“ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొడిగించ బడాలని ఆశిస్తాడో, అతడు తన బంధువులతో సంబంధాలను…

“ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొడిగించ బడాలని ఆశిస్తాడో, అతడు తన బంధువులతో సంబంధాలను నిలిపి ఉంచుకోవాలి (వాటిని సజావుగా కొనసాగించాలి)”

అనస్ బిన్ మాలిక్ రజియల్లాహు అన్హు ఉల్లేఖనం : “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికినారు: “ఎవరైతే తన జీవనోపాధి విస్తరించాలని, తన జీవన కాలము పొడిగించ బడాలని ఆశిస్తాడో, అతడు తన బంధువులతో సంబంధాలను నిలిపి ఉంచుకోవాలి (వాటిని సజావుగా కొనసాగించాలి)”.

[దృఢమైనది] [ముత్తఫిఖ్ అలైహి]

الشرح

ఈ హదీసులో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వాలను నిలిపి ఉంచుకొనుటను గురించి ఉద్బోధిస్తున్నారు. బంధుత్వాలను నిలిపి ఉంచుకొనుట, కొనసాగించుట అనేది తరుచుగా వెళ్ళి వారిని కలుస్తూ ఉండుట, వారితో దయతో, స్నేహంతో మెలుగుట, వారికి అవసరమైనప్పుడు వారి కొరకు శారీరకంగా శ్రమ పడుట, ఆర్థికంగా సహాయం అందించుట మొదలైన వాటి వలన జరుగుతుంది. ఆ విధంగా బంధుత్వాలను నిలిపి ఉంచుకోవడం, కొనసాగించడం జీవనోపాధి విస్తరించడానికి మరియు జీవిత కాలం పొడిగించ బడడానికి కారణం అవుతుంది.

فوائد الحديث

బంధువులు అంటే తండ్రి వైపునుంచి మరియు తల్లి వైపునుంచి ఉంటారు. తండ్రి వైపు నుంచైనా, తల్లి వైపు నుంచైనా బంధుత్వములో వారు ఎంత దగ్గరి బంధువులైతే, వారితో బంధుత్వాన్ని నిలిపి ఉంచుకోవడం, కొనసాగించడం అంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.

ప్రతిఫలం అనేది ఆచరించే విధానాన్ని బట్టి ఉంటుంది. కనుక ఎవరైతే బంధుత్వాలను ధర్మబధ్ధమైన రీతిలో నిర్వహిస్తారో, వాటిని నిలిపి ఉంచుకుంటారో మరియు వారి పట్ల దయ, కరుణ కలిగి ఉంటారో, అల్లాహ్ వారి జీవనోపాధినందు, వారి జీవనకాలమునందు విస్తృతిని ప్రసాదిస్తాడు.

బంధుత్వాలను నిలిపి ఉంచుట, వాటిని ధర్మబధ్దంగా కొనసాగించుట అనేది జీవనోపాధి మరియు జీవన కాలము విస్తారమవడానికి ఒక కారణం, అవి నిర్దిష్టమైనప్పటికీ. ఎవరైతే బంధుత్వాలను నిలిపి ఉంచుకుంటాడో, వాటిని ధర్మబద్ధంగా కొనసాగిస్తాడో, అల్లాహ్ వారి జీవన కాలములో వారు చేసే ప్రతి పనిలో ‘బరకహ్’ను (తన ఆశీర్వాదాన్ని) పొందుపరుస్తాడు. ఆ కారణంగా, అదేపని ఇతరులు చేసినా, ఇతని జీవనోపాధి, జీవనం, ఇతనికి లభించే లబ్ధి, ప్రయోజనం ఇతరుల కంటే మరింత విస్తారమవుతుంది. కొంతమంది ఉలమాలు 'అల్లాహ్ వారి జీవనోపాధిని వాస్తవంగా విసృత పరుస్తాడు మరియు జీవన కాలాన్ని వాస్తవంగా పొడిగిస్తాడు' అని అన్నారు. వల్లాహు ఆ’లము (అల్లాహ్’యే బాగా ఎరిగిన వాడు).

التصنيفات

సత్కర్మల ప్రాముఖ్యతలు