‘ముఫర్రిదూన్’లు దీనిని అధిగమించినారు

‘ముఫర్రిదూన్’లు దీనిని అధిగమించినారు

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ఒకసారి, రసూలుల్లాల్ సల్లల్లాహు అలైహి వసల్లం తో మక్కా నగరానికి వెళ్ళే దారిపై ప్రయాణిస్తుండగా, ‘జుమ్’దాన్’ అని పిలవబడే ఒక పర్వతం ప్రక్క నుండి వెళ్ళడం జరిగింది. అపుడు ఆయన ఇలా అన్నారు: “కదలండి ముందుకు, ఇది ‘జుమ్’దాన్’ (పర్వతం); ‘ముఫర్రిదూన్’లు దీనిని అధిగమించినారు”. ఆయన వెంట ఉన్న వారు “ముఫర్రిదూన్ అంటే ఎవరు ఓ రసూలల్లాహ్?” అని ప్రశ్నించారు. దానికి ఆయన: “అల్లాహ్’ను అధికంగా స్మరించే పురుషులు, మరియు అల్లాహ్’ను అధికంగా స్మరించే స్త్రీలు” అన్నారు.

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్’ను అధికంగా స్మరించే వారి స్థాయిని గురించి వివరించారు. వారు స్వర్గవనాలలో అత్యున్నత స్థానాలను పొందుటలో ఇతరుల కంటే ప్రత్యేకులు, మరియు ఇతరుల కంటే ముందుంటారు. ఆయన వారిని ‘జుమ్’దాన్’ పర్వతంతో పోల్చినారు, జుమ్’దాన్ పర్వతం మిగతా పర్వతాల కంటే ప్రత్యేకంగా, ఒంటరిగా, నిలబడి ఉంటుంది.

فوائد الحديث

అల్లాహ్‌ను తరచుగా అధికంగా స్మరించుకోవడం మరియు దానిలో నిమగ్నమవ్వడం అభిలషణీయం, ఎందుకంటే పరలోకంలో (అన్నింటా) ముందంజలో ఉండడం అనేది, ఇబాదాత్’లలో (ఆరాధనలలో) అధికంగా విధేయత, చిత్తశుద్ధి కలిగి ఉండడం పై ఆధారపడి ఉంటుంది.

అల్లాహ్ యొక్క ‘జిక్ర్’ చేయడం (అల్లాహ్’ను స్మరించడం) కేవలం నాలుకతో జరగవచ్చు, లేదా కేవలం మనసులో (హృదయంలో) జరగవచ్చు; లేదా నాలుకతో మరియు హృదయంతో ఏకకాలంలో జరగవచ్చు. ఇది అన్నింటి కంటే ఉత్తమ స్థాయి జిక్ర్.

అల్లాహ్ యొక్క జిక్ర్ లో ఉదయం వేళ పఠించు స్మరణలు, సాయంకాలం వేళ పఠించు స్మరణలు, అలాగే ఐదు పూటలా ఆచరించే నమాజుల తరువాత పఠించే స్మరణలు మొదలైనవి ఉన్నాయి.

ఇమాం అన్’నవవీ ఇలా అన్నారు: “తెలుసుకోండి! అల్లాహ్ యొక్క జిక్ర్ చేయడం యొక్క ఘనత (కేవలం) ‘సుబ్’హానల్లాహ్’ అని పలకడం, ‘లా ఇలాహా ఇల్లల్లాహ్’ అని పలకడం, ‘అల్’హందులిల్లాహ్’ అని పలకడం లేదా ‘అల్లాహు అక్బర్’ అని పలకడం మొదలైన వాటి వరకు మాత్రమే పరిమితం కాదు. వాస్తవానికి సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క విధేయతలో, ఆయన దాస్యములో ఆచరించు ప్రతి ఆచరణ జిక్ర్ అవుతుంది, మరియు అతడు ‘జాకిర్’ (అత్యధికంగా అల్లాహ్ జిక్ర్ చేయువాడు) గా పరిగణించబడతాడు.

