నమాజు

నమాజు

7- “ఎవరైతే ఫజ్ర్ సలాహ్’ను (ఫజ్ర్ నమాజును) ఆచరిస్తారో, వారు అల్లాహ్ రక్షణలో ఉన్నారు*. కనుక మీలో ఎవరూ కూడా అల్లాహ్ రక్షణలో ఉన్న వానికి ఏ విధంగానూ హాని తలపెట్టరాదు. ఎవరైతే హాని తలపెడతాడో, అతడిని అల్లాహ్ యొక్క ఆగ్రహం చుట్టుకుంటుంది. అతడు ముఖం మీద పడవేసి నరకాగ్ని లోనికి విసిరి వేయబడతాడు”.

8- “లా ఇలాహా ఇల్లల్లాహు వహ్’దహు లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హమ్’దు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్, లా హౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహు, వలా న’బుదు ఇల్లా ఇయ్యాహు, లహున్నే’మతు, వ లహుల్ ఫధ్’లు, వ లహుథ్థనాఉల్ హసను, లా ఇలాహ ఇల్లల్లాహు, ముఖ్లిసీన, లహుద్దీన, వలౌ కరిహల్ కాఫిరూన్” (అల్లాహ్ తప్ప వేరెవ్వరూ ఆరాధనకు అర్హులు కారు, ఆయనకు ఎవ్వరూ సాటి (సమానులు) లేరు, విశ్వసామ్రాజ్యము ఆయనదే, మరియు సకల ప్రశంసలూ ఆయనకే; ఆయన ప్రతి విషయముపై అధికారము కలవాడు. అల్లాహ్ (అనుమతి) తో తప్ప ఏ శక్తీ, సామర్థ్యము, ఆధిపత్యము సాధ్యము కాదు, అల్లాహ్ తప్ప నిజఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మేము కేవలం ఆయనను తప్ప వేరెవ్వరినీ ఆరాధించము, సకల సంపద, దాతృత్వము, వదాన్యత ఆయనదే, దయ, కరుణ, కటాక్షము ఆయనవే; అన్నిరకాల శ్రేష్ఠమైన, విశిష్టమైన స్తోత్రములు, ప్రశంసలూ ఆయనకే చెందుతాయి, మరియు అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవ్వడూ లేడు. అవిశ్వాసులు ఎంత ద్వేషించినా, ఏవగించుకున్నా మా భక్తిని, అంకితభావాన్ని, సకల ఆరాధనా రీతులను కేవలం ఆయనకు మాత్రమే ప్రత్యేకించినాము). అబ్దుల్లాహ్ ఇబ్న్ అజ్జుబైర్ ఇలా అన్నారు: “@ సలాహ్ (నమాజు) ముగించిన ప్రతిసారీ రసూలుల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ పదాలతో అల్లాహ్ యొక్క ఘనతను కొనియాడేవారు.”

11- “ఉమ్మె సలమహ్ రజియల్లాహు అన్హా తాను హబషహ్(అబిసీనియా) లో మారియా అని పిలువబడే ఒక చర్చీను చూసిన విషయాన్ని రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్ద ప్రస్తావించినారు. అందులో తాను చూసిన ప్రతిమలను (విగ్రహాలను) గురించి ప్రస్తావించినారు. అపుడు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “@అది ఎటువంటి జాతి అంటే – తమలో ధర్మపరాయణుడైన ఒక దాసుడు చనిపోయినా, లేక ఒక ధర్మపరాయణుడైన వ్యక్తి చనిపోయినా వారు అతని సమాధిపై ఒక ఆరాధనా గృహాన్ని (దేవాలయాన్ని) నిర్మించి* అందులో వారి విగ్రహాలను ప్రతిష్టించి పూజించడం మొదలుపెడతారు. అల్లాహ్ వద్ద వారు సృష్టి మొత్తములో అత్యంత నీచులు, దుష్టులు.”

