“నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప

“నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప

అబూ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకగా నేను విన్నాను: “నా ఉమ్మత్ మొత్తం (అల్లాహ్ చేత) క్షమించబడుతుంది; ఎవరైతే బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడతారో వారు తప్ప. బహిరంగంగా పాపకార్యాలకు పాల్బడుటలో ఇది కూడా ఒక రకం – అందులో ఒకడు రాత్రివేళ పాపకార్యానికి ఒడిగడతాడు; ఉదయానికి అల్లాహ్ అతని పాపకార్యాన్ని (లోకులనుండి) కప్పివేస్తాడు; కానీ అతడు: “ఓ ఫలానా! ఓ ఫలానా! (నీకు తెలుసా) నేను రాత్రి ఇలా ఇలా చేసాను” అంటాడు (అలా అని దానిని బహిరంగ పరుస్తాడు). రాత్రి అతడు అల్లాహ్ యొక్క పరదా మాటున గడిపినప్పటికీ, ఉదయం అతడు తనంతట తానే ఆ పరదాను తొలగిస్తాడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా విశదపరుస్తున్నారు: పాప కార్యాలకు పాల్బడిన ఒక ముస్లిం కొరకు అల్లాహ్ చేత అతని పాపములు క్షమించబడుటకు, అతనికి అల్లాహ్ చేత క్షమాభిక్ష ప్రసాదించబడుటకు అవకాశం ఉన్నది; కేవలం చేసిన పాపాన్ని గర్వంగా, డంబాలు పలుకుతూ, మూఢంగా జనుల ముందు బయల్పరిచే వాడు తప్ప. అటువంటి వాడు క్షమాభిక్షకు పాత్రుడు కాడు; ఎందుకంటే రాత్రివేళ అతడు పాపకార్యానికి ఒడిగడతాడు, అపుడు అల్లాహ్ అతడి పాపాన్ని (లోకుల నుండి) కప్పివేసి ఉంచినప్పటికీ; ఉదయం అతడు తాను క్రితం రాత్రి ఇలా ఇలా చేసాను అని చెబుతాడు. రాత్రి అతడు తన ప్రభువు పరదా మాటున గడుపుతాడు, కానీ ఉదయం అతడు స్వయంగా ఆ పరదాను తొలగించి తనను తాను బహిరంగ పరుచుకుంటాడు.

فوائد الحديث

చేసిన పాపాన్ని అల్లాహ్ కప్పి ఉంచిన తరువాత, దానిని బహిరంగపరచడం అసహ్యమైన పని.

చేసిన పాపపు పనిని బహిరంగంగా చెప్పుకోవడం, విశ్వాసులలో నైతిక పతనాన్ని వ్యాపింపజేస్తుంది.

ఎవరినైతే అల్లాహ్ ఈ ప్రపంచములో (తన పరదా వెనుక) కప్పి ఉంచుతాడో, అల్లాహ్ పరలోకమునందు కూడా (అతడి పాపములను) కప్పి ఉంచుతాడు. ఇది తన దాసుల పట్ల సర్వోన్నతుడైన అల్లాహ్ యొక్క నిరుపమానమైన కరుణ.

ఎవరైతే పాపపు పనికి ఒడిగడతాడో, అతడు తనను తాను (బహిరంగ పరచకుండా) కప్పి ఉంచుకోవాలి మరియు పాపపు పనికి పాల్బడినందుకు అల్లాహ్ సమక్షమున పశ్చాత్తాపము చెందాలి.

చేసిన పాపపు కార్యాన్ని ఉద్దేశ్యపూర్వకంగా బహిరంగంగా ప్రకటించుకునే వాని భయంకరమైన అపరాధం ఏమిటంటే – ఆ కారణంగా అతడు అల్లాహ్ చేత క్షమించబడే అవకాశాన్ని కోల్పోతాడు.

التصنيفات

పాపకార్యముల ఖండన