“సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని…

“సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించినారు: “సూర్యుడు పడమర నుండి ఉదయించనంత వరకు ప్రళయ ఘడియ స్థాపించబడదు. సూర్యుడు పడమర నుండి ఉదయించి నపుడు ప్రజలు దానిని చూస్తారు. అపుడు ప్రజలందరూ (అల్లాహ్ ను) విశ్వసిస్తారు. అయితే, అది ఎటువంటి సమయమంటే – ‘పూర్వం విశ్వసించకుండా, ఆరోజున విశ్వసించిన వ్యక్తికీ లేదా విశ్వసించి కూడా ఏ పుణ్యాన్నీ సంపాదించుకోని వ్యక్తికీ, తన విశ్వాసం వల్ల (ఆ రోజు) ఏ ప్రయోజనం చేకూరదు’ (సూరహ్ అల్ అన్’ఆమ్ 6:158). ప్రళయ ఘడియ స్థాపించ బడినపుడు, (అది ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే), (కూర్చోవడానికి) తమ మధ్య ఒక వస్త్రాన్ని పరుచుకుంటున్న ఇద్దరు వ్యక్తులు దానిని పూర్తిగా పరచలేరు, మరియు దానిని మడత పెట్టనూ లేరు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, త్రాగడానికి చేతిలో ఒంటె పాల గ్లాసును పట్టుకుని ఉన్న వ్యక్తి దానిని త్రాగలేడు, తన పశువులు నీరు త్రాగడానికి గుంటను త్రవ్వుతున్న వ్యక్తి దానిని పూర్తి చేయలేడు; ప్రళయ ఘడియ ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, మీలో ఒకరి చేతిలో ఉన్న అన్నం ముద్ద నోటి వరకూ కూడా చేరదు (అంత హఠాత్తుగా వచ్చి పడుతుంది అని అర్థం).

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ సంభవించే నిదర్శనాలలోని పెద్ద నిదర్శనాలను గురించి తెలియ జేస్తున్నారు – ఆ పెద్ద నిదర్శనాలలో ఒకటి సూర్యుడు తూర్పు నుండి గాక పడమర నుండి ఉదయించడం. సూర్యుడు పడమట నుండి ఉదయించడం చూసినపుడు ప్రజలందరూ (అల్లాహ్’ను) విశ్వసిస్తారు. (ప్రళయ ఘడియ నిదర్శనాలు ప్రస్ఫుటమైన) ఆ సమయాన (అల్లాహ్ ను) విశ్వసించుట, లేదా సత్కార్యములు చేయుట, లేదా తాను చేసిన చెడు పనులకు, పాపకార్యాలకు పశ్చాత్తాప పడుట ఒక అవిశ్వాసికి ఏ విధంగానూ ప్రయోజనం చేకూర్చదు. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రళయ ఘడియ హఠాత్తుగా వచ్చి పడుతుందని తెలియ జేసారు. ఎంత హఠాత్తుగా వచ్చి పడుతుందంటే, ప్రజలు లేచి తమ తమ దైనందిన కార్యాలలో భాగంగా చేస్తున్న పనులను కూడా పూర్తి చేయలేకపోతారు. (తమ చేతిలో ఉన్న పనిని సైతమూ పూర్తి చేయలేరు). ప్రళయ ఘడియ ఎలా సంభవిస్తుందంటే, వస్త్రాలను అమ్మేవాడూ, కొనే వాడూ, తమ మధ్య వస్త్రాలను పరచనూ లేరు, పరిచి ఉన్న వస్త్రాలను మడత పెట్టనూ లేరు. తన ఆడ ఒంటె నుండి అప్పుడే పితికిన పాలను ఆ వ్యక్తి త్రాగను కూడా త్రాగలేడు (అంత హఠాత్తుగా సంభవిస్తుంది ప్రళయ ఘడియ). నీటి తొట్టెను తయారు చేస్తున్న వ్యక్తి, దానిని పూర్తి చేయనూ లేడు. చేతిలో అన్నం ముద్ద పట్టుకుని ఉన్న వ్యక్తి నోటి వరకు ఆ అన్నం ముద్ద చేరను కూడా చేరదు (అంత హఠాత్తుగా సంభవిస్తుంది ప్రళయ ఘడియ).

فوائد الحديث

ఒక వ్యక్తి యొక్క ఇస్లాం మరియు అతని పశ్చాత్తాపము – సూర్యుడు తూర్పు నుండి ఉదయించనంత వరకు స్వీకరించబడతాయి.

ఈ హదీసులో ప్రళయ ఘడియ కొరకు ముందుగానే ఇస్లాంతో మరియు సత్కార్యాలతో సిద్ధంగా ఉండాలి అనే హితబోధ ఉన్నది, ఎందుకంటే ప్రళయ ఘడియ హఠాత్తుగా సంభవిస్తుంది.

التصنيفات

బర్జఖ్ జీవితం, ఆయతుల తఫ్సీర్