“(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తన చెంపలు కొట్టుకుంటూ, తన చొక్కాను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో…

“(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తన చెంపలు కొట్టుకుంటూ, తన చొక్కాను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో చేసినట్లు బిగ్గరగా ఏడ్పులు పెడబొబ్బలు పెడతాడో, అతడు మాలోని వాడు కాడు (మాలో ఒకడిగా పరిగణించబడడు)

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖన: “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “(ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు) ఎవరైతే తన చెంపలు కొట్టుకుంటూ, తన చొక్కాను చింపుకుంటూ, అఙ్ఞాన కాలములో చేసినట్లు బిగ్గరగా ఏడ్పులు పెడబొబ్బలు పెడతాడో, అతడు మాలోని వాడు కాడు (మాలో ఒకడిగా పరిగణించబడడు).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అఙ్ఞానకాలపు కొన్ని ఆచారాలను నిషేధించినారు మరియు ఆ ఆచారాలను పాటించే వారి పట్ల, “అతడు మాలోని వాడు కాడు” అని హెచ్చరించినారు. అవి: మొదటిది: ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు ఎవరైతే చెంపలు కొట్టుకుంటారో. ఈ హదీథులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెంపలను ప్రస్తావించినారు; ఎందుకంటే ఆ కాలములో స్వయంగా చెంపలు కొట్టుకొనుట బాగా వ్యాప్తిలో ఉన్న ఆచారం. నిజానికి ఏదైనా కీడు, ఆపద, కష్టము కలిగినపుడు చెంపలను మాత్రమే కాక తన ముఖంపై ఎక్కడ కొట్టుకున్నా అది నిషేధమే. రెండవది: విపరీతమైన కష్టము, బాధ కలిగినపుడు, శరీరంపై ధరించి ఉన్న వస్త్రపు (చొక్కా, కమీజు మొ.) కాలరు భాగం వద్ద బలంగా లాగి చింపుకోవడం. కాలరు భాగము అంటే – తలను దూర్చడానికి అనువుగా, వస్త్రపు పై భాగమున చీలిక ఉన్న భాగము. మూడవది: పెద్ద గొంతుతో ఏడ్పులు పెడబొబ్బలు పెట్టడం, అలా ఏడ్పులు పెడబొబ్బలు పెడుతూ, తనపై వచ్చి పడిన కష్టాన్ని, నాశనాన్ని, నష్టాన్ని తొలగించమని మొరపెట్టుకోవడం.

فوائد الحديث

ఈ హదీథులో ఉన్న కఠినమైన హెచ్చరిక (అతడు మాలోని వాడు కాడు అనే హెచ్చరిక) కారణంగా ఈ ఆచారాలు “కబాఇర్” పాపాలు (ఘోరమైన పాపాలు) అని తెలుస్తున్నది.

కష్టము, ఆపద, విపత్తులు కలిగినపుడు వాటిని ఎదుర్కోవడంలో సహనం పాటించడం విధి. అల్లాహ్ ముందుగానే విధిరాతగా (తఖ్’దీర్ గా) నిర్ణయించిన కష్టాలు, బాధలు, ఆపదలు సంభవించినపుడు విలపించడం, ఏడ్పులు, పెడబొబ్బలు పెట్టడం, తలవెంట్రుకలు తొలగించుకోవడం, బట్టలు చింపుకోవడం మొదలైన వాటి ద్వారా అల్లాహ్ యొక్క నిర్ణయాలపట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడం నిషేధము (హరాం).

శాసనకర్త అయిన అల్లాహ్ ఆమోదించని జాహిలియా పద్ధతులను అనుకరించడం నిషేధించబడింది.

కష్టము, ఆపద, విపత్తులు కలిగినపుడు దుఃఖించుటలో, (తనలో తాను) ఏడ్చుటలో తప్పేమీ లేదు; ఎందుకంటే అవి అల్లాహ్ యొక్క పూర్వ నిర్దిష్టం పట్ల (తఖ్’దీర్ పట్ల) సహనం వహించడానికి వ్యతిరేకం కావు. వాస్తవానికి, అవి మన బంధువులు మరియు ప్రియమైన వారి హృదయాలలో అల్లాహ్ ఉంచిన దయ, కరుణ, ప్రేమ మరియు వాటి వ్యక్తీకరణ వంటిదే.

ఒక ముస్లిం అల్లాహ్ యొక్క పూర్వనిర్దిష్టముతో సంతృప్తి చెందాలి; అతను సంతృప్తి చెందక పోయినా, సహనం వహించడం అతనిపై విధి.

التصنيفات

అజ్ఞాన కాలపు సమస్యలు