.

అబీ సయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “నిశ్చయంగా ఈ ప్రపంచం మధురమైనది మరియు పచ్చనైనది (సుందరమైనది); మరియు నిశ్చయంగా అల్లాహ్ (మీ సమయములో) మిమ్ములను అందులో (ప్రపంచములో) వారసులుగా చేసినాడు – మీరు ఎలా వ్యవహరిస్తారో చూడడానికి. కనుక ఈ ప్రపంచం పట్ల జాగ్రత్తగా ఉండండి, మరియు స్త్రీలపట్ల కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇస్రాయీలు సంతతిలో అరాచకత్వం ప్రబలడానికి వారి స్త్రీ లాలసే మొదటి కారణం అయినది.”

[దృఢమైనది] [దాన్ని ముస్లిం ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా వివరిస్తున్నారు: ఈ ప్రపంచం రుచిలో మధురమైనది, మరియు చూడడానికి సుందరమైనది. కనుక దాని వలన ఒక వ్యక్తి తేలికగా ప్రలోభానికి గురి అవుతాడు, అందులో మునిగిపోతాడు, మరియు దానినే తన కొరకు అత్యంత విలువైనదిగా మార్చుకుంటాడు. అల్లాహ్ ఈ ప్రాపంచిక జీవితములో మనకంటే ముందు వచ్చిన వారికి మనలను వారసులుగా చేసినాడు – ఏ విధంగా వ్యవహరిస్తామో చూడడానికి; ఆయనకు విధేయులుగా వ్యవహరిస్తామా లేక అవిధేయులుగానా? తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా హెచ్చరించినారు: జాగ్రత్త ఈ ప్రపంచపు సరంజామాతోనూ, మరియు దాని సౌందర్యముతోనూ మోసపోకండి; అది (ప్రపంచం) మిమ్ములను అల్లాహ్ ఆదేశించిన వాటిని వదిలేసి, ఆయన నిషేధించిన వాటిలో పడిపోవడానికి దారి తీస్తుంది. ఈ ప్రపంచపు ఆకర్షణలలో అన్నింటికన్నా పెద్దది స్త్రీలపట్ల ఆకర్షణ. ఇస్రాయీలు సంతతి పడిపోయిన మొదటి ఆకర్షణ అది.

فوائد الحديث

ఈ హదీథులో – ఈ ప్రపంచపు ఆకర్షణలలో పడి అందులో మునిగి పోకుండా, ధర్మవర్తనులై ఉండాలనే హితబోధ ఉన్నది.

స్త్రీల వ్యామోహములో పడిపోయే పనులపట్ల జాగ్రత్తగా ఉండాలనే హెచ్చరిక ఉన్నది – ఉదాహరణకు వారిని (అదే పనిగా) చూడడం, వారితో కలవడాన్ని తేలికగా తీసుకోవడం మొదలైనవి.

స్త్రీల పట్ల వ్యామోహం, ఆకర్షణ అనేవి ఈ ప్రపంచములో అన్నింటికన్నా పెద్ద పరీక్షలు.

ఈ హదీసులో గతించిన జాతులకు జరిగిన పరాభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం కనిపిస్తుంది. ఉదాహరణకు ఇస్రాయీలు సంతతికి జరిగిన పరాభవమే మిగతా జాతులకూ జరుగవచ్చు.

స్త్రీ వ్యామోహము : ఆమె అతని భార్య అయినట్లయితే, ఆమెపై వ్యామోహం అతని స్థాయి, స్థోమతకు మించి ఖర్చుచేయడానికి కూడా వెనుకాడనంత వరకు వెళుతుంది; అతడు ధార్మికపరమైన ఆచరణలు ఆచరించడానికి కూడా సమయం లేనంతగా అతనికి తీరిక లేకుండా చేస్తుంది, మరియు ఆమె వ్యామోహంలో ఈ ప్రాపంచిక జీవితం లో మునిగి పోవడం ద్వారా అలసిపోయేలా చేస్తుంది. ఒకవేళ ఆమె పరాయి స్త్రీ అయినట్లయితే ఆమె పట్ల వ్యామోహం (మరింత ప్రమాదకరమైనది, అది) – అతడిని సత్యము నుండి మరలి పోయేలా చేస్తుంది, వారు బయటకు వెళ్ళినా మరియు వారు ఒకరినొకరు కలిసినా; ప్రత్యేకించి ఆ స్త్రీ బాగా అలంకరించుకుని, తనను తాను తగినంతగా కప్పుకోకుండా తిరిగే స్త్రీ అయితే (తిరుగుబోతు స్త్రీ) అటువంటి స్త్రీతో సాంగత్యము, అటువంటి స్త్రీ పై వ్యామోహము వ్యభిచారపు అనేక స్థాయిలకు అతడిని లాగుకుని వెళుతుంది. అందుకని విశ్వాసి ఎప్పుడూ అటువంటి ప్రమాదం లో పడకుండా ఉండడానికి అల్లాహ్ యొక్క రక్షణ కోరుతూ ఉండాలి, అటువంటి స్త్రీల ఫిత్నా (ఉపద్రవం) నుండి ఎప్పుడూ దూరంగా ఉండాలి.

التصنيفات

స్త్రీల ఆదేశాలు, ఇహలోక ఇష్టత ఖండన