“నేను మీతో ప్రస్తావించని దాని గురించి అనవసరంగా నన్ను అడగవద్దు. నిశ్చయంగా, మీకు పూర్వం ఉన్న వారిని నాశనం…

“నేను మీతో ప్రస్తావించని దాని గురించి అనవసరంగా నన్ను అడగవద్దు. నిశ్చయంగా, మీకు పూర్వం ఉన్న వారిని నాశనం చేసింది చాలా ప్రశ్నలు అడగడమే మరియు తమ ప్రవక్తలతో విభేదించడమే

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నేను మీతో ప్రస్తావించని దాని గురించి అనవసరంగా నన్ను అడగవద్దు. నిశ్చయంగా, మీకు పూర్వం ఉన్న వారిని నాశనం చేసింది చాలా ప్రశ్నలు అడగడమే మరియు తమ ప్రవక్తలతో విభేదించడమే. కాబట్టి, నేను మిమ్మల్ని దేనినుంచైనా నిషేధించినట్లయితే, దాని నుండి దూరంగా ఉండండి; మరియు నేను మీకు ఏదైనా చేయమని ఆజ్ఞాపిస్తే, మీ శక్తి మేరకు చేయగలిగినంత చేయండి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం షరియత్ యొక్క నియమాలను మూడు విభాగాలు చేసి ప్రస్తావిస్తున్నారు: అవి 1) ప్రస్తావించబడని విషయాలు; 2) నిషేధాలు; మరియు 3) ఆదేశాలు. మొదటి భాగనికి సంబంధించి: ఇవి ఏ విషయాలపైనైతే షరియత్ మౌనంగా ఉన్నదో ఆ విషయాలు; వాటి గురించి ఒక ప్రత్యేకమైన ఆదేశం అంటూ లేని విషయాలు; అటువంటి విషయాల పట్ల ప్రాథమిక సూత్రం ఏమిటంటే వాటి గురించి ఏమీ విధి చేయబడ లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు సంబంధించి ఆయన కాలములో, “ఇది విధి చేయబడుతుందేమో”, లేక “ఇది నిషేధించ బడుతుందేమో” అనే భయంతో ఏదైనా విషయానికి సంబంధించి అనేక ప్రశ్నలు అడగ వలసిన అవసరం లేదు (ఎందుకంటే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి మధ్యనే ఉన్నారు కనుక). ఆ విషయాలను ఆ విధంగానే వదలివేసి, నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల పట్ల కరుణ చూపినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణం తర్వాత, ప్రశ్న ఫత్వా రూపంలో లేదా మతపరమైన విషయాలలో ఏమి అవసరమో బోధించుటకు సంబంధించినది అయితే, అది అనుమతించబడుతుంది, వాస్తవానికి అది ఆదేశంగా పరిగణించబడుతుంది. ఏదైనా విషయానికి సంబంధించి మొండిపట్టుగా, లేదా కపటత్వముతో కూడిన వాదనలకు ఒడిగట్టడం వంటి వాటికి దూరంగా ఉండమని ఈ హదీథులో ఉపదేశించబడుతున్నది. ఎందుకంటే అది ఇస్రాయీలు సంతతివారికి ఏమి జరిగినదో దానికి (పరాభవానికి, కష్టానికి) దారి తీస్తుంది. వారిని ఒక ఆవు బలి ఇవ్వమని ఆదేశించడం జరిగింది. వారు ఏదైనా ఒక ఆవు తీసుకువచ్చి బలి ఇస్తే ఆ ఆదేశంపై అమలు చేసిన వారయ్యేవారు. కానీ వారు ఆ ఆవు వివరాలకు సంబంధించి అనవసరమైన వాదనలో దిగి కఠినావస్థలో పడిపోయారు. అందుకని ఆ ఆదేశాన్ని పాటించడం వారికి కఠినతరం చేయబడింది. రెండవది: “నిషేధాలు”: నిషేధించిన వాటిని వదిలి వేసిన వానికి పుణ్యఫలం లభిస్తుంది; ఆ పనులకు పాల్బడిన వానిని శిక్షించడం జరుగుతుంది. కనుక నిషేధాలన్నింటికీ దూరంగా ఉండాలి. మూడవది: “ఆదేశాలు”: ఆదేశించబడిన విషయాలను ఆచరించిన వాడు పుణ్యఫలం పొందుతాడు, ఆదేశించబడిన విషయాలను ఆచరించకుండా వదలివేసిన వాడు శిక్షించబడతాడు. కనుక ఆదేశించబడిన విషయాలను ప్రతి ఒక్కరూ తమ శక్తి మేరకు ఆచరించాలి.