నిశ్చయంగా, అల్లాహ్ ను స్మరించడం (అల్లాహ్ యొక్క ఆజ్ఞలను పాటించడం) (ధర్మములో) స్థిరత్వానికి గొప్ప కారణం. పరమ పవిత్రుడు, సర్వోన్నతుడు అయిన అల్లాహ్ దివ్య ఖుర్’ఆన్ లో ఇలా అంటున్నాడు:

[الأنفال: 45] يَـٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓا۟ إِذَا لَقِيتُمْ فِئَةًۭ فَٱثْبُتُوا۟ وَٱذْكُرُوا۟ ٱللَّهَ كَثِيرًۭا لَّعَلَّكُمْ تُفْلِحُونَ

“ఓ విశ్వాసులారా! మీరు ఏ సైన్యాన్నైనా ఎదుర్కొనేటప్పుడు, స్థైర్యంతో ఉండండి. మరియు అల్లాహ్‌ను అత్యధికంగా స్మరిస్తే, మీరు సాఫల్యం పొందుతారు!” (సూరహ్ అల్ అన్’ఫాల్ 8:45)

అల్లాహ్’ను అధికంగా స్మరించుకునే వారికి మరియు జుమ్దాన్ పర్వతానికి మధ్య పోలికకు కారణం వారి ఒంటరితనం (మిగతా వారి నుండి ప్రత్యేకంగా ఉండడం) మరియు ఏకాంతం; జుమ్దాన్ పర్వతం మిగతా పర్వతాల నుండి ప్రత్యేకంగా, వేరుగా ఉంటుంది మరియు అల్లాహ్ ను స్మరించుకునే వారు కూడా అంతే. ప్రజల మధ్య ఉన్నప్పటికీ అటువంటి వ్యక్తి తన హృదయాన్ని మరియు నాలుకను తన ప్రభువు స్మరణలో ఒంటరిగా ఉంచుకుంటాడు; అతను ఒంటరిగా ఉన్న సమయాల్లో (అల్లాహ్ యొక్క జిక్ర్ తో) ఓదార్పుని పొందుతాడు; సమృధ్ధిగా ప్రజలు తన చుట్టూ ఉన్నప్పటికీ అతడు ఒంటరిగా అనుభూతి చెందుతాడు. అల్లాహ్ యొక్క జిక్ర్ కు మరియు పర్వతానికి మధ్య పోలికకు మరో కారణం – ఏ విధంగా నైతే పర్వతాలు భూమిని స్థిరంగా ఉంచుతాయో, అల్లాహ్ యొక్క జిక్ర్ వ్యక్తిని ధర్మములో స్థిరంగా పాదుకుని పోయేలా చేస్తుంది. లేదా మరొక కారణం ఇది ఇహలోకం మరియు పరలోకంలో సత్కార్యాలకు ఒక పరుగు లాంటిది కావచ్చు; ఏ విధంగానైతే మదీనా నుండి మక్కాకు బయలుదేరిన ప్రయాణీకులు, జుం’దాన్ చేరుకున్నపుడు అది మక్కా చేరుకోవడానికి సంకేతంగా, అక్కడికి ముందుగా చేరిన వ్యక్తి మక్కా నగరానికి ముందుగా చేరిన వానిగా పరిగణించబడేవాడు, అలాగే సర్వోన్నతుడైన అల్లాహ్‌ను స్మరించుకునే వ్యక్తి, ఆయనను అధికంగా స్మరించుకోవడం ద్వారా ఇతరుల కంటే పరుగులో అన్నింటా ముందుంటాడు. వల్లాహు ఆ'లము (అల్లాహ్‌ మాత్రమే బాగా ఎరిగిన వాడు).

التصنيفات

జిక్ర్ ప్రాముఖ్యతలు