“నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఒక మంచి ఆచరణను నాకు సూచించండి”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ ను…

“నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఒక మంచి ఆచరణను నాకు సూచించండి”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ ను ఆరాధించు; (అందులో) ఆయనకు ఎవరినీ సాటి కల్పించకు; నిర్దేశించబడిన ఐదు నమాజులను ఆచరించు; విధి చేయబడిన జకాతును చెల్లించు; మరియు రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు”

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒక ఎడారి వాసి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి ఇలా అన్నాడు: “నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఒక మంచి ఆచరణను నాకు సూచించండి”. దానికి ఆయన ఇలా అన్నారు: “అల్లాహ్ ను ఆరాధించు; (అందులో) ఆయనకు ఎవరినీ సాటి కల్పించకు; నిర్దేశించబడిన ఐదు నమాజులను ఆచరించు; విధి చేయబడిన జకాతును చెల్లించు; మరియు రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు”. అది విని ఆ ఎడారి వాసి ఇలా అన్నాడు: “నా ప్రాణాలు ఎవరి చేతిలోనైతే ఉన్నాయో, ఆయన సాక్షిగా; మీరు చెప్పిన విషయాలకు ఒక్కటి కూడా అధికం చేయను (కలుపను)”. అలా అని అతడు వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “ఎవరైతే స్వర్గవాసులలో ఒక వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారో, వారు అతడి వైపు చూడండి.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఎడారి వాసులలో నుండి ఒక వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం – తనను స్వర్గములోనికి ప్రవేశింపజేసే ఏదైనా ఆచరణను సూచించమని అడగడానికి వచ్చాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి – స్వర్గములోనికి ప్రవేశించుట మరియు నరకాగ్ని నుండి విముక్తి పొందుట అనేది ఇస్లాం యొక్క మూలస్థంభములను ఆచరించుటపై ఆధారపడి ఉంటుంది; వాటిలో ఒకటి అల్లాహ్ ను మాత్రమే ఆరాధించుట, మరియు ఆయనకు ఎవరినీ సాటి కల్పించకుండా ఉండుట; రాత్రీ మరియు పగటి పూటలలో అల్లాహ్ తన దాసులపై విధిగావించిన ఐదు నమాజులను నెలకోల్పటం; అల్లాహ్ నీపై విధిగావించిన జకాతును అర్హులైన వారికి తప్పనిసరిగా చెల్లించుట; రమజాన్ మాసపు ఉపవాసాల ఆచరణను వాటి కొరకు విధిగావించబడిన సమయములోనే ఆచరించుట. అది విని ఆ వ్యక్తి ఇలా అన్నాడు: “ఎవరి చేతిలోనైతే నా ప్రాణం ఉన్నదో ఆయన సాక్షిగా, మీ నుంచి నేను విన్నటువంటి విధిగావించబడిన ఆరాధనలకు ఒక్కటి కూడా ఎక్కువ కలుపను, అలాగే వాటి నుండి ఒక్కటి కూడా తక్కువ చేయను.” అతడు అక్కడి నుండి బయలుదేరిన తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఎవరైతే స్వర్గవాసులలో ఒక వ్యక్తిని చూడటానికి ఇష్టపడతారో, వారు ఈ ఎడారి నివాసిని చూడండి.”

فوائد الحديث

ప్రజలను అల్లాహ్ వైపునకు ఆహ్వానించుటలో – అల్లాహ్ యొక్క తౌహీదు (సకల ఆరాధనలకు నిజ ఆరాధ్యుడు అల్లాహ్ మాత్రమే అని విశ్వసించుట) మొదటి అంశం కావాలి.

కొత్తగా ఇస్లాం స్వీకరించిన నవముస్లిములకు ముందుగా ఇస్లాములో విధిగావించబడిన విషయాలను గురించి బోధించుట ఉత్తమం, అది వారికి సరిపోతుంది.

అల్లాహ్ వైపునకు ఆహ్వానించుట అనేది క్రమానుగంతంగా జరగాలి.

ఇందులో ఇస్లాం యొక్క బోధనలను, ఆచరణలను గురించి నేర్చుకోవాలి అనే ఆశ ఆ ఎడారి నివాసిలో మనకు కనిపిస్తుంది.

ఒక ముస్లిం, ఒకవేళ కేవలం విధిగా ఆచరించవలసిన ఆచరణలకు మాత్రమే కట్టుబడి ఉండి వాటిని మాత్రమే ఆచరించినా అతడు సాఫల్యం పొందినవాడు అవుతాడు; కాని దాని అర్థము స్వచ్ఛంద ఆరాధనలను (సున్నత్ మరియు నఫీల్ ఇబాదాత్ లను) నిర్లక్ష్యం చేయమని కానీ, చేయవచ్చు అని గానీ కాదు. ఎందుకంటే ఈ స్వచ్ఛంద ఆరాధనలే (తీర్పు దినమున) విధిగా ఆచరించవలసిన ఆరాధనలను పూరించడానికి అవసరం అవుతాయి.

ప్రత్యేకంగా కొన్ని విధిగావించబడిన విషయాలను గురించి పేర్కొనుట అనేది అవి ఎంత ముఖ్యమైనవో అని తెలియ జేయడానికి ఒక రుజువు; మరియు వాటి ఆచరణ వైపునకు ప్రోత్సహించుట కొరకు మాత్రమే. అంతేకానీ, కేవలం అవి మాత్రమే విధి ఆచరణలు అనీ, అవి తప్ప ఇంకా విధి ఆచరణలు ఏమీ లేవు అని కాదు దాని అర్థము.

التصنيفات

బోధకుని,శిష్యుని పద్దతులు