. . .

అబూ హురైరహ్ రదియల్లాహు అన్హు ఉల్లేఖన, "రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు మాంసం తీసుకువచ్చారు. ఆయనకు ఇష్టమైన తొడ భాగం (అజ్-జిరాఅ్) ఆయనకు అందజేశారు. ఆయన దాన్ని కొంచెం కొరికి తిన్నారు, తర్వాత ఇలా పలికినారు..." "నేను ప్రళయ దినాన ప్రజలకు నాయకుడని. ఈ విషయం ఎందుకో మీకు తెలుసా? అల్లాహ్ మొదటి తరం నుండి చివరి తరం వరకు ఉనికిలో వచ్చిన ప్రజలందరినీ ఒకే చోట సమీకరిస్తాడు. ప్రతి ఒక్కరూ ప్రకటనకర్త (ఇస్రాఫీల్) స్వరాన్ని వింటారు, ప్రతిదీ స్పష్టంగా కనిపిస్తుంది. సూర్యుడు అతి సమీపంలోకి వచ్చేస్తాడు. ప్రజలు ఎంతో బాధతో(ఆ వేడిని) తట్టుకోలేని స్థితిలో భయకంపితులై ఉంటారు. అపుడు ప్రజలు ఇలా అంటారు: 'మీరు చూడటం లేదా? ఎంత భయంకరమైన స్థితి వచ్చింది! మన కోసం మన ప్రభువు వద్ద ఎవరైనా శిఫారసు చేసేవారు ఉన్నారా?' అప్పుడు వారు ఒకరినొకరు సలహా అడుగుతారు, ఎవరో 'ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' అంటారు. వారు ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లి, ఇలా అంటారు: 'మీరు మానవుల పితామహులు. అల్లాహ్ స్వయంగా తన చేతులతో మిమ్మల్ని సృష్టించాడు, తనే స్వయంగా మీలో ఆత్మను ఊదాడు, దేవదూతలు మీకు సాష్టాంగ ప్రణామం చేశారు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' దానికి ఆదం అలైహిస్సలాం ఇలా అంటారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. ఆయన నాకు ఒక చెట్టు నుండి తినకూడదని ఆజ్ఞాపించాడు, కానీ నేను అవిధేయతకు పాల్బడినాను. అయ్యో నా ప్రాణం! అయ్యో నా ప్రాణం! మీరు వేరొకరి వద్దకు వెళ్లండి - నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' ... (ఇలాగే నూహ్, ఇబ్రాహీం, మూసా, ఈసా అలైహిముస్సలాం వద్దకు వెళ్లి అందరూ తమ తప్పులను స్మరించుకుని తమను తాము రక్షించుకోవాలని అంటారు)...చివరికి వారు నా వద్దకు (ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) వచ్చి, ఇలా అంటారు: 'ఓ ముహమ్మద్! మీరు అల్లాహ్ యొక్క రసూల్, ప్రవక్తలలో చిట్టచివరివారు. అల్లాహ్ మీ మునుపటి, తర్వాతి పాపాలను క్షమించాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి!' నేను అల్లాహ్ సింహాసనం క్రింద సజ్దా చేస్తాను. అప్పుడు అల్లాహ్ తన మహిమలు, స్తుతులను నాకు అర్థం చేసుకునే శక్తిని ఇస్తాడు. అపుడు ఆయన ఇలా అంటాడు: 'ఓ ముహమ్మద్! తల ఎత్తు, అడుగు - ఇవ్వబడుతుంది, శిఫారసు చేయి - ఆమోదించబడుతుంది!' అపుడు నేను ఇలా అంటాను: 'ఓ నా ప్రభువా! నా సమాజం. ఓ నా ప్రభువా! నా సమాజం,' దానికి అల్లాహ్ ఇలా అంటాడు: 'నీ సమాజంలోని వారిలో తమపై ఏ లెక్కా లేని వారిని స్వర్గం కుడి ద్వారం ద్వారా ప్రవేశపెట్టు!' ఆ స్వర్గం ద్వారాల మధ్య దూరం మక్కా-హిమ్యర్ (లేదా మక్కా-బుస్రా) మధ్య దూరం అంత ఉంటుంది."

