“పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?

“పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?

అబూ బక్రహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “పెద్ద పాపములలోకెల్లా అతి పెద్ద పాపములు ఏమిటో మీకు తెలుపనా?” అలా మూడు సార్లు పలికారు. దానికి మేము “తప్పనిసరిగా చెప్పండి ఓ రసూలుల్లాహ్” అని అన్నాము. అపుడు ఆయన “అల్లాహ్ కు సాటి కల్పించుట, తల్లిదండ్రుల పట్ల అవిధేయత చూపుట మరియు వారితో అమర్యాదగా ప్రవర్తించుట” అలా పలికి, అప్పటివరకు చేరగిలబడి కూర్చుని ఉన్న ఆయన నిటారుగా కూర్చుని “అబద్ధమాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట” అని అన్నారు. ఈ మాటలను ఆయన ఆగకుండా పలుమార్లు పలుకుతూనే ఉన్నారు. ఎంతగా అంటే “వారు (ఇకనైనా) మౌనంగా ఉంటే బాగుండును” అని మేము భావించ సాగినాము.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహచరులకు అతి ఘోరమైన పాపముల గురించి తెలుపుతూ, ఈ మూడు పాపములను ప్రస్తావించినారు: 1. ఇతరులను అల్లాహ్ కు సమానులుగా చేయడం – అంటే ఏవైనా ఆరాధనలను అల్లాహ్ కు గాక ఇతరులకు అంకితం చేయడం, ఆ విధంగా అల్లాహ్ యొక్క దైవత్వములో, ఆయన ప్రభుతలో (ఆయన ప్రభువు హోదాలో), ఆయన నామములలో మరియు ఆయన గుణగణాలలో ఇతరులను ఆయనకు సమానులుగా లేదా సాటిగా చేయడం, వారిని లేదా వాటిని ఆయనకు భాగస్వాములుగా చేయడం. 2. తల్లిదండ్రుల పట్ల అవిధేయత: అంటే మాటలలో గానీ, చేతలలో గానీ తల్లిదండ్రులకు హాని కలిగేలా, బాధ కలిగేలా ప్రవర్తించడం, వారి పట్ల ప్రేమాభిమానాలతో, దయతో మెలగకుండా వారిని పట్టించుకోక పోవడం, వదిలివేయడం. 3. అబద్ధాలాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట: ఇది ఒకరి నుండి ధనం లేదా భూమి తీసుకుని, దానిని అతనికి తిరిగి ఇవ్వకుండా కాజేసే ఉద్దేశ్యంతో, అలాగే ఒకరి గౌరవాన్ని, ప్రాభవాన్ని మంటగలిపే ఉద్దేశ్యంతో చెప్పే ఏ అబద్ధమైనా, తప్పుడు మాటైనా, వాంగ్మూలమైనా, ప్రకటనైనా లేక అలాంటిది ఏదైనా దీని క్రిందకు వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ‘అబద్ధాలాడుట మరియు అబద్ధపు సాక్ష్యము చెప్పుట’ ను గురించి పలుమార్లు హెచ్చరించడం, సమాజంపై దాని దుష్పరిణామాలను చూసి, దాని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మాటలలో వ్యక్తమయ్యే వ్యాకులతను చూసి సహాబాలు "అయ్యో! ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇకనైనా ఆపితే బాగుండు" అని అనుకో సాగినారు.

فوائد الحديث

ఘోరమైన పాపాలలో కెల్లా అత్యంత ఘోరమైన పాపము అల్లాహ్ కు సాటి కల్పించడం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిని ఘోరమైన పాపాలలో కెల్లా అతి ఘోరాతి ఘోరమైన వాటిలో మొట్టమొదటి స్థానములో ఉంచినారు. దీనిని అల్లాహ్ కూడా ఖుర్ఆన్ లో ఇలా ధృవీకరిస్తున్నాడు: { నిశ్చయంగా, అల్లాహ్‌ తనకు భాగస్వామి (సాటి) కల్పించడాన్ని ఏమాత్రమూ క్షమించడు. మరియు అది తప్ప దేనిని (ఏ పాపాన్ని) అయినా, ఆయన తలుచుకుంటే క్షమిస్తాడు. మరియు అల్లాహ్‌ కు భాగస్వాములను కల్పించినవాడే, వాస్తవానికి మహా పాపం చేసిన వాడు!} [సూరాహ్ అన్’నిసా 4:48]

అదే విధంగా ఇక్కడ తల్లిదండ్రుల హక్కుల ఘనత గురించి కూడా తెలుస్తున్నది. వారి హక్కులను అల్లాహ్ యొక్క హక్కులతో జత చేయడం జరిగింది.

పాపములలో ‘ఘోరమైన మహాపాపములు’ మరియు ‘చిన్న పాపములు’ అని రెండు విధాలుగా ఉన్నాయి: ఘోరమైన మహాపాపములు అంటే: వాటికి ప్రపంచములోని శిక్ష నిర్ధారించబడి ఉంది, ఉదాహరణకు మరణ శిక్ష, యావజ్జీవ కఠిన కారాగార శిక్ష మొదలైనవి. అలాగే పరలోకములోని కఠిన శిక్షల గురించి ప్రస్తావించబడి ఉంది – అంటే ఉదాహరణకు నరకాగ్నిలో వేయబడుట. అలాగే ఘోరమైన మహాపాపములలో కూడా శ్రేణులు ఉన్నాయి. కొన్ని అసహ్యకరమైనవి (నీచాతి నీచమైన స్థాయికి చెందినవి), మరికొన్ని నిషేధస్థాయికి చెందినవి. ‘చిన్న పాపములు’ అంటే పైన పేర్కొన్న ఘోరమైన పాపములు కాక మిగిలిన ఇతర పాపములు.

التصنيفات

దుర్గుణాలు, పాపకార్యముల ఖండన