ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి…

ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి తిను

ఉమర్ ఇబ్న్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం: “నేను నా బాల్యములో రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకములో ఉంటిని. (భోజన సమయాన) నా చేయి భోజనపళ్ళెం అంతటా తిరుగుతూ ఉండేది. దాంతో రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) నాతో ఇలా అన్నారు “ఓ బాలుడా! (తినుటకు ముందు) అల్లాహ్ పేరును స్మరించు, కుడి చేతితో తిను, మరియు నీకు దగ్గరగా (ఎదురుగా) ఉన్నదాని నుండి తిను.” అప్పటి నుండి నేను ఆ విధంగానే తింటున్నాను.”

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఉమర్ బిన్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హుమా, ప్రవక్త భార్యలలో ఒకరైన ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా యొక్క కుమారుడు. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి పెంపకము మరియు సంరక్షణలో పెరిగినారు. ఆయన ఇలా వివరిస్తున్నారు: భోజన సమయాన ఆయన చేయి భోజన పళ్ళెంలో అటు పక్కకు, ఇటు పక్కకు కదులుతూ ఉండేది అక్కడి నుండి పళ్ళెంలోని పదార్థాలను తీసుకోవడానికి. అది చూసి ప్రవక్త ఆయనకు మూడు భోజన మర్యాదలు బోధించినారు: మొదటిది: భోజనం తినుట ప్రారంభించడానికి ముందు ‘బిస్మిల్లాహ్’ పఠించుట. రెండవది: కుడి చేతితో తినుట. మూడవది: భోజన పళ్ళెంలో తన వైపున అంటే తన ఎదురుగా, తనకు దగ్గరగా ఉన్న దానిలో నుండి తినుట.

فوائد الحديث

తినుట మరియు త్రాగుట ప్రారంభించడానికి ముందు అల్లాహ్ పేరును స్మరించుట ‘భోజన మర్యాదలలో’ ఒకటి.

ప్రజలు తమ బాధ్యతలో, సంరక్షణలో ఉన్న పిల్లలకు వివిధ విషయాలకు సంబంధించి మర్యాదలను బోధించాలి.

ఇందులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దయాపూరిత వ్యవహారం, పిల్లలకు (ఏదైనా విషయాన్ని) బోధించుటలో, వారికి క్రమశిక్షణ నేర్పించుటలో వారి ఓర్పు కనిపిస్తున్నాయి.

భోజన మర్యాదలలో ఒకటి ఏమిటంటే మనిషి తనకు చేరువలో (తన ఎదురుగా) ఉన్నదానిలో నుండి తినుట – తన పళ్ళెంలో అనేక రకాల ఇతర భోజన పదార్థాలు ఉంటే తప్ప. అటువంటి సందర్భములో అతడు వాటినుండి తీసుకొన వచ్చును.

ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమకు బోధించిన దానికి, తమకు నేర్పిన క్రమశిక్షణకు సహబాలు కట్టుబడి ఉండేవారు. ఈ విషయాన్ని ఉమర్ బిన్ అబీ సలమహ్ రజియల్లాహు అన్హు యొక్క - “అప్పటినుండి నేను అదే విధంగా తింటున్నాను” - అనే మాటల ద్వారా అర్థం అవుతున్నది.

التصنيفات

తినే మరియు త్రాగే పద్దతులు