“నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం

“నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం

ముఆద్ ఇబ్న్ జబల్ (రదియల్లాహు అన్హు) ఉల్లేఖనం : “నేను దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారితో కలిసి ప్రయాణంలో ఉన్నాను. ఒక రోజు ఉదయం మేము ప్రయాణిస్తున్నపుడు, నేను వారికి దగ్గరగా ఉన్నాను. అపుడు నేను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం!, నన్ను స్వర్గంలోనికి ప్రవేశింపజేసే, మరియు నరకాగ్ని నుండి నన్ను దూరంగా ఉంచే ఒక ఆచరణను గురించి నాకు తెలియజేయండి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నిజంగా నీవు నన్ను గొప్ప విషయం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో, వారికి అది చాలా సులభం. కేవలం అల్లాహ్‌ను మాత్రమే ఆరాధించు, ఆయనతో పాటు ఎవరినీ, దేనినీ సాటిగా నిలబెట్టకు, సలాహ్’ (నమజు) స్థాపించు, జకాత్ చెల్లించు, రమదాన్ మాసము ఉపవాసాలు పాటించు మరియు అల్లాహ్ గృహం యొక్క (కాబతుల్లాహ్ యొక్క) హజ్ చేయి”. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇంకా ఇలా అన్నారు: "నేను నిన్ను శుభాల ద్వారముల వైపునకు మార్గదర్శకం చేయనా! ఉపవాసం ఒక కవచం, నీరు అగ్నిని ఆర్పినట్లు దాతృత్వం పాపాన్ని ఆర్పివేస్తుంది అలాగే రాత్రి సగభాగములో మనిషి ఆచరించే సలాహ్". తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ ఆయతును పఠించినారు: “{تَتَجَافَى جُنُوبُهُمْ عَنِ الْمَضَاجِعِ} నుండి మొదలుకుని {يَعْمَلُونَ} వరకు (సూరహ్ అస్’సజ్దహ్ 16-17). తరువాత ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు, ఈ మొత్తం విషయం యొక్క మూల స్థంభము మరియు దాని శిఖరం గురించి నేను నీకు తెలియజేయనా?" దానికి నేను: “తప్పకుండా ఓ రసూలల్లాహ్! నాకు తెలియజేయండి” అన్నాను. దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: "ఈ మొత్తం విషయానికి శిరస్సు ఇస్లాం, దాని మూలస్థంభము సలాహ్ మరియు దాని శిఖరం జిహాద్." తరువాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: “వీటన్నింటినీ పట్టి ఉంచేది ఏమిటో తెలుపనా?” దానికి నేను “తప్పకుండా తెలపండి ఓ ప్రవక్తా!” అన్నాను. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని “దీనిని నియంత్రణలో ఉంచుకో” అన్నారు. నేను “ఓ అల్లాహ్ ప్రవక్తా సల్లల్లాహు అలైహి వసల్లం! మనం మాట్లాడే మాటలకు మనం జవాబుదారీగా ఉంటామా?” దానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను, ఓ ముఆద్! నాలుకలు పండించే పంట తప్ప మనుషులను వారి ముఖాల మీదనో లేదా వారి ముక్కు మీదనో నరకాగ్నిలో పడవేసేది ఏదైనా ఉందా?”