13- “(నమాజులో) రెండు సజ్దాల నడుమ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం “అల్లాహుమ్మఘ్’ఫిర్లీ, వర్హమ్’నీ, వఆఫినీ, వహ్’దినీ, వర్జుఖ్’నీ” (ఓ అల్లాహ్ నాకు క్షమాభిక్ష ప్రసాదించు, నాపై కరుణ చూపు, నాకు ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, శ్రేయస్సును ప్రసాదించు, నాకు మార్గదర్శకాన్ని ప్రసాదించు మరియు నాకు ఉపాధిని ప్రసాదించు) అని పలికేవారు.”

14- “నమాజు ముగించినపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మూడు సార్లు క్షమాభిక్ష కోరుకునేవారు. తరువాత ఇలా పలికేవారు “@అల్లాహుమ్మ అంతస్సలామ్, వ మిన్కస్సలామ్, తబారక్త జల్’జలాలి వల్ ఇక్రామ్*” (ఓ అల్లాహ్! నీవు సంపూర్ణ శాంతివి, శాంతి, ప్రశాంతత అన్నీ నీ నుంచే; శుభాలన్నీ నీ కొరకే, ప్రతి శుభమూ నీ నుంచే; మహోన్నత, పరమ పవిత్రత, ఠీవి, వైభవము, తేజస్సు గలవాడా; మరియు కీర్తి, గౌరవం, ఘనత గలవాడా). అల్-వలీద్ ఇలా అన్నారు: “నేను అల్-ఔజాయీ ని ‘అల్ ఇస్తిగ్’ఫార్’ అంటే ఎలా అడగాలి?” అని ప్రశ్నించాను. దానికి ఆయన “అస్తగ్’ఫిరుల్లాహ్, అస్తగ్ఫిరుల్లాహ్” అని పలుకు” అన్నారు.” (అస్తగ్ఫిరుల్లాహ్: నేను అల్లాహ్ నుండి క్షమాభిక్ష కోరుతున్నాను)

18- “ఇస్లాం (మూలస్తంభముల వంటి) ఐదు విషయాలపై నిర్మితమై ఉన్నది*. అల్లాహ్ తప్ప ఆరాధనలకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆయన యొక్క దాసుడు మరియు ఆయన సందేశహరుడు (అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు) అని సాక్ష్యం పలుకుట; సలాహ్’ను (నమాజును) స్థాపించుట; జకాతు (సంపదల నుండి విధిగా చెల్లించవలసిన దానము) చెల్లించుట, కాబా గృహము యొక్క హజ్ చేయుట; మరియు రమదాన్ మాసము ఉపవాసములు పాటించుట,”

19- “ఒక వ్యక్తి రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ఇలా ప్రశ్నించాడు “@నాకు చెప్పండి, ఒకవేళ నేను కేవలం విధిగా ఆచరించవలసిన సలాహ్’లను (నమాజులను) మాత్రమే ఆచరిస్తే, కేవలం రమదాన్ నెల ఉపవాసాలను మాత్రమే ఆచరిస్తే, (అల్లాహ్’చే) హలాల్’గా ప్రకటించబడిన విషయాలను హలాల్ విషయాలని విశ్వసిస్తే (వాటిని ఆచరిస్తే), హరాం గా ప్రకటించబడిన విషయాలను హరాం విషయాలని విశ్వసిస్తే (వాటికి దూరంగా ఉంటే)*, వీటిల్లో ఏ ఒక్క దానిలోనూ ఏమీ ఎక్కువ చేయకపోయినా (ఎక్కువ ఏమీ ఆచరించకపోయినా) నేను స్వర్గం లోనికి ప్రవేశించగలనా?” దానికి ఆయన “అవును, ప్రవేశించగలవు” అన్నారు. దానికి అతడు “అల్లాహ్ సాక్షిగా ఇంతకంటే ఏ ఒక్క విషయమూ ఎక్కువ చేయను (ఎక్కువ ఆచరించను)” అన్నాడు.

