“ఓ చిన్నాన్న, “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు) అను. ఈ ఒక్క మాట ద్వారా నీ కొరకు…

“ఓ చిన్నాన్న, “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు) అను. ఈ ఒక్క మాట ద్వారా నీ కొరకు నేను అల్లాహ్ ను వేడుకుంటాను”

సయీద్ ఇబ్న్ ముసయ్యిబ్ తన తండ్రి నుండి ఉల్లేఖిస్తున్నారు: “అబూ తాలిబ్ చనిపోయే సమయాన నేను అక్కడే ఉన్నాను. రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడికి వచ్చారు. ఆయన వద్ద అప్పటికే అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ ఇబ్న్ అబీ ఉమయ్యహ్ ఇబ్న్ అల్ ముఘీరహ్ ఉండడం గమనించారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “ఓ చిన్నాన్న, “లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు వేరే ఎవ్వరూ లేరు) అను. ఈ ఒక్క మాట ద్వారా నీ కొరకు నేను అల్లాహ్ ను వేడుకుంటాను” అపుడు అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ అబీ ఉమయ్యహ్ ఇలా అన్నారు “(ఓ అబూ తాలిబ్!) ఏం, అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని విడనాడుతావా నువ్వు?” రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం విడువకుండా (షహాదహ్ పదాలు పలుకమని) పేర్కొంటూనే ఉన్నారు. వారు కూడా తమ మాటలను పునరావృతం చేస్తూనే ఉన్నారు. చివరికి, అబూ తాలిబ్ “లా ఇలాహా ఇల్లల్లాహ్” అని పలుకడానికి నిరాకరిస్తూ, తన చివరి మాటగా “నేను అబ్దుల్ ముత్తలిబ్ ధర్మం మీదనే చనిపోతాను” అన్నాడు (అని ప్రాణం విడిచాడు). ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అల్లాహ్ సాక్షిగా! (చెబుతున్నాను), నేను వారించబడనంత వరకూ నేను నీ క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను”. అపుడు అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసాడు: { مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَنْ يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ} {అల్లాహ్’కు సాటి కల్పించే వారు (ముష్రికులు) దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించుట తగదు.} [సూరహ్: అత్-తౌబహ్ 9:113]. మరియు అబూ తాలిబ్’ను గురించి, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు, అల్లాహ్ ఈ ఆయతును అవతరింపజేసినాడు: { إِنَّكَ لا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَكِنَّ اللهَ يَهْدِي مَنْ يَشَاءُ} { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకం చేయలేవు. కానీ అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకం పొందే వారెవరో బాగా తెలుసు} [సూరహ్ అల్ ఖసస్ 28:56].

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణశయ్య పై ఉన్న తన చిన్నాన్నను (అబూ తాలిబ్ ను) చూడడానికి ఆయన గదిలోనికి ప్రవేశించినారు. తరువాత ఆయనతో ఇలా అన్నారు: “ఓ చిన్నాన్న! ‘లా ఇలాహ ఇల్లల్లాహ్’ (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు) అను. ఈ ఒక్క మాటతో అల్లాహ్ ముందు నేను నీ కొరకు సాక్ష్యమిస్తాను.” అబూ జహ్ల్ మరియు అబ్దుల్లాహ్ బిన్ అబీ ఉమయ్యహ్ ఇలా అన్నారు: “ఓ అబూ తాలిబ్, ఏం నీ తండ్రి అబ్దుల్ ముత్తలిబ్ ధర్మాన్ని అంటే విగ్రహాలను ఆరాధించడం వదిలి వేస్తున్నావా నువ్వు? ” వారు పదేపదే ఆ విధంగా అనసాగారు. చివరికి ఆయన తన చివరి మాటగా వారితో ఇలా అన్నాడు: “అబ్దుల్ ముత్తలిబ్ ధర్మమైన బహుదైవారాధనను, విగ్రహారాధనను అనుసరిస్తున్నాను (అని ప్రాణం విడిచాడు). అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “అల్లాహ్ నన్ను వారించేదాక నేను నీ క్షమాభిక్ష కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను”. అపుడు సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క ఈ వాక్కులు అవతరించినాయి. { مَا كَانَ لِلنَّبِيِّ وَالَّذِينَ آمَنُوا أَنْ يَسْتَغْفِرُوا لِلْمُشْرِكِينَ} {అల్లాహ్’కు సాటి కల్పించే వారు (ముష్రికులు) దగ్గరి బంధువులైనా, వారు నరకవాసులని వ్యక్తమైన తరువాత కూడా, ప్రవక్తకు మరియు విశ్వాసులకు వారి క్షమాపణకై ప్రార్థించుట తగదు.} [సూరహ్: అత్-తౌబహ్ 9:113]. అప్పుడు అబూతాలిబ్’ను గురించి అల్లాహ్ యొక్క ఈ వాక్కులు అవతరించినాయి: { إِنَّكَ لا تَهْدِي مَنْ أَحْبَبْتَ وَلَكِنَّ اللهَ يَهْدِي مَنْ يَشَاءُ} { (ఓ ప్రవక్తా!) నిశ్చయంగా నీవు, నీకు ఇష్టమైన వారికి మార్గదర్శకం చేయలేవు. కానీ అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు. మరియు ఆయనకు మార్గదర్శకం పొందే వారెవరో బాగా తెలుసు} [సూరహ్ అల్ ఖసస్ 28:56]. నిశ్చయంగా నీవు కోరిన వారికి మార్గదర్శకం చేయలేవు; కానీ అతనికి సత్య సందేశాన్ని (ఇస్లాంను) చేరవేయడం నీ బాధ్యత. అల్లాహ్ తాను కోరిన వారికి మార్గదర్శకం చేస్తాడు.

