ధర్మములో) విషయాలు వివిధ స్థాయిలలో ఉంటాయని తెలుస్తున్నది – అన్నింటికంటే మొదటి స్థాయి ‘అల్ ఇస్లాం’; రెండవది ‘అల్ ఈమాన్’ (విశ్వాసము), మూడవది ‘అల్ ఇహ్’సాన్’. మరి ఈ మూడవదే అన్నింటికన్నా ఉత్తమ స్థాయి అని తెలుస్తున్నది.

ప్రశ్నకారుని మూలము విషయ ఙ్ఞానము లేకపోవడం మరియు అఙ్ఞానము ప్రశ్నలకు కారణం అవుతుంది. అందుకనే సహబాలు విస్మయానికి లోనయ్యారు – ప్రశ్నకారుడు ప్రశ్నలడగడం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానాలు విని వాటిని ధృవీకరించడం చూసి.

విషయాలు ప్రాథామ్య క్రమంలో ప్రారంభం కావడం చూస్తాము. ముందుగా ‘షహాదతైన్’ (అల్లాహ్ ఒక్కడే అని, మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యము పలుకుట) తో మొదలు కావడం, అందులో ఇస్లాం యొక్క మూలస్థంభాల వివరణ కలిసి ఉండడం, మరియు ‘అల్ ఈమాన్’ తో మొదలై అందులో అల్లాహ్ పై విశ్వాసముతో పాటు విశ్వాసపు మూలస్థంభాల వివరణ కలిగి ఉండడం చూస్తాము.

తనకు తెలిసిన విషయమే అయినప్పటికీ, ఙ్ఞానవంతులను ప్రశ్నించడం, ప్రశ్నించే వాని అఙ్ఞానానికి నిదర్శనం కాదు. మిగతా వారికి కూడా ఆ విషయానికి సంబంధించిన ఙ్ఞానము సమకూరేలా చేయడం.

అల్లాహ్ తన అపారమైన ఙ్ఞానములో భద్రపరిచి ఉంచిన విషయాలలో, ప్రళయ దినము యొక్క ఙ్ఞానము ఒకటి.

التصنيفات

అఖీద