20- “పరిశుద్ధత విశ్వాసములో (ఈమాన్ లో) సగభాగము (వంటిది), ‘అల్-హందులిల్లాహ్’ సత్కర్మల త్రాసును నింపివేస్తుంది, ‘సుబ్’హానల్లాహి, వల్’హందులిల్లాహి’ ఈ రెండు నింపివేయునటువంటివి లేదా ఈ రెండూ భూమ్యాకాశాల మధ్యనున్న వాటంతటినీ పూరిస్తాయి*, సలాహ్ (నమాజు) కాంతి, దానము చేయుట సాక్ష్యము, మరియు ‘సబ్ర్’ (సహనం) కాంతి. ఖుర్’ఆన్ నీ పక్షమున లేక నీకు వ్యతిరేకంగా సాక్ష్యము. ప్రజలు ప్రతి ఉదయం తమ ఇళ్ళనుండి బయలుదేరుతారు, తమ ఆత్మలను అమ్ముకుంటారు – మోక్షప్రాప్తి కొరకు లేక తమను తాము నాశనం చేసుకొనుట కొరకు”.

21- “ముఅజ్జిన్ (మస్జిద్ లో అజాన్ పలుకు వ్యక్తి) “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు మీలో ఎవరైతే “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో*, తరువాత అతడు “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అల్లాఇలాహ ఇల్లల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలికినపుడు, “అష్’హదు అన్న ముహమ్మదుర్’రసూలుల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలస్సలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “హయ్య అలల్’ఫలాహ్” అని పలికినపుడు, “లాహౌల వలా ఖువ్వత ఇల్లా బిల్లాహ్” అని పలుకుతాడో, తరువాత అతడు “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలికినపుడు, “అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్” అని పలుకుతాడో, తరువాత (చివరికి) అతడు (ముఅజ్జిన్) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని పలికినపుడు, (మీలో ఎవరైతే) “లా ఇలాహ ఇల్లల్లాహ్” అని హృదయపూర్వకంగా పలుకుతాడో అతడు స్వర్గములో ప్రవేశిస్తాడు.”

27- “ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పది రకాతులు నాకు గుర్తున్నాయి*. జుహ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు, (జుహ్ర్ నమాజు) తరువాత రెండు రకాతులు, మగ్రిబ్ నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఇషా నమాజు తరువాత వారు తన ఇంటిలో రెండు రకాతులు ఆచరించుట, మరియు ఫజ్ర్ నమాజుకు ముందు రెండు రకాతులు ఆచరించుట నాకు గుర్తున్నాయి, మరియు ఆ సమయములో ఎవరూ ఆయన ఉన్న ఇంటిలో ప్రవేశించేవారు కారు.

29- “నమాజు ప్రారంభించునపుడు రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం తన రెండు చేతులను భుజాలవరకు పైకి ఎత్తేవారు*; రుకూ కొరకు ‘అల్లాహు అక్బర్’ అని పలుకునపుడు మరియు రుకూ నుండి తల పైకి ఎత్తునపుడు అదే విధంగా పైకి ఎత్తేవారు. అపుడు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్ రబ్బనా వలకల్ హంద్” అని పలికారు. అయితే సజ్దహ్’లో అలా చేసేవారు కాదు (చేతులను పైకి ఎత్తేవారు కాదు).”

