అఖీద
18- “”ఎవరైతే “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, వ అన్న ఈసా అబ్దుల్లాహి, వ రసూలుహు, వ కలిమతుహు, అల్’ఖాహా ఇలా మర్యమ, వ రూహుమ్మిన్’హు, వల్ జన్నతు హఖ్ఖున్, వన్నారు హఖ్ఖున్”, అని సాక్ష్యం పలుకుతాడో, @అల్లాహ్ అతడిని స్వర్గం లో ప్రవేశింపజేస్తాడు, అతడి ఆచరణలు ఏమైనప్పటికీ.”
28- “ఒకరోజు మేము రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తో కూర్చుని ఉండగా, స్వచ్ఛమైన తెల్లటి వస్త్రాలు ధరించి, నిగనిగలాడే నల్లని తల వెంట్రుకలు కలిగిన ఒక వ్యక్తి మా ముందుకు వచ్చినాడు. దూరం నుండి ప్రయాణించి వస్తున్న జాడలేవీ అతనిపై లేవు, మాలో ఎవరూ కూడా అతడిని ఎరుగరు. అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు అభిముఖంగా, తన మోకాళ్లను ఆయన మోకాళ్లకు ఆనించి, తన అరచేతులను ఆయన తొడలపై ఉంచి కూర్చున్నాడు. తరువాత అతడు “ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ! నాకు ఇస్లాం అంటే ఏమిటో చెప్పు?” అన్నాడు. దానికి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) “@ఇస్లాం అంటే, నీవు అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు ఎవరూ లేరని, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరుడు అని సాక్ష్యమిచ్చుట, సలాహ్’ను (నమాజును) స్థాపించుట, జకాతు చెల్లించుట, రమదాన్ మాసములో ఉపవాసాలు ఉండుట మరియు తగిన స్తోమత ఉంటే (కాబా) గృహానికి తీర్థయాత్ర చేయుట*” అని సమాధాన మిచ్చినారు. అది విని అతడు “నీవు సత్యము పలికినావు” అన్నాడు. మాకు ఆశ్చర్యం అనిపించింది – అతడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్న అడుగుతున్నాడు, మరియు ఆయన సత్యమే పలికినారని ధృవీకరిస్తున్నాడు కూడా. తరువాత అతడు “విశ్వాసము అంటే ఏమిటో చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “విశ్వాసము అంటే – నీవు అల్లాహ్’ను విశ్వసించుట, ఆయన దూతలను (దైవదూతలను) విశ్వసించుట, ఆయన గ్రంథాలను విశ్వసించుట, ఆయన సందేశహరులను విశ్వసించుట, అంతిమ దినమును విశ్వసించుట మరియు విధివ్రాతను, అందులోని మంచిని చెడును విశ్వసించుట” అని సమాధానమిచ్చినారు. దానికి అతడు “నీవు సత్యము పలికినావు” అన్నాడు. తరువాత అతడు “ఇహ్’సాన్ అంటే ఏమిటో చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “ఇహ్’సాన్ అంటే – నీవు అల్లాహ్’ను (నీ ఎదురుగా) చూస్తున్నట్లుగా ఆయనను అరాధించుట, నీవు ఆయనను చూడలేక పోయినప్పటికీ ఆయన నిన్ను చూస్తున్నాడు (అని గమనించు)” అని సమాధాన మిచ్చినారు. తరువాత అతడు “ప్రళయ ఘడియను గురించి చెప్పు నాకు” అన్నాడు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “దానిని గురించి, ప్రశ్నించ బడుతున్న వాడు, ప్రశ్నిస్తున్న వాని కంటే ఎక్కువగా ఎరుగడు” అని సమాధాన మిచ్చినారు. అతడు “దాని సంకేతాలైనా తెలియజేయి నాకు” అన్నాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “బానిస యువతి తన యజమానురాలికి జన్మనిస్తుంది, వొంటిపై బట్టలు, కాళ్ళకు చెప్పులు కూడా లేని నిరుపేద పశువుల కాపర్లు ఆకాశ హర్మ్యాలను నిర్మించడం’లో ఒకరితో నొకరు పోటీ పడుటను చూస్తావు నీవు” అన్నారు. తరువాత ఆ మనిషి వెళ్ళిపోయినాడు. నేను కొద్దిసేపు అలాగే ఉండిపోయాను. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాతో “ఓ ఉమర్! ఆ ప్రశ్నించిన వ్యక్తి ఎవరో తెలుసా నీకు?” అన్నారు. నేను “అల్లాహ్’కు మరియు ఆయన సందేశహరుని కి మాత్రమే బాగా తెలుసు” అన్నాను. దానికి ఆయన “అతడు జిబ్రీల్ అలైహిస్సలాం, మీకు మీ ధర్మాన్ని బోధించడానికి వచ్చినాడు” అన్నారు.
31- "ఒకరోజు సవారీపై నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉన్నాను. అపుడు వారు నాతో ఇలా పలికారు "@ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో*. గుర్తుంచుకో, ఒకవేళ ఈ ఉమ్మత్ (ముస్లిం జాతి మొత్తం), నీకు ఏమైనా ప్రయోజనం కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమీ ప్రయోజనం కలుగజేయలేరు, అల్లాహ్ నీకోరకు ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. అలాగే, ఒకవేళ ఈ ఉమ్మత్ (సమాజం మొత్తం), నీకు ఏమైనా హాని (నష్టము) కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమాత్రమూ హాని (నష్టము) కలుగజేయలేరు, అల్లాహ్ నీకు వ్యతిరేకంగా ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. కలములన్నీ లేపి వేయబడినాయి, కాగితములన్నీ ఇంకిపోయాయి (ఎండిపోయినాయి). (అంటే, అల్లాహ్ ముందుగానే ప్రతి విషయాన్ని పూర్వ నిర్దేశము గావించి ఉంచినాడని, ఇక దానికి జోడించడానికి లేదా అందునుండి ఏమైనా తీసివేయడానికి ఏమాత్రమూ వీలు లేదు అని అర్థము).