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహాబాలతో కలిసి ఒక విందులో పాల్గొన్నారు. వారు ఆయన ముందు గొర్రె తొడ భాగం పెట్టారు, ఇది ఆయనకు చాలా ఇష్టమైన భాగం. ఆయన తన పళ్ళ కొనలతో ఒక చిన్న ముక్క కొరికి తిన్నారు, తర్వాత సహాబాలతో మాట్లాడటం ప్రారంభించారు. ఆయన ఇలా అన్నారు: "ప్రళయ దినాన నేను (ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం) ఆదం సంతతికి నాయకుడిగా ఉంటాను. ఇది తనపై అల్లాహ్ తఆలా యొక్క అనుగ్రహాన్ని వివరిస్తూ ఆయన పలికిన మాట." "తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అడిగారు: 'ఈ విషయం ఎందుకో మీకు తెలుసా?' తరువాత ఆయన ఇలా వివరించారు: 'ప్రళయ దినాన ప్రజలందరిని ఒక విశాలమైన, సమతలంగా ఉన్న భూమిపై ఒకచోట సమీకరించబడతారు. అక్కడ ఉన్నవారందరూ ప్రకటనకర్త (ఇస్రాఫీల్) స్వరాన్ని వింటారు, సర్వదృష్టి కలవాడు (అల్లాహ్) వారిని చుట్టుముట్టి ఉంటాడు - ఏ రహస్యమూ ఆయన వద్ద దాచిపెట్టలేరు. ఈ సమతల భూమిలో ఎవరూ ఎక్కడా దాక్కోలేరు. ప్రతి ఒక్కరి మాటలు అందరికీ వినిపిస్తాయి, ప్రతి ఒక్కరినీ అందరూ చూడగలరు. సూర్యుడు ప్రజలకు కేవలం ఒక మైలు దూరంలో ఉంటాడు. ప్రజలు ఎంతో బాధ, భయంతో తట్టుకోలేని స్థితిలో ఉంటారు. అప్పుడు వారు శిఫారసు ద్వారా ఈ స్థితి నుండి విముక్తి కోసం అర్థిస్తారు.'" "అల్లాహు తఆలా విశ్వాసుల హృదయాలలో ఈ ఆలోచన పుట్టిస్తాడు: 'మీరు మానవుల తండ్రి ఆదం అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!' వారు ఆయన వద్దకు వెళ్లి, ఆయన గొప్పతనాన్ని స్మరించుకుంటారు, బహుశ ఆయన వారి కోసం అల్లాహ్ వద్ద శిఫారసు చేయవచ్చని ఆశిస్తారు. వారు ఇలా అంటారు: 'ఓ ఆదం! మీరు మానవుల పితామహులు. అల్లాహ్ స్వయంగా తన చేతులతో మిమ్మల్ని సృష్టించాడు, దైవదూతలు మీకు సజ్దా చేశారు, ప్రతి వస్తువు పేరు మీకు నేర్పాడు, తనే స్వయంగా మీలో ఆత్మను ఊదాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి!' కానీ ఆదం అలైహిస్సలాం క్షమాపణ కోరుతూ ఇలా అంటారు: 'నా ప్రభువు ఈ రోజున ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. ఆయన నాకు ఒక నిషిద్ధ వృక్షం నుండి తినకూడదని ఆజ్ఞాపించాడు, కానీ నేను అవిధేయతకు పాల్బడినాను. నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు వేరొకరి వద్దకు వెళ్లండి - నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు నూహ్ అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ నూహ్! మీరు భూమి పైకి పంపబడిన మొట్టమొదటి ప్రవక్త. అల్లాహ్ మిమ్మల్ని "కృతజ్ఞత కలిగిన దాసుడు" (అబ్దన్ షకూరా) అని పేర్కొన్నాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి!' కానీ నూహ్ అలైహిస్సలాం క్షమాపణ కోరుతూ ఇలా అంటారు: 'నా ప్రభువు ఈ రోజున ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. నేను నా జనులపై ఒక శాపం చేసాను (వారు నమ్మకపోవడంతో). నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి - ఇబ్రాహీం (అలైహిస్సలాం) వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు ఇబ్రాహీం అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ ఇబ్రాహీం! మీరు భూమిపై అల్లాహ్ స్నేహితులు (ఖలీలుల్లాహ్). మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' కానీ ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలా జవాబిస్తారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. నేను మూడు సార్లు ఇలా అసత్యం చెప్పాను: "నేను అనారోగ్యంతో ఉన్నాను" (జనులను తప్పించడానికి), "ఈ విగ్రహాన్ని పెద్దవాడే నాశనం చేశాడు", నా భార్య సారాకు చెప్పిన "అతను నా సహోదరుడని