30- “నా చేతిని తన రెండు చేతుల మధ్యకు తీసుకుని, ఖుర్’ఆన్ లోని సూరాను బోధించినట్లుగా, రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నాకు ‘తషహ్హుద్’ ను నేర్పించినారు*; “అత్తహియ్యాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రమ్హతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్, అష్’హదు అన్’లాఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు”. (కొన్ని హదీసులలో) కొన్ని పదాలున్నాయి వాటిలో “నిశ్చయంగా అల్లాహ్ – ఆయనే శాంతి ప్రదాత. కనుక నమాజులో ‘ఖాయిదా’ స్థితిలో మీరు ఇలా పలకండి “అత్తహియాతు లిల్లాహి, వస్సలవాతు, వత్తయ్యిబాతు, అస్సలాము అలైక అయ్యుహన్నబియ్యు వ రహ్మతుల్లాహి వ బరకాతుహు, అస్సలాము అలైనా వ అలా ఇబాదిల్లాహిస్సాలిహీన్”. ఒకవేళ మీరు అలా పలికినట్లయితే అది భూమ్యాకాశాలలో ఉన్న నీతిమంతులైన అల్లాహ్ దాసులందరికీ అది చేరుతుంది; (తరువాత ఈ పలుకులతో పూర్తి చేయండి) “అష్’హదు అన్’లా ఇలాహ ఇల్లల్లాహు, వ అష్’హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు”; తరువాత దాసుడు తాను కోరిన ఏ దుఆనైనా ఎంచుకోవచ్చును.”

31- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా దుఆ చేసేవారు, ఆయన ఇలా పలికేవారు: “@అల్లాహుమ్మ ఇన్నీ అఊజుబిక మిన్ అజాబిల్ ఖబ్రి, వ మిన్ అజాబిన్నారి, వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి, వ మిన్ ఫిత్నతిల్ మసీహిద్దజ్జాలి*”(ఓ అల్లాహ్! నేను నీ రక్షణ కోరుతున్నాను – సమాధి శిక్ష నుండి, నరకాగ్ని నుండి, జీవన్మరణాల పరీక్ష నుండి, మరియు మసీహిద్దజ్జాల్ పరీక్ష నుండి). సహీహ్ ముస్లింలో ఉన్న హదీథులో ఇలా ఉన్నది: “మీరు నమాజులో చివరి రకాతులో తషహ్హుద్ పఠించడం పూర్తి అయిన తరువాత నాలుగు విషయాల నుండి అల్లాహ్ యొక్క రక్షణ కొరండి: నరక శిక్ష నుండి (మిన్ అజాబి జహన్నం), సమాధి శిక్ష నుండి (మిన్ అజాబిల్ ఖబ్ర్), జీవన్మరణ పరీక్షల నుండి (వ మిన్ ఫిత్నతిల్ మహ్యా వల్ మమాతి), మరియు ‘మసీహిద్దజ్జాల్’ యొక్క కీడు నుండి (వ మిన్ షర్రిల్ మసీహిద్దజ్జాల్).

32- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నమాజు’లో ప్రారంభములో “అల్లాహు అక్బర్” అని పలికినపుడు ఖుర్’ఆన్ పఠనం ప్రారంభించుటకు ముందు కొద్ది సేపు మౌనంగా ఉంటారు. నేను వారితో ఇలా అన్నాను: “ఓ రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం నా తల్లిదండ్రులు మీ కొరకు త్యాగం అగుగాక, ‘తక్బీర్’కు మరియు ‘ఖుర్ఆన్ పఠనానికి’ మధ్య మీరు ఏమి పలుకుతున్నారు?” దానికి వారు “నేను @‘అల్లాహుమ్మ బాఇద్ బైనీ వబైన ఖతాయాయ కమా బాఅద్’త బైనల్ మష్రిఖి వల్ మఘ్రిబి*, అల్లాహుమ్మ నఖ్ఖినీ మిన్ ఖతాయాయ కమా యునఖ్ఖస్సౌబుల్ అబ్యజు మినద్దనసి, అల్లాహుమ్మఘ్’సిల్నీ మిన్ ఖతాయాయ బిస్సల్జీ వల్ మాఇ వల్ బరది’ అని పలుకుతాను” అన్నారు (ఓ అల్లాహ్! నన్ను నా పాపాల నుండి దూరంగా ఉంచు, ఏవిధంగానైతే నీవు తూర్పును పడమర నుండి దూరంగా ఉంచినావో; ఓ అల్లాహ్! ఏవిధంగానైతే తెల్లని వస్త్రము మురికి మాలిన్యాలనుండి పరిశుభ్రం చేయబడుతుందో, ఆ విధంగా నన్ను నా పాపాలనుండి పరిశుధ్ధుడిని చేయి; ఓ అల్లాహ్! నా పాపాలను నానుంచి నీళ్ళు, మంచు మరియు వడగళ్ళతో కడిగివేయి).