فوائد الحديث

బహుదైవారధకుల కొరకు (అల్లాహ్ ను) క్షమాభిక్ష ప్రసాదించమని ప్రార్థించడం నిషేధం; వారు మన బంధువులైనా, మంచిపనులు చేస్తున్న వారైనా, లేక దానధర్మాలు ఎక్కువగా చేసేవారైనా సరే.

తాత, తండ్రులను, పెద్ద వారిని (ఆధారాలూ, ఋజువులూ ఏవీ లేకుండా) గుడ్డిగా అనుసరించడం అనేది జాహిలియ్యహ్ కాలము (ఇస్లాం పూర్వపు అఙ్ఞానకాలము) వారి ఆచరణ.

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క దయ, కనికరము, కరుణల పరిపూర్ణతను చూడవచ్చు, అలాగే ఇందులో ప్రజలను సత్య ధర్మము వైపునకు ఆహ్వానించుటపట్ల, వారిని సన్మార్గము వైపునకు మార్గదర్శనం చేయుట పట్ల వారి ఆసక్తి చూడవచ్చు

ఇందులో అబూ తాలిబ్ ఇస్లాం స్వీకరించినాడు అని దావా చేసేవారి కొరకు దాని ఖండన మరియు జవాబు ఉన్నది.

ఆచరణల యోగ్యత, చిట్టచివరి ఆచరణలపై ఆధాపడి ఉంటుంది.

ఈ హదీసు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తో బంధుత్వము, సంబంధము, దగ్గరితనము, స్నేహము కలిగి ఉండుట శుభాన్ని తీసుకు వస్తుందని, లేదా ఆపదను, హానిని తొలిగిస్తుంది అని విశ్వసించుట తప్పు అని తెలియజేస్తున్నది.

ఎవరైతే “లా ఇలాహ ఇల్లాల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని సంపూర్ణ ఙ్ఞానముతో, నిశ్చతత్వముతో మరియు పూర్తి విశ్వాసముతో పలుకుతాడో అతడు ఇస్లాం లోనికి ప్రవేశిస్తాడు.

అలాగే ఇందులో చెడ్డవారి సాంగత్యము వల్ల మానవులకు కలిగే హాని గురించిన సందేశం ఉన్నది.

“లా ఇలాహ ఇల్లల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్యుడు ఎవరూ లేరు) అని పలుకుట యొక్క అర్థము: విగ్రహాలను ఆరాధించుటను విడనాడుట, అలాగే సన్యాసులను, సత్పురుషులను, ధర్మగురువులను ఆరాధించుటను విడనాడి, అన్ని రకాల ఆరాధనలను కేవలం అల్లాహ్ కు మాత్రమే ప్రత్యేకించుట.

ఒకవేళ అతడు ఇస్లాం స్వీకరిస్తాడు అనే ఆశ, లేక ఆ పరిస్థితి ఉన్నట్లయితే, వ్యాధిగ్రస్తుడై ఉన్నఅవిశ్వాసిని పరామర్శించుటకు వెళ్ళవచ్చును.

సఫల మార్గదర్శనము ప్రసాదించుట కేవలం అల్లాహ్ చేతిలోనే ఉన్నది; ఆయన ఏకైకుడు, అద్వితీయుడు, ఎవరూ సాటి లేని వాడు – అయితే మార్గదర్శకం చేయు బాధ్యత, సత్య ధర్మము వైపునకు, (అల్లాహ్ యొక్క వాక్కు, సూచనలు, సందేశము మరియు) ఋజువులతో ఆహ్వానించు బాధ్యత రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం పై ఉన్నది.

التصنيفات

ఖుర్ఆన్ తఫ్సీర్, అల్లాహ్ వైపు పిలుపు