గ్రంథ ప్రజలను (వారు చెబుతున్నదానిని) విశ్వసించకండి, అలాగని వారిని (వారు చెబుతున్న దానిని) తోసిపుచ్చకండి. మీరు…

గ్రంథ ప్రజలను (వారు చెబుతున్నదానిని) విశ్వసించకండి, అలాగని వారిని (వారు చెబుతున్న దానిని) తోసిపుచ్చకండి. మీరు ఇలా పలకండి (“మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన దానిని విశ్వసిస్తాము”)

అబీ హురైరహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “గ్రంథ ప్రజలు తౌరాత్ గ్రంథాన్ని హిబ్రూ భాషలో చదివేవారు, దానిని అరబీ భాషలో ముస్లిములకు వివరించేవారు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికారు “గ్రంథ ప్రజలను (వారు చెబుతున్నదానిని) విశ్వసించకండి, అలాగని వారిని (వారు చెబుతున్న దానిని) తోసిపుచ్చకండి. మీరు ఇలా పలకండి (“మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన దానిని విశ్వసిస్తాము”) (సూరహ్ అల్ బఖరహ్: 2:136)

[దృఢమైనది] [దీనిని ఇమామ్ బుఖారీ ఉల్లేఖించారు]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గ్రంథ జలు తమ గ్రంథాలనుండి ఉల్లేఖిస్తున్న దానిపట్ల మోసపోరాదని తన ఉమ్మత్’ను హెచ్చరిస్తున్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలములో యూదులు తౌరాత్ గ్రంథాన్ని హిబ్రూ భాషలో చదివే వారు. అది యూదుల భాష. దానిని అరబీ భాషలో వివరించేవారు. దానిపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “గ్రంథప్రజలను విశ్వసించకండి. అలా అని వారిని తోసిపుచ్చకండి. ఎందుకంటే మన వైపునకు అవతరించబడిన దానిని (ఖుర్ఆన్ ను), మరియు గ్రంథము (లౌహ్ అల్ మహ్’ఫూజ్) నుండి వారి వైపునకు అవతరించబడిన దానిని విశ్వసించమని అల్లాహ్ మనల్ని ఆదేశిస్తున్నాడు. అయితే మన షరియత్’లో, ఆ గ్రంథాలలో నుండి వారు చెబుతున్నది సరియైనదేనా లేక అందులో లోపాలు ఏమైనా ఉన్నాయా అనేది స్పష్టపరిచే ఆధారాలు ఏవీ లేనందున మనకు మరో మార్గం లేదు. అందుకని మనం ఆగిపోతాము – వారు చెబుతున్న దానిని విశ్వసించకుండా; అలా చేయకపోతే వారు వక్రీకరించిన దానిలో వారితో పాటు మనం కూడా భాగస్వాములము అవుతాము. అలా అని వారు చెబుతున్నది అబద్ధం అని వారిని తోసిపుచ్చము. ఎందుకంటే వారు చెబుతున్న దానిలో నిజం కూడా ఉండవచ్చు; వారిని తోసిపుచ్చినట్లయితే (గ్రంథము నుండి) వారి వైపునకు అవతరించబడిన దానిని విశ్వసించమనే అల్లాహ్ ఆదేశాలను నిరాకరించిన వారము అవుతాము. అందుకని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలుకమని మనల్ని ఆదేశిస్తున్నారు: “మేము అల్లాహ్ ను మరియు ఆయన మా కొరకు అవతరింపజేసిన సందేశాలను మరియు ఇబ్రాహీమ్, ఇస్మా’యీల్, ఇస్’హాఖ్, య’అఖూబ్ మరియు అతని సంతతి వారికి ఇవ్వబడిన వాటినీ మరియు మూసా, ’ఈసా మరియు ఇతర ప్రవక్త లందరికీ వారి ప్రభువు తరఫు నుండి ఇవ్వబడిన వాటినీ (సందేశాలను) విశ్వసిస్తాము. వారిలో ఏ ఒక్కరి పట్లా మేము భేదభావం చూపము. మేము ఆయనకు విధేయులం (ముస్లిములము) అయ్యాము”. (సూరహ్ అల్ బఖరహ్: 2:136)

فوائد الحديث

ఇందులో గ్రంథ పజలు చెప్పే విషయాలు మూడు రకాలుగా ఉంటాయని తెలుస్తున్నది:

ఒకటవ రకం: ఖుర్’ఆన్ మరియు సున్నత్’తో ఏకీభవిస్తున్న విషయాలు; ఇవి విశ్వసనీయమైనవి.

రెండవ రకం: ఖుర్’ఆన్ మరియు సున్నత్ లకు వ్యతిరేకమైన విషయాలు; అవి అసత్యాలు.

మూడవ రకం: ఖుర్’ఆన్ లోనూ లేక సున్నత్ లోనూ ఆ విషయాలను సమ్మతిస్తూ గానీ లేక వ్యతిరేకిస్తూ గానీ ఎటువంటి ప్రమాణమూ, లేక నిదర్శనమూ లేని విషయాలు. ఇవి కేవలం ఉల్లేఖనలు; వాటిని సత్యము అని గానీ, లేక అసత్యము అని గానీ ప్రామాణీకరించము.