“సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా…

“సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది

అబ్దుల్లాహ్ ఇబ్న్ మస్’ఊద్ రదియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “సత్యసంధతకు కట్టుబడి ఉండండి; నిశ్చయంగా సత్యసంధత ధార్మికతకు, ధర్మబద్ధతకు దారితీస్తుంది; మరియు నిశ్చయంగా ధర్మబద్ధత స్వర్గానికి దారి తీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము సత్యమునే పలుకుతూ, సత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద సత్యసంధులలో నమోదు చేయబడతాడు. మరియు అసత్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. నిశ్చయంగా అసత్యము దుర్నీతికి, అధర్మానికి దారి తీస్తుంది. మరియు నిశ్చయంగా అధర్మము నరాగ్నికి దారితీస్తుంది. ఒక వ్యక్తి నిత్యము అసత్యమునే పలుకుతూ, అసత్యమును పలకడానికే కష్టపడుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరుగా నమోదు చేయబడతాడు.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సత్యం పలకమని ఆజ్ఞాపించారు మరియు దానికి కట్టుబడి ఉండటం నిరంతర సత్కార్యాలకు దారి తీస్తుంది అని తెలియజేసారు. నిలకడగా మంచిపనులు చేయడం అనేది చేసే వ్యక్తిని స్వర్గానికి చేరుస్తుంది మరియు అతను రహస్యంగానూ మరియు బహిరంగంగానూ సత్యాన్ని అవలంబిస్తూనే ఉంటాడు. అటువంటి వ్యక్తి అత్యంత సత్యవంతునిగా ముద్ర వేయబడటానికి అర్హుడు అవుతాడు. ఇది సత్యసంధత యొక్క పరాకాష్ఠ. తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అసత్యం పలుకుట పట్ల మరియు తప్పుడు మాటలు మాట్లాడుట పట్ల హెచ్చరించారు. ఎందుకంటే అది ధర్మం నుండి వైదొలగడానికి మరియు చెడు, అవినీతి మరియు పాపపు పనులకు పాల్బడడానికి దారి తీస్తుంది; చివరికి నరకాగ్నికి దారి తీస్తుంది. అతడు నిరంతరం అసత్యమునే పలుకుతూ ఉంటాడు, చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరులలో ఒకనిగా నమోదు చేయబడతాడు.

فوائد الحديث

నిజాయతీ అనేది ఒక గొప్ప లక్షణం, దీనిని నిరంతర సాధన మరియు పోరాటం ద్వారా పొందుతారు, ఎందుకంటే అలాంటి వ్యక్తి నిజాయితీనే కోరుకుంటాడు, నిజాయితీగా ఉండడాన్నే కోరుకుంటాడు, నిజాయితీ అతని స్వభావం మరియు అతని తత్వము అయ్యే వరకు అతని సాధన కొనసాగుతూనే ఉంటుంది. అందువల్ల అతను అల్లాహ్ వద్ద నిజాయితీపరులలో మరియు ధర్మబద్ధులలో నమోదు చేయబడతాడు.

అసత్యం పలకడం అనేది ఒక ఖండించదగిన మరియు నిందనీయమైన లక్షణం. దానిని కలిగిన వ్యక్తి, సుదీర్ఘ అభ్యాసం ద్వారా దానిని పొందుతాడు. చివరికి అది అతని లక్షణం మరియు స్వభావంగా మారుతుంది. అసత్యం అతని మాటలలో మరియు అతని చర్యలలో భాగమైపోతుంది. చివరికి అతడు అల్లాహ్ వద్ద అబద్ధాలకోరులలో ఒకనిగా నమోదు చేయబడతాడు

సత్యసంధత అనేక విషయాలతో సంబంధం కలిగి ఉంటుంది. సత్యసంధత నాలుకతో సంబంధం కలిగి ఉంటుంది, అది అసత్యానికి వ్యతిరేకమై ఉంటుంది; సత్యసంధత సంకల్పాలతో సంబంధం కలిగి ఉంటుంది, సంకల్పములో సత్యవంతంగా ఉండడం నిజాయితీని సూచిస్తుంది; మంచిని చేయాలనే సంకల్పము దాని పట్ల దృఢత్వానికి, నిబద్ధతకు దారి తీస్తుంది. ఆచరణలలో నిజాయితీ - ఇది తక్కువలో తక్కువగా వ్యక్తి యొక్క అంతర్గత మరియు బాహ్య స్వభావాలలో సరళతకు సత్యవంతంగా ఉండుటకు దారి తీస్తుంది; మరియు వివిధ పరిస్థితులలో సత్యవంతంగా ఉండడం – ఉదాహరణకు భయం, ఆశపడుట మొదలైన విషయాలలో సత్యవంతంగా, నిజాయితీగా ఉండడం. ఎవరైతే ఈ లక్షణాలు కలిగి ఉంటాడో అతడు అత్యంత సత్యవంతుడు; వీటిలో కొన్ని లక్షణాలు కలిగి ఉన్నవాడు సత్యవాది.

التصنيفات

సద్గుణాలు