“బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు…

“బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు వారిద్దరిలోనూ మేలు ఉంది

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “బలహీనుడైన విశ్వాసి కంటే బలవంతుడైన విశ్వాసి అల్లాహ్ దృష్టిలో ఎంతో శ్రేష్ఠుడు, ఎంతో ప్రియుడు. మరియు వారిద్దరిలోనూ మేలు ఉంది. నీకు మేలు చేసే దానిని పట్టుకుని ఉండు. సహాయం కోసం అల్లాహ్’ను అడుగు. మరియు నిన్ను నీవు నిస్సహాయునిగా భావించుకోకు. ఒకవేళ నీకు ఏదైనా నష్టం జరిగితే, "నేను ‘ఒకవేళ’ ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది" అని అనకు. అలాకాక "ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ ; అల్లాహ్ తాను కోరినది చేస్తాడు" అని పలుకు. నిశ్చయంగా ‘ఒకవేళ’ అనే మాట షైతాను పనికి మార్గాన్ని తెరుస్తుంది.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేస్తున్నారు: విశ్వాసులందరూ మేలైన వారే. అయితే తన విశ్వాసంలో, సంకల్పములో, సంపదలో మరియు శక్తి కి సంబంధించిన ఇతర అంశాలలో బలంగా ఉన్న విశ్వాసి బలహీనమైన విశ్వాసి కంటే, సర్వశక్తిమంతుడైన అల్లాహ్’కు మరింత ప్రియమైనవాడు, మరియు ఆయన దృష్టిలో ఉత్తముడు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విశ్వాసి కొరకు ఈ విధంగా బోధించినారు: ఇహలోక మరియు పరలోక విషయాలకు సంబంధించి ఒక విశ్వాసి - అన్ని వేళలా సర్వశక్తిమంతుడైన అల్లాహ్’పై ఆధారపడుతూ, ఆయన సహాయం కోరుతూ మరియు అతనిపై సంపూర్ణ భరోసా, నమ్మకంతో - తనకు ప్రయోజనం కలిగించే మార్గాలను ఎంచుకోవాలి. తరువాత – ఇహలోకము మరియు పరలోకములలో తనకు ప్రయోజనం చేకూర్చే విషయాలను ఆచరించడం పట్ల ఒక విశ్వాసి సోమరితనం వహించరాదని, నిస్సహాయతను అవలంబించరాదని, అసమర్థతను ప్రదర్శించరాదని నిషేధించినారు. ఒక విశ్వాసి తన ఆచరణలలో నిజాయితీగా కష్టపడుతూ, అందుకు అందుబాటులో ఉన్న మార్గాలను, సాధనాలను వినియోగించుకుంటూ, అన్ని వేళలా అల్లాహ్ యొక్క సహాయాన్ని, ఆయన నుండి మేలును, శుభాన్ని అర్థిస్తూ ఉన్నట్లయితే – ఆ తరువాత అతడు చేయవలసింది ఏమీ ఉండదు – తమ వ్యవహారాలన్నింటినీ అల్లాహ్ కు అప్పగించడం తప్ప. ఎందుకంటే (ఆ తరువాత) అల్లాహ్ తన కొరకు ఏమి ఎంపిక చేసినా అది శుభప్రదమైనదే అయి ఉంటుందని అతనికి తెలుసు గనుక. ఆ తరువాత - ఒకవేళ అతనిపై ఏదైనా ఆపద వచ్చి పడినా, ఏదైనా నష్టం కలిగినా అతడు ఇలా అనరాదు: “ఒకవేళ నేను ఇలా ఇలా చేసి ఉంటే బాగుండేది”. ఎందుకంటే నిశ్చయంగా ‘ఒకవేళ’ అనే పదం షైతాను పనికి మార్గాన్ని తెరుస్తుంది – విధిరాత పట్ల ఆక్షేపణకు, జరిగిన దానిపట్ల విచారంలో మునిగిపోవడానికి దారి తీస్తుంది. అలాకాక అతడు జరిగిన దానిని శిరోధార్యంగా భావించి, దానిపట్ల పూర్తి సంతృప్తితో “ఇది అల్లాహ్ యొక్క ఆఙ్ఞ, ఆయన తాను కోరినది చేస్తాడు” అనాలి. ఎందుకంటే - ఏది జరిగినా అది అల్లాహ్ కోరుకున్నదానికి అనుగుణంగానే జరుగుతుంది, నిశ్చయంగా ఆయన తాను కోరుకున్నది చేస్తాడు మరియు ఆయన ఆఙ్ఞను రద్దు చేయడం లేదా ఆయన తీర్పులో మార్పు చేయడానికి దానిని అనుసరించడం (ఫాలోఅప్ చేయడం) అనేది ఉండనే ఉండదు.

فوائد الحديث

విశ్వాసానికి సంబంధించి ప్రజలు విభిన్న స్థాయిలలో ఉంటారు.

ఆచరణలలో అన్ని విధాలా శక్తిమంతంగా ఉండడం సిఫార్సు చేయబడుతున్నది; ఎందుకంటే తద్వారా బలహీనత కారణంగా సాధించలేని ప్రయోజనాలను కూడా సాధించడం సాధ్యమవుతుంది.

మనిషి తనకు ప్రయోజనం కలిగించే వాటిని పట్టుకుని ఉండాలి; మరియు ప్రయోజనం కలిగించని విషయాలను విడిచి పెట్టాలి.

విశ్వాసి తన అన్ని వ్యవహారలలో అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరాలి, మరియు కేవలం తనపైనే తాను ఆధారపడి ఉండరాదు.

ఈ హదీసు లో దైవిక శాసనం మరియు విధివ్రాతలను గురించి రుజువు (సాక్ష్యం) ఉంది. మరియు ఆశయసాధన కొరకు తగిన సాధనాలను వినియోగించడం మరియు విధానాలను అనుసరించడాన్ని విభేదించదు.

పని జరగలేదనో, లేక అనుకున్న విధంగా జరగలేదనో, లేక కష్టం వచ్చి పడిందనో లేక నష్టం జరిగిందనో – కోపంతో అల్లాహ్ యొక్క ఆఙ్ఞను, విధివ్రాతను నిరసిస్తూ “ఒకవేళ ఇలా చేసి ఉంటే బాగుండేది” అనే మాటలు పలకడం నిషేధం.

التصنيفات

తీర్పు,విధి వ్రాత సమస్యలు, హృదయాల ఆచరణలు