34- “నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతిపై ఇలా ప్రమాణం చేసాను – “లా ఇలాహ ఇల్లల్లాహు, వ అన్న ముహమ్మదర్’రసూలుల్లాహ్” (అల్లాహ్ తప్ప వేరే నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క సందేశ హరుడు); నమాజు స్థాపిస్తాను; జకాతు చెల్లిస్తాను; (పాలకుని) మాట వింటాను మరియు అనుసరిస్తాను; తోటి ప్రతి ముస్లింకు నిజాయితీగా సలహా ఇస్తాను - అని”

35- “రసూలల్లాహ్ (సల్లల్లాహు అలైహి వసల్లం) అతడి చేతిని పట్టుకుని ఇలా అన్నారు: “ఓ ము’ఆద్! అల్లాహ్ సాక్షిగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను”. ఆయన ఇంకా ఇలా అన్నారు: “ఓ ముఆద్! నేను నీకు ఉపదేశిస్తున్నాను @ప్రతి సలాహ్ (నమాజు) తరువాత (అల్లాహ్’ను స్మరించే) ఈ పదాలు పలుకుటలో ఎప్పుడూ విఫలం కావద్దు, “అల్లాహుమ్మ అ’ఇన్నీ అలా జిక్రిక, వ షుక్రిక, వ హుస్నీ ఇబాదతిక్” (ఓ అల్లాహ్! నిన్ను స్మరించుకొనుటకు నాకు సహాయం చేయి, మరియు నీకు కృతఙ్ఞతలు తెలుపుకొనుటకు నాకు సహాయం చేయి; మరియు నిన్ను అత్యుత్తమంగా ఆరాధించుటకు నాకు సహాయం చేయి)

36- ఒక రాత్రి నేను రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రక్క మీద లేకపోవడం గమనించాను; ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు అటూఇటూ తడిమాను. నా చేతికి వారి పాదాల అరికాళ్లు తగిలాయి, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సజ్దాలో ఉన్నారు, ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పాదాలు నిటారుగా ఉన్నాయి మరియు వారు ఇలా దుఆ చేస్తూ ఉన్నారు: @“అల్లాహుమ్మ అఊదు బిరిదాక మిన్ సఖతిక; వ బిముఆఫాతిక మిన్ ఉఖూబతిక; వ అఊదుబిక మిన్క; లా ఉహ్’సీ థనాఅన్ అలైక; అన్’త కమా అథ్’నైత అలా నఫ్’సిక” (ఓ అల్లాహ్! నీ అనుగ్రహము ద్వారా నీ ఆగ్రహము నుండి రక్షణ కోరుతున్నాను; నీ క్షమాభిక్ష ద్వారా నీ శిక్ష నుండి రక్షణ కోరుతున్నాను; మరియు నీ నుండి నీతోనే రక్షణ కోరుతున్నాను; (ఓ అల్లాహ్!) నీ ప్రశంసలను నేను లెక్కించలేను; (ఏ ప్రశంసా పదాలతో) నిన్ను నీవు ఏమని ప్రశంసించుకున్నావో, నీవు ఆవిధంగానే ఉన్నవాడవు.”

38- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం చేత బానిసత్వము నుండి విముక్తి పొందిన సౌబాన్ రజియల్లాహు అన్హు కలిసి ఇలా అడిగాను: “నాకు ఒక ఆచరణను గురించి తెలియ జేయండి, దేనిని నేను ఆచరించినట్లయితే దాని ద్వారా అల్లాహ్ నన్ను స్వర్గములోనికి ప్రవేశింపజేస్తాడో” లేక బహుశా నేను ఇలా అన్నాను: “”అల్లాహ్ అమితంగా ఇష్టపడే ఆచరణలు ఏమిటి?” ఆయన మౌనంగా ఉండిపోయాడు. నేను మళ్ళీ ప్రశ్నించాను, ఆయన మళ్ళీ మౌనంగా ఉండిపోయాడు, నేను మూడోసారి మళ్ళీ ప్రశ్నించాను. దానికి ఆయన ఇలా అన్నాడు: “నేను ఇదే విధంగా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ను ప్రశ్నించాను. దానికి ఆయన: @“అల్లాహ్ కొరకు అధికంగా సజ్దాలు చేయి; ఎందుకంటే అల్లాహ్ కొరకు చేయబడిన ప్రతి సజ్దా అతని స్థానాన్ని ఉన్నతం చేస్తుంది మరియు అతని నుండి ఒక పాపాన్ని తొలగిస్తుంది తప్ప అది వ్యర్థం కాదు*”. మఅదాన్ రజియల్లాహు అన్హు ఇంకా ఇలా అన్నారు: “తరువాత నేను అబూ దర్దా రజియల్లాహు అన్హు ను కలిసాను. ఆయనను కూడా ప్రశ్నించాను. ఆయన కూడా సౌబాన్ రజియల్లాహు అన్హు పలికిన మాదిరిగానే పలికారు.”

41- “ఎవరైతే వెల్లుల్లి లేదా ఉల్లిపాయలు తింటాడో, అతడు మా నుండి దూరంగా ఉండాలి” లేదా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు “అతడు మా మస్జిదు నుండి దూరంగా ఉండాలి మరియు తన ఇంటిలోనే ఉండాలి”* మరియు (ఒకసారి)ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు, ఆకుపచ్చని కూరగాయలతో కూడిన ఒక కుండ తీసుకు రావడం జరిగింది. అందులో నుండి (ఒకరకమైన) వాసన వస్తున్నది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం దాని గురించి అడిగారు; మరియు వారికి కుండలో ఉన్న కూరగాయలను గురించి చెప్పడం జరిగింది. అపుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం తనతో పాటు ఉన్న ఒక సహచరుని వద్దకు దానిని తీసుకు రండి అని ఆదేశించినారు. దానిని అతడు (ఆ సహచరుడు) తినడానికి ఇష్టపడలేదు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “తిను! (నా విషయం వేరు) ఎందుకంటే, ఎవరితోనైతే మీరు సంభాషించలేరో నేను ఏకాంతములో ఆయనతో సంభాషిస్తూ ఉంటాను, ”.

42- “ఒకవేళ మీలో ఎవరి ఇంటి ముంగిట అయినా ఒక నది పారుతూ ఉండి, అందులో అతడు రోజుకు ఐదు సార్లు స్నానం చేయడం ఎవరైనా చూసారా? అలా చేసిన తరువాత, అతడి ఒంటిపై ఏమైనా మలినం మిగిలి ఉంటుందా, ఏమంటారు మీరు?*” దానికి వారు ఇలా అన్నారు: “ఎలాంటి మలినమూ కూడా మిగిలి ఉండదు”. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: “మరి ఐదు సలాహ్’ల (నమాజుల) ఉదాహరణ కూడా ఇటువంటిదే. వాటి ద్వారా అల్లాహ్ పాపాలను తుడిచివేస్తాడు.”

46- “శుక్రవారము నాడు ఎవరైతే, ‘జనాబత్ గుస్ల్’ ఆచరించిన విధంగా తలస్నానం చేసి (నమాజు కొరకు), మొదటి ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు (అల్లాహ్ ప్రసన్నత కొరకు) ఒక ఒంటెను ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం*; ఎవరైతే రెండవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక ఆవును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే మూడవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు కొమ్ములు కలిగిన ఒక పొట్టేలును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; ఎవరైతే నాలుగవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక కోడిని ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం; మరియు ఎవరైతే ఐదవ ఘడియలో మస్జిదులోనికి ప్రవేశిస్తాడో అతడు ఒక గుడ్డును ‘ఖుర్బానీ’ చేసిన వానితో సమానం. ఎపుడైతే ఇమాం మస్జిదులోనికి ప్రవేశిస్తాడో, (మస్జిదు ద్వారముల వద్ద) హాజరుగా ఉన్న దైవదూతలు ఆయన ప్రసంగము వినడానికి వెళ్ళిపోతారు.”