الشرح

ముఆద్ రదియల్లాహు అన్హు ఇలా అన్నారు: నేను ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తో ఒక ప్రయాణంలో ఉన్నాను, మరియు ఒక రోజు మేము నడుచుకుంటూ వెళుతున్నప్పుడు నేను ఆయనకు దగ్గరగా ఉన్నాను, అపుడు నేను ఇలా అడిగాను: "ఓ రసూలల్లాహ్! నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేసే మరియు నన్ను నరకం నుండి దూరంగా ఉంచే ఆచరణ గురించి చెప్పండి." ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: "వాస్తవానికి నీవు ప్రజలు నిర్వహించడం కష్టతరమైన ఒక కార్యం గురించి అడిగావు, అయితే అల్లాహ్ ఎవరికి సులభతరం చేస్తాడో అది వారికి చాలా సులభం మరియు తేలిక - ఇస్లాం విధిగా ఆచరించమని ఆదేశించిన వాటిని ఆచరించు." మొదటిది: ఎవరినీ, దేనినీ ఆయనకు సాటిగా, సహవర్తిగా, భాగస్వామిగా నిలబట్టకుండా కేవలం అల్లాహ్’ను మాత్రమే ఆరాధించు. రెండవది: రాత్రంబవళ్ళలో విధిగా ఆచరించవలసిన ఐదు నమాజులు ఆచరించు – ఫజ్ర్, దొహ్ర్, అస్ర్, మగ్రిబ్ మరియు ఇషా నమాజులు; వాటి నిర్ధారిత సమయాలలో, వాటికి సంబంధించిన అన్ని నియమాలను, సంప్రదాయాలను పాటిస్తూ ఆచరించు. మూడవది: విధి చేయబడిన జకాతును చెల్లించు. ఇది ఒక ఆర్ధిక పరమైన ఆరాధన. ఇది నిర్ణీత స్థాయికి చేరిన కొన్ని సంపదలపై షరియత్ విధి చేసిన మొత్తము. ఇది అర్హులైన వారికి ఇవ్వబడుతుంది. నాలుగవది: రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట. ఉపవాసము అంటే ఉషోదయం నుండి మొదలుకుని, సూర్యాస్తమయం వరకు, ఆరాధనా సంకల్పముతో తినుట, త్రాగుట మరియు ఉపవాసమును భంగపరిచే ప్రతి విషయము నుండి దూరంగా ఉండుట. ఐదవది: హజ్ యొక్క నియమాలను పాటిస్తూ, కేవలం సర్వోన్నతుడైన అల్లహ్’ను ఆరాధించే సంకల్పముతో, మక్కాహ్ నగరాన్ని దర్శించి బైతుల్లాహ్ యొక్క (అల్లాహ్ యొక్క గృహము) హజ్ చేయుట. అప్పుడు ఆయన (స) ఇలా అన్నారు: “నేను నీకు శుభాల ద్వారాలకు దారి తీసే మార్గం గురించి తెలియజేయనా? విధిగా ఆచరించ వలసిన విషయాలతో పాటు స్వచ్ఛంద ఆరాధనలను (సున్నతు, నఫిల్) నిర్వర్తించు”. మొదటిది: స్వచ్ఛంద ఉపవాసములు పాటించుట, ఇది వాంఛలను, కోరికలను అణచివేసి, వ్యక్తిలో శక్తిని తక్కువ చేస్తుంది, తద్వారా పాపకార్యములలో పడిపోకుండా నిరోధిస్తుంది. రెండవది: (విధిగా చెల్లించే జకాతు కాక) స్వచ్ఛందంగా దానములు చేయుట, ఒకవేళ మన వల్ల ఏదైనా తప్పుడు పని, పాపపు పని జరిగిపోయినట్లైతే, ఈ స్వచ్చంద దానములు దానిని తుడిచివేస్తాయి. మూడవది: రాత్రి చివరి భాగములో ఆచరించే తహజ్జుద్ సలాహ్. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కులను పఠించినారు: {تتجافى جنوبهم } అంటే “వారు తమ ప్రక్కలను (కుడి, ఎడమ ప్రక్కలను) దూరం చేసుకుంటారు”; {عن المضاجع} “తమ మెత్తని పరుపులనుండి”; {يدعون ربهم} “తమ ప్రభువును వేడుకుంటారు” సలాహ్ ద్వారా, ఆయనను స్మరించుట ద్వారా; ఖుర్’ఆన్ పఠనం ద్వారా, మరియు దుఆ చేయుట ద్వారా; {خَوْفًا وَطَمَعًا وَمِمَّا رَزَقْنَاهُمْ يُنفِقُونَ فَلَا تَعْلَمُ نَفْسٌ مَّا أُخْفِيَ لَهُم مِّن قُرَّةِ أَعْيُنٍ} “భయంతో మరియు ఆశతో వేడుకుంటారు; మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు; కాని