చెప్పు" (అన్యాయం నుండి రక్షణ కోసం). నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి!'" "నిజానికి ఆ మూడు మాటలు (ఇబ్రాహీం చెప్పిన) మాటల గారడీలా చమత్కారాలుగా (మఆరిజ్-అల్-కలామ్) ఉండవచ్చు. కానీ అవి బాహ్యంగా అసత్యాలుగా కనిపించడంతో, ఆయన తనను తాను శిఫారసు చేసుకోవడానికి అనర్హుడిగా భావించారు. ఎందుకంటే, ఎవరు అల్లాహ్‌ను బాగా అర్థం చేసుకున్నవారో, ఆయన దగ్గర ఎక్కువ స్థానం ఉన్నదో, వారికి దైవభయం ఎక్కువగా ఉంటుంది. ఆయన (ఇబ్రాహీం) ఇలా అన్నారు: 'నా ప్రాణమే రక్షణకు అర్హమైనది. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి - మూసా అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు మూసా అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ మూసా! మీరు అల్లాహ్ ప్రవక్త, ఆయన మిమ్మల్ని ప్రత్యేకించి తన సందేశంతో మరియు ప్రత్యక్షంగా మాట్లాడడంతో గౌరవించాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' కానీ మూసా అలైహిస్సలాం ఇలా జవాబిస్తారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. నేను ఒక ప్రాణిని (ఎగిప్తియను) చంపాను, అలా చంపేందుకు నేను ఆజ్ఞాపించబడ లేదు. నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి - మర్యం కుమారుడు ఈసా అలైహిస్సలాం వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు ఈసా అలైహిస్సలాం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ ఈసా! మీరు అల్లాహ్ ప్రవక్త, ఆయన మర్యంకు అందించిన 'కలిమతుల్లాహ్' (అల్లాహ్ వాక్కు), మరియు ఆయన ఆత్మ నుండి సృష్టించబడినవారు. మీరు శిశువుగా ఉండగానే ఉయ్యాలలో నుండే ప్రజలతో మాట్లాడారు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' కానీ ఈసా అలైహిస్సలాం ఇలా జవాబిస్తారు: 'నా ప్రభువు ఈ రోజు ఎన్నడూ లేనంత ఎక్కువ కోపంతో ఉన్నాడు. (ఆయన తన పాపాలను ప్రస్తావించలేదు కానీ) నా ప్రాణమే నాకు రక్షణ కావాలి. మీరు ఇంకొకరి వద్దకు వెళ్లండి - ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లండి!'" "అప్పుడు ప్రజలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళ్లి ఇలా అంటారు: 'ఓ ముహమ్మద్! మీరు అల్లాహ్ ప్రవక్త మరియు ప్రవక్తలలో చిట్టచివరివారు. అల్లాహ్ మీ మునుపటి మరియు తర్వాతి పాపాలను క్షమించాడు. మా కోసం మన ప్రభువు వద్ద శిఫారసు చేయండి! మేము ఏ స్థితిలో ఉన్నామో చూడటం లేదా?' అప్పుడు నేను వెళ్లి అల్లాహ్ అర్ష్ (సింహాసనం) క్రింద సజ్దా చేస్తాను. అల్లాహ్ నా కోసం తన మహిమలు మరియు స్తుతుల నుండి ప్రత్యేక వాక్యాలను నాపై అవతరింపజేస్తాడు, అవి ఇంతకు ముందు ఎవరికీ ఇవ్వబడలేదు. తర్వాత ఆయన (అల్లాహ్) అంటాడు: 'ఓ ముహమ్మద్! తల ఎత్తు, అడుగు - ఇవ్వబడుతుంది, శిఫారసు చేయి - అంగీకరించబడుతుంది.' నేను నా తల ఎత్తి ఇలా అంటాను: 'ఓ ప్రభువా! నా సమాజం. ఓ ప్రభువా! నా సమాజం. ఓ ప్రభువా! నా సమాజం.' అప్పుడు నా శిఫారసు ఆమోదించ బడుతుంది." "అప్పుడు అల్లాహ్ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఇలా అంటాడు: 'ఓ ముహమ్మద్! నీ సమాజం లోని ఆ ప్రజలను (ఎవరిపై ఏ లెక్కా లేదో) స్వర్గం యొక్క కుడి ద్వారం ద్వారా ప్రవేశపెట్టు. మిగతా ద్వారాల ద్వారా ప్రవేశించే ప్రజలందరిలో కూడా వారు భాగస్వాములు అవుతారు.'" "ఆ తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రమాణం చేసారు: 'నా ప్రాణం ఆయన చేతిలో ఉందో ఆ ప్రభువు పై ప్రమాణం! స్వర్గపు ఒక్క ద్వారం యొక్క రెండు వైపుల మధ్య దూరం, మక్కా మరియు యెమెన్ లోని సనా (సనాఆ) మధ్య దూరం లాంటిది, లేదా మక్కా మరియు షామ్ (సిరియా) లోని బుస్రా (హౌరాన్ ప్రాంతం) మధ్య దూరం లాంటిది.'"