65- “అల్లాహ్ స్వర్గమును మరియు నరకమును సృష్టించినపుడు, జిబ్రయీల్ అలైహిస్సలాం* ను స్వర్గము వైపునకు పంపుతూ ఇలా అన్నాడు “దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు”. ఆయన స్వర్గానికి వెళ్ళి దానిని చూసాడు, మరియు అల్లాహ్ అందులో ఏమేమి తయారు చేసి ఉంచినాడో చూస్తాడు. (తిరిగి వచ్చి) జిబ్రయీల్ అలైహిస్సలాం ఇలా అంటాడు “నీ ఘనత సాక్షిగా, దాని గురించి విన్న వారు ఎవరైనా దాని లోనికి ప్రవేశించాలని తప్ప మరేమీ కోరుకోరు.” అల్లాహ్ తన ఆదేశముతో స్వర్గాన్ని (స్వర్గంలో చేరే మార్గాన్ని) కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లు, శ్రమ, ప్రయాస మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. అపుడు (జిబ్రయీల్ అలైహిస్సలాంతో) అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” కనుక ఆయన (జిబ్రయీల్) స్వర్గానికి తిరిగి వెళ్ళాడు. స్వర్గము కఠిన పరిస్థితులు, కష్టాలు, కడగండ్లతో చుట్టుకుని ఉండడం చూసాడు. అతడు అల్లాహ్ వద్దకు వచ్చి ఇలా అన్నాడు “నీ ఘనత సాక్షిగా, ఎవరూ అందులోనికి ప్రవేశించలేరు.” అపుడు అల్లాహ్ ఆయనతో “నరకానికి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు” అన్నాడు. ఆయన దానిని వెళ్ళి చూసాడు. (అది ఎన్నో భాగాలుగా ఉంది) దాని ఒక భాగము మరొక భాగముపై పేర్చబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా, ఎవరూ దానిలోనికి ప్రవేశించరు” అన్నాడు. అపుడు అల్లాహ్ తన ఆదేశముతో నరకాన్ని వాంఛలు, కోరికలు మొదలైనవి చుట్టుకుని ఉండేలా చేసాడు. తరువాత జిబ్రయీల్ అలైహిస్సలాంతో అల్లాహ్ ఇలా అన్నాడు “తిరిగి వెళ్ళు, దానిని చూడు, మరియు దాని నివాసుల కొరకు నేను ఏమేమి తయారు చేసి ఉంచానో కూడా చూడు.” ఆయన వెళ్ళి దానిని చూసాడు. అది వాంఛలు, కోరికలతో ఆవరించబడి ఉన్నది. ఆయన తిరిగి వచ్చి “నీ ఘనత సాక్షిగా! అందులోనికి వెళ్ళి పడిపోవడం తప్ప, దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని భయంగా ఉన్నది” అన్నాడు.
100- “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిసి ప్రయాణంలో ఉన్నాను. ఒక రోజు ఉదయం మేము ప్రయాణిస్తున్నపుడు, నేను వారికి దగ్గరగా ఉన్నాను. అపుడు నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం!, నన్ను స్వర్గంలోనికి ప్రవేశింపజేసే, మరియు నరకాగ్ని నుండి నన్ను దూరంగా ఉంచే ఒక ఆచరణను గురించి నాకు తెలియజేయండి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: @“నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం*. కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు, ఆయనతో పాటు ఎవరినీ, దేనినీ సాటిగా నిలబెట్టకు, సలాహ్’ (నమజు) స్థాపించు, జకాత్ చెల్లించు, రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు మరియు అల్లాహ్ గృహం యొక్క (కాబతుల్లాహ్ యొక్క) హజ్ చేయి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇంకా ఇలా అన్నారు: "నేను నిన్ను శుభాల ద్వారముల వైపునకు మార్గదర్శకం చేయనా! ఉపవాసం ఒక కవచం, నీరు అగ్నిని ఆర్పినట్లు దాతృత్వం పాపాన్ని ఆర్పివేస్తుంది అలాగే రాత్రి సగభాగములో మనిషి ఆచరించే సలాహ్". తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “{تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ} నుండి మొదలుకుని {يَعْمَلُونَ} వరకు (సూరహ్ అస్’సజ్దహ్ 16-17). తరువాత ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు, ఈ మొత్తం విషయం యొక్క మూల స్థంభము మరియు దాని శిఖరం గురించి నేను నీకు తెలియజేయనా?" దానికి నేను: “తప్పకుండా ఓ రసూలల్లాహ్! నాకు తెలియజేయండి” అన్నాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయానికి శిరస్సు ఇస్లాం, దాని మూలస్థంభము సలాహ్ మరియు దాని శిఖరం జిహాద్." తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “వీటన్నింటినీ పట్టి ఉంచేది ఏమిటో తెలుపనా?” దానికి నేను “తప్పకుండా తెలపండి ఓ ప్రవక్తా!” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని “దీనిని నియంత్రణలో ఉంచుకో” అన్నారు. నేను “ఓ అల్లాహ్ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మాట్లాడే మాటలకు మనం జవాబుదారీగా ఉంటామా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను, ఓ ముఆద్! నాలుకలు పండించే పంట తప్ప మనుషులను వారి ముఖాల మీదనో లేదా వారి ముక్కు మీదనో నరకాగ్నిలో పడవేసేది ఏదైనా ఉందా?”