ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు…

ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో

"అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హుమా ఉల్లేఖనం : "ఒకరోజు సవారీపై నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉన్నాను. అపుడు వారు నాతో ఇలా పలికారు "ఓ పిల్లవాడా! నేను నీకు కొన్ని పదాలు నేర్పుతాను (వాటిని బాగా గుర్తుంచుకో) - అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ నిన్ను రక్షిస్తాడు, అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు, అల్లాహ్ ను నీవు నీ ఎదురుగా కనుగొంటావు, ఒకవేళ ఏమైనా కోరుకోవాలంటే, కేవలం అల్లాహ్ నే కోరుకో, ఒకవేళ ఏమైనా సహాయం అర్థించవలసి వస్తే, కేవలం అల్లాహ్ నే సహాయం కొరకు వేడుకో. గుర్తుంచుకో, ఒకవేళ ఈ ఉమ్మత్ (ముస్లిం జాతి మొత్తం), నీకు ఏమైనా ప్రయోజనం కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమీ ప్రయోజనం కలుగజేయలేరు, అల్లాహ్ నీకోరకు ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. అలాగే, ఒకవేళ ఈ ఉమ్మత్ (సమాజం మొత్తం), నీకు ఏమైనా హాని (నష్టము) కలుగ జేయాలని ఒకచోట గుమిగూడినా, వారందరూ కలిసి నీకు ఏమాత్రమూ హాని (నష్టము) కలుగజేయలేరు, అల్లాహ్ నీకు వ్యతిరేకంగా ముందుగానే నిర్దేశించి ఉంచిన దానిని తప్ప. కలములన్నీ లేపి వేయబడినాయి, కాగితములన్నీ ఇంకిపోయాయి (ఎండిపోయినాయి). (అంటే, అల్లాహ్ ముందుగానే ప్రతి విషయాన్ని పూర్వ నిర్దేశము గావించి ఉంచినాడని, ఇక దానికి జోడించడానికి లేదా అందునుండి ఏమైనా తీసివేయడానికి ఏమాత్రమూ వీలు లేదు అని అర్థము).

[దృఢమైనది] [దాన్ని తిర్మిజీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ఇబ్నె అబ్బాస్ రజియల్లాహు అన్హు ఇలా తెలియ జేస్తున్నారు: 'తన బాల్యంలో, ఒక సవారీ పై తాను ప్రవక్త సల్లల్లాహు అలైహి వ సల్లమ్ వెనుక కూర్చుని ఉండగా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం, తనతో ఇలా అన్నారు "నేను నీకు కొన్ని విషయాలు బోధిస్తాను, వాటి ద్వారా అల్లాహ్ నీకు ప్రయోజనాన్ని కలుగజేస్తాడు." ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా ఇలా పలికినారు, "ఆయన ఆదేశించిన విషయాలను ఆచరించుటలో మరియు ఆయన నిషేధించిన విషయాలనుండి దూరంగా ఉండుటలో అల్లాహ్ పట్ల జాగరూకుడవై, భయభక్తులు కలిగి ఉండు - తద్వారా నీవు ఆయన పట్ల అవిధేయునిగా కాకుండా, విధేయుడైన దాసునిగా ఉంటావు. నీవు గానీ అలా చేస్తే, అల్లాహ్ నిన్ను ఈ ప్రపంచపు ఉపద్రవాలనుండి, పరలోకపు ఉపద్రవాలనుండి కాపాడుతాడు. (ధర్మము, న్యాయము కొరకు) నీవు చేసే కార్యాలలో నీవు ఎక్కడికి వెళ్ళినా ఆయన నీకు సహాయపడతాడు." ఒకవేళ నీవు ఏమైనా కావాలని వేడుకో దలుచుకుంటే, అల్లాహ్ ను తప్ప మరెవ్వరినీ వేడుకోకు. ఎందుకంటే, కేవలం ఆయన ఒక్కడు మాత్రమే కోరికలు కోరుకునే వారి అభ్యర్థనలకు స్పందిస్తాడు. మరియు నీవు ఏమైనా సహాయం కావాలని కోరుకో దలుచుకుంటే, అల్లాహ్ ను తప్ప మరి ఇంకెవ్వరినీ సహాయం కొరకు వేడుకోకు. వాస్తవాన్ని బాగా గ్రహించు - ఈ భూమిపై నివసించే వారందరూ కలిసి ఒక చోట సమావేశమై నీకు ఏమైనా ప్రయోజనం కలిగించ దలుచుకుంటే, నీకు ఏమీ ప్రయోజనం కలిగించలేరు, అల్లాహ్ నీ కొరకు పూర్వనిర్దేశము గావించిన ప్రయోజనం తప్ప. అలాగే ఈ భూమిపై నివసించే వారందరూ కలిసి ఒక చోట సమావేశమై నీకు ఏమైనా హాని కలిగించ దలుచుకుంటే, నీకు ఏమీ హాని కలిగించ లేరు, అల్లాహ్ నీ కొరకు పూర్వనిర్దేశము గావించినది తప్ప. అల్లాహ్, తనకున్న అపార జ్ఞానము, వివేకములను అనుసరించి, ఈ విషయాలు 'ఇలాగే జరుగుతాయి' ('ఇలాగే జరగాలి' అని కాదు) అని ముందుగానే పూర్వనిర్దేశము చేసి ఉంచినాడు. అల్లాహ్ పూర్వనిర్దేశము చేసిన దానిలో మార్పు ఏమీ ఉండదు.

فوائد الحديث

ఇందులో - చిన్నపిల్లలకు 'తౌహీద్'ను గురించి (అల్లాహ్ యొక్క ఏకత్వమును గురించి) మరియు 'ఆదాబ్'ను గురించి (ఆచార వ్యవహారాలు, సంస్కారము మర్యాదలను గురించి) నేర్పించడము యొక్క ప్రాధాన్యత తెలుస్తున్నది.

ఆచరణల యొక్క ప్రతిఫలం, ఆ ఆచరణలను అనుసరించి ఉంటుంది (అది హరామ్ ఆచరణా లేక హలాల్ ఆచరణా అనే దానిపై)

నిజానికి ఇందులో ఉన్న ఆదేశం ఏమిటంటే - అల్లాహ్ పై సంపూర్ణ విశ్వాసము, నమ్మకము కలిగి ఉండడం. కేవలం ఆయన పైనే 'తవక్కుల్' (భరోసా) కలిగి ఉండడం, అన్ని వ్యవహారాలను అత్యుత్తమంగా చక్కదిద్దేవాడు కేవలం ఆయన మాత్రమే అని విశ్వసించడం.

విధివ్రాతను విశ్వసించడం, అన్ని విషయాలు ముందుగానే నిర్దేశించబడి ఉన్నాయని విశ్వసించడం మరియు పూర్వ నిర్దిష్టమై ఉన్న విషయాలను పూర్తి సంతృప్తితో స్వీకరించడం.

ఎవరైతే అల్లాహ్ ఆదేశాలను వదిలి వేస్తాడో, అల్లాహ్ అతడిని కూడా, రక్షించకుండా వదలి వేస్తాడు.

التصنيفات

తీర్పు,విధి వ్రాత యొక్క దశలు