فوائد الحديث

"ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నమ్రత మరియు సాధారణ సహాబాలతో కలిసి భోజనం చేయడం వారి ప్రత్యేక గుణాలలో ఒకటి. ఆయన ఎల్లప్పుడూ సామాన్య ప్రజల ఆహ్వానాలను అంగీకరించేవారు, వారితో కలిసి నేలపై కూర్చొని భోజనం చేసేవారు."

ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) యొక్క ప్రత్యేకత మరియు సర్వమానవులపై ఆయన గొప్పతనం స్పష్టం చేయబడింది.

"ఖాజీ ఇయాద్ (రహిమహుల్లాహ్) వివరిస్తూ ఇలా అన్నారు: నాయకుడు అంటే తన ప్రజల కంటే ఉన్నత స్థానంలో ఉండి, కష్ట సమయాల్లో ఆధారంగా మారేవాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇహలోకం మరియు పరలోకంలో మన నాయకుడు. ప్రళయ దినాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం: ఆ రోజు నాయకత్వం పరమోత్కృష్టమైనది, అందరూ ఆయనకు లొంగి ఉంటారు, ఆదం మరియు ఆయన సంతతి అందరూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జెండా క్రింద ఉంటారు."

"అల్లాహ్ తఆలా ప్రజల హృదయాలలో మొదట ఆదం అలైహిస్సలాం, తర్వాత ఇతర ప్రవక్తలను శిఫారసు కోసం అడగడానికి ప్రేరేపించడంలో గొప్ప వివేకం ఉంది. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను మొదటిగా అడగడానికి ప్రేరేపించలేదు. ఈ విధానం ద్వారా: ప్రవక్త యొక్క అత్యున్నత స్థానం ప్రదర్శించబడుతుంది, ఆయన సర్వోత్కృష్టమైన దైవసాన్నిధ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది, ఇది ఆయన పరిపూర్ణమైన ప్రత్యేకతకు సాక్ష్యంగా నిలుస్తుంది"

ఎవరైనా దాసుడు అల్లాహ్ వద్ద ఏదైనా సమర్పించాలనుకుంటే, ఆయన ముందుగా (దుఆలో) అల్లాహ్ యొక్క గొప్ప లక్షణాలను, మంచి గుణాలను ప్రశంసిస్తూ మాట్లాడటం సిఫార్సు చేయబడింది; అలా చేయడం అనేది దుఆ త్వరగా నెరవేరడానికి సహకరిస్తుంది.

తనకు సాధ్యం కాని పని గురించి ఎవరైనా అడిగినప్పుడు, అతను ఆ పనిని తాను చేయలేనని పలికి తనను మన్నించమని కోరవచ్చు. అలాగే, ఆ పనిని మరొకరు చక్కగా చేయగలిగే అవకాశం ఉంటే, ఆ వ్యక్తిని సూచించడం సిఫార్సు చేయబడింది.

ప్రళయ దినం నాడు, మానవులకు ఎదురు కాబోయే విపరీతమైన భయకర పరిస్థితి, మరియు సమస్త ప్రజలు ఒకే చోట సమీకరించబడిన దృశ్యం ఎంత విపరీతంగా, తీవ్రంగా ఉంటుందో వివరించబడింది.

ప్రవక్తల వినయం (నమ్రత) గురించి తెలుస్తుంది, ఎందుకంటే వారు గతంలో చేసినది గుర్తు చేసుకుని, వారు ఆ గొప్ప తీర్పుదినము సమక్షంలో తమను తాము తక్కువగా భావించటం స్పష్టం అవుతుంది.

ప్రళయ దినంలో మహా షఫాఅత్ ధృవీకరించబడింది. ఇది సృష్టిరాశులన్నింటిలో అంతిమ తీర్పు చేయడానికై జరుగుతుంది.

ప్రవక్త ముహమ్మద్ ﷺ కు లభించబోయే "అల్-వసీలా" మరియు "మఖామె మహ్మూద్" ధృవీకరించబడింది.

అల్లాహ్ తాలా యొక్క ప్రశంసల‌కు అంతం లేదు. అందుకే, ఆ మహా స్థితిలో (ప్రళయ దినాన) ఇతరులెవరికీ ఇవ్వని కొత్త శుభవార్తలు, గొప్ప వర్ణనలు, అద్భుతమైన ప్రశంసా వచనాలను అలాహ్ తన ప్రవక్తకు ప్రసాదిస్తాడు.

ముహమ్మద్ ﷺ సమాజం అనేది అన్ని సమాజాల్లోను ఉత్తమమైన సమాజం. వారికి కొన్ని ప్రత్యేక హక్కులు ఉన్నాయి, ముఖ్యంగా స్వర్గంలో ప్రవేశించే విషయంలో: వారి పాపాలను లెక్కించకుండా స్వర్గంలో ప్రవేశింప జేసే వారి కొరకు ప్రత్యేక ద్వారం ఉంటుంది, అలాగే మిగతా ద్వారాల ద్వారా ఇతర సమాజాలతో కలిసి వారు కూడా ప్రవేశిస్తారు.

التصنيفات

పరలోక జీవితం