వారికి, వారికర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచిపెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు”; అంటే, తీర్పు దినాన మరియు స్వర్గంలో వారికి అంతిమ సౌఖ్యాన్ని అందించే ఆనందం {جَزَاءً بِمَا كَانُوا يَعْمَلُونَ ١٧} (వారు ఆచరిస్తూ ఉండిన దానికి ప్రతిఫలంగా). (వారు (రాత్రులలో) తమ ప్రక్కలను తమ పరుపుల నుండి దూరం చేసి, తమ ప్రభువును భయంతో మరియు ఆశతో వేడుకుంటారు మరియు మేము వారికి ప్రసాదించిన జీవనోపాధి నుండి ఖర్చుచేస్తారు. కాని వారికి, వారి కర్మల ఫలితంగా వారి కొరకు (పరలోకంలో) కళ్ళకు చలువనిచ్చే ఎటువంటి సామాగ్రి దాచి పెట్టబడి ఉందో ఏ ప్రాణికీ తెలియదు). అప్పుడు ఆయన (స) ఇలా అన్నారు: నేను నీకు ధర్మం యొక్క (దీన్ యొక్క) పునాది ఏమిటో తెలుపనా? దాని ఆధారభూతమైన మూల స్తంభము గురించి తెలుపనా? మరియు దాని శిఖరం గురించి తెలుపనా? ము’ఆద్ (రదియల్లాహు అన్హు) “తప్పకుండా తెలుపండి ఓ రసూలల్లాహ్” అన్నారు. ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: ఈ మొత్తం విషయం యొక్క శిరస్సు అల్’ఇస్లాం. ఇస్లాం అంటే రెండు విషయాలపట్ల సాక్ష్యం ఇవ్వడం (షహాదతాన్ – రెండు సాక్ష్యాలు). విశ్వాసానికి సంబంధించిన ఈ రెండు సాక్ష్యాల ద్వారా ధర్మం యొక్క సారాంశాన్ని పొందుతారు. మరియు దాని స్తంభం సలాహ్, కనుక సలాహ్ లేకుండా ఇస్లాం లేదు, ఒక ఇల్లు స్తంభం లేకుండా లేనట్లే, ఎవరైనా సలాహ్ చేస్తే, అతని ఇస్లాం (ధర్మం) మరింత బలపడుతుంది మరియు ఉన్నతమవుతుంది; దాని శిఖరం మరియు ఔన్నత్యం జిహాద్‌లో ఉంది మరియు అల్లాహ్ వాక్కును అత్యున్నతం చేయుటకుగానూ ఇస్లాం యొక్క శత్రువులతో పోరాడడంలో, కృషి చేయడంలో ఉంది. అప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంఇలా అన్నారు: పైన పేర్కొన్న వాటిని ఏది నియంత్రిస్తుందో మరియు ఏది పరిపూర్ణం చేస్తుందో నేను నీకు చెప్పనా? ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తన నాలుకను పట్టుకుని ఇలా అన్నారు: దీన్ని నియంత్రించుకో మరియు మీకు సంబంధం లేని వాటి గురించి మాట్లాడకు. అపుడు ముఆద్ ఇలా అన్నాడు: మనం మాట్లాడే దానికి మన ప్రభువు మనల్ని జవాబుదారీగా మరియు బాధ్యులుగా చేసి శిక్షిస్తాడా?! అపుడు ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “నీ తల్లి నిన్ను పోగొట్టుకోను” అని ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తన మాటను మొదలుపెట్టారు. ఇలా అనడం వాస్తవానికి శాపనార్థం కాదు. ఇది అరబీ భాషలో ఒక విధమైన వాడుక – “ఇంత చిన్న విషయం కూడా నీకు తెలియదా, నీవు దీనిని గురించి ఎప్పుడో తెలుసుకుని ఉండవలసింది” అని ఆ విషయం పట్ల అతణ్ణి హెచ్చరించడం; ఉదాహరణకు తెలుగు భాషలో “నీ మొహం మండా” అనడం లాంటిది, ఇలా అనడం తెలుగు భాషలో అతని ముఖం నిజంగానే మండాలని పెట్టే శాపనార్థం కాదు అన్న విషయం మనందరికీ తెలుసు. తరువాత ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా అన్నారు: “మనుషుల నాలుకలు పండించే పంటలు - అవిశ్వాసం, అపనిందలు, తిట్లు, దూషణలు, చాడీలు మాట్లాడుట - ఇవి తప్ప మనుషులను మంటల్లోకి నెట్టివేసి వారి ముఖాలపై పడేలా చేసేది మరేదైనా ఉందా?”.