فوائد الحديث

ఒక వ్యక్తి ఎప్పుడూ అతి ముఖ్యమైన విషయాలలో, మరియు అత్యంత అవసరమైన విషయాలలో మాత్రమే నిమగ్నమై ఉండాలి. ఆ సమయానికి అవసరం లేని విషయాలను వదిలి వేయాలి. అలాగే అప్పటికి ఇంకా జరగని, ఉనికిలోనికి రాని విషయాలను గురించి అతిగా ప్రశ్నించడం మానుకోవాలి.

అతిగా ప్రశ్నించడం విషయాలను సంక్లిష్టపరుస్తుంది, మరియు అనవసర సందేహాలకు, అనుమానాలకు తద్వారా అభిప్రాయభేదాలకు దారి తీస్తుంది. అలా చేయడం నిషేధము.

ఇందులో నిషేధాలన్నింటినీ వదిలివేయమనే ఆదేశం ఉన్నది. ఎందుకంటే వాటిని వదిలివేయడం కష్టం కాదు కనుక. వాటన్నింటి పట్ల నిషేధము సాధారణమైన విషయం.

ఇందులో ఆదేశించబడిన వాటిని శక్తి మేరకు చేయగలిగినంత చేయమనే ఆదేశం ఉన్నది. ఎందుకంటే ఆదేశించబడిన విషయం కష్టాన్ని కలిగించవచ్చు లేదా ఒకరు చేయలేకపోవచ్చు; అందుచేత ఒకరి సామర్థ్యానికి తగ్గట్టుగా, శక్తి మేరకు ఎంతగా చేయగలిగితే అంత చేయమని ఆజ్ఞ.

ఏదైనా విషయాన్ని గురించి అతిగా ప్రశ్నించడం పట్ల నిషేధము: ధర్మ పండితులు ప్రశ్నలను రెండు వర్గాలుగా విభజించారు: వాటిలో ఒకటి మతపరమైన విషయాలలో అవసరమైన వాటిని బోధించే ఉద్దేశ్యంతో అడగబడే ప్రశ్నలు. ఇది అనుమతించబడినది; మరియు ఙ్ఞానవృద్ధి కొరకు అటువంటి ప్రశ్నలు అడగాలని ఆదేశించబడినది. రెండవది: ఏదైనా విషయానికి సంబంధించి మొండిపట్టుగా, లేదా కపటత్వముతో కూడిన వాదనకు ఒడిగట్టడం – ఇది నిషేధించబడింది.

గతించిన జాతులలో జరిగిన విధంగా, అతిగా ప్రశ్నించడం అనేది తమ ప్రవక్త పట్ల ఆ సమాజం అవిధేయతకు పాల్బడేలా చేస్తుంది అనే హెచ్చరిక ఉన్నది.

ఏ విషయంలోనైనా అతిగా ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు, మరియు ప్రవక్తలతో విభేదించడం వినాశనానికి కారణం అవుతుంది; ప్రత్యేకించి, ధర్మములో ఒక ముగింపుకు చేరుకోలేని విషయాలలో: ఉదాహరణకు అగోచర ఙ్ఞానానికి సంబంధించిన విషయాలు, పునరుత్థాన దినమునాటి పరిస్థితులకు సంబంధించిన విషయాలు.

కఠినమైన విషయాల గురించి అతిగా ప్రశ్నించడం నిషేధము: ఇమాం అల్ ఔజాఈ ఇలా అన్నారు: ఒకవేళ అల్లాహ్ తన దాసుణ్ణి జ్ఞానం నుండి దూరం చేయాలనుకుంటే, ఆయన అతడి నాలుకపై భ్రమను, కుతర్కాన్ని ఉంచుతాడు. నేను అటువంటి వారిని ప్రజలలో అతి తక్కువ జ్ఞానవంతులుగా కనుగొన్నాను. ఇబ్న్ వాహబ్ ఇలా అన్నారు: “మాలిక్ ఇలా చెప్పడం విన్నాను: జ్ఞానం గురించి వివాదాలు మనిషి హృదయం నుండి జ్ఞానం యొక్క కాంతిని తీసివేస్తాయి.”

التصنيفات

పూర్వ దైవ ప్రవక్తలు మరియు సందేశహరులు అలైహిముస్సలాం, పదాల అర్ధశాస్త్రం మరియు ఎలా రూపొందించాలి