48- “ఎవరైతే శుక్రవారమునాడు పరిపూర్ణంగా ఉదూ చేసుకుని, శుక్రవారపు నమాజుకు వెళ్ళి, ఇమాం యొక్క ప్రసంగాన్ని శ్రద్ధగా వింటాడో, మరియు (మస్జిదులో) మౌనంగా ఉంటాడో, ఆ శుక్రవారానికీ మరియు రాబోయే శుక్రవారానికీ మధ్య అతని వలన జరిగే చిన్న చిన్న పాపాలన్నీ క్షమించివేయబడతాయి; అంతేకాకుండా దానికి మరో మూడు దినములు అదనంగా కలుపబడతాయి*. కాని (ప్రసంగం మధ్యలో) అతడు ఒక చిన్న గులకరాయిని తాకినా, అతడు వ్యర్థమైన పనిలో పాల్గొన్న వానిగా లెక్కించబడతాడు.”

52- “ఏ ముస్లిం వ్యక్తి అయినా, సలాహ్ (నమాజు) సమయం ఆసన్నమైనపుడు పరిపూర్ణంగా ఉదూ ఆచరించి, అణకువ, వినయం కలిగి, సలాహ్’లో రుకూ (మొదలైన వాటిని) పరిపూర్ణంగా ఆచరిస్తాడో, అది అతని వల్ల అంతకు ముందు వరకు జరిగిన ‘సగాయిర్’ పాపాలకు (చిన్న పాపాలకు) పరిహారంగా మారుతుంది; అతడు ‘కబాయిర్’ పాపాలకు (పెద్ద పాపాలకు) పాల్బడనంత వరకు; మరియు ఇది అన్ని కాలాలకు వర్తిస్తుంది.”

54- “ముఅజ్జిన్ ఇచ్చిన అజాన్ విన్నపుడు, ఎవరైతే “అష్’హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, వ అన్న ముహమ్మదన్ అబ్దుహు, వ రసూలుహు; రదీతు బిల్లాహి రబ్బన్, వ బి ముహమ్మదిన్ రసూలన్, వ బిల్ ఇస్లామి దీనన్” (అల్లాహ్ తప్ప నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు అని, ఆయనకు సాటిగానీ, భాగస్వామి గానీ ఎవరూ లేరు అని, మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన దాసుడు మరియు ఆయన సందేశహరుడు అని నేను సాక్ష్యమిస్తున్నాను; నేను అల్లాహ్ ను నా ప్రభువుగా, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన సందేశహరునిగా మరియు ఇస్లాంను ధర్మంగా అంగీకరిస్తున్నాను, మరియు అందుకు సంతోషిస్తున్నాను) అని పలుకుతాడో అతని పాపాలు క్షమించి వేయబడతాయి.”

56- “ఎవరైతే అజాన్ (నమాజు కొరకు ఇవ్వబడే పిలుపు) విన్న తరువాత ఈ పలుకులు “అల్లాహుమ్మ, రబ్బహాదిహిద్ద’వతిత్తామ్మహ్, వస్సలాతిల్ ఖాఇమహ్, ఆతి ముహమ్మదన్ అల్’వసీలత, వల్ ఫజీలత, వబ్’అథ్’హు మఖామన్ మహ్’మూదన్ అల్లదీ వ అద్’తహు” (ఓ అల్లాహ్! ఈ పరిపూర్ణ పిలుపునకు మరియు స్థాపించబడబోయే ఈ నిత్య నమాజు పిలుపునకు ఓ ప్రభువా! దయచేసి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు (తీర్పు దినమున) స్వర్గంలో ఆయనకు తప్ప మరెవరికీ లభించని అత్