فوائد الحديث

ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సహాబాలు (రదియల్లాహు అన్హుమ్) ఎల్లప్పుడూ ఙ్ఞాన సముపార్జన పట్ల ఆసక్తిగా ఉండేవారు. అందుకనే ఙ్ఞానాన్ని పెంచుకునే దిశలో తమకు తెలియని విషయాలను గురించి ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తరుచూ ప్రశ్నిస్తూ ఉండేవారు.

ఈ హదీథులో సహాబాల యొక్క ధార్మిక అవగాహన గురించి మనకు తెలుస్తున్నది – ఎందుకంటే వారికి తెలుసు మనలను స్వర్గములో ప్రవేశింపజేసే వాటిలో మన ఆచరణలు కూడా ఒక కారణం అని.

నిజానికి ముఆద్ (రదియల్లాహు అన్హు) యొక్క ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న; ఎందుకంటే అందులో ఈ జీవితము మరియు భూమిపై దాని ఉనికి యొక్క రహస్యము ఉన్నది. ఈ ప్రపంచములోని ప్రతి వ్యక్తీ ఆదము సంతానము నుండి వచ్చినవాడు, లేదా జిన్నుల సంతానము నుండి వచ్చిన వాడు. ప్రతి వ్యక్తి అంతిమ లక్ష్యము స్వర్గము లేదా నరకము.అందుకనే ఆ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న.

అతని స్వర్గ ప్రవేశము ఇస్లాం యొక్క ఐదు మూల స్తంభములను పాటించుటపై ఆధారపడి ఉన్నది : అవి, షహాదతైన్ (రెండు విషయాల పట్ల సాక్ష్యమిచ్చుట); సలాహ్ ఆచరించుట; జకాత్ చెల్లించుట; ఉపవాసములు పాటించుట మరియు హజ్జ్ యాత్ర చేయుట.

అందులో ఇస్లాం ధర్మము యొక్క శిరస్సు వంటిది, అత్యంత ఉత్తమమైనది; ఇస్లాం ఆదేశించిన విధులలో సర్వోత్తమమైనది – “తౌహీద్” - కేవలం అల్లాహ్’ను మాత్రమే ఆరాధించుట ఆయనకు సాటిగా, సమానులుగా, భాగస్వాములుగా ఎవరినీ కల్పించకుండా.

అల్లాహ్ తన దాసుల పట్ల తన కరుణకు, కృపకు చిహ్నంగా వారి కొరకు శుభాల ద్వారాలను తెరిచాడు; వాటి ద్వారా తన దాసులకు గొప్ప ప్రతిఫలాన్ని పొందే మరియు పాపక్షమాపణను పొందే మార్గాలను వారికి పొందుపరుచుట కొరకు.

అలాగే ఈ హదీథులో విధిగా ఆచరించవలసిన నమాజుల తరువాత స్వచ్ఛందంగా ఆచరించే నమాజుల యొక్క ఘనత తెలియుచున్నది.

ఒక నివాస గృహానికి మూలస్తంభము ఎటువంటిదో, ఇస్లాం కు సలాహ్ అటువంటిది. దాని మూలస్తంభము లేకపోతే ఒక గుడారం ఎలా కూలిపోతుందో, అలాగే సలాహ్ లేకుండా ఇస్లాం లేదు.

తనకు ధర్మములో నష్టము, హాని కలిగించే విషయాల నుండి నాలుకను కాపాడుకోవడం, అదుపులో పెట్టుకోవడం ప్రతి వ్యక్తికి విధి.

నాలుకను నిగ్రహించడం, నియంత్రించడం మరియు అదుపులో పెట్టుకోవడం అన్ని శుభాలకు పునాది.

التصنيفات

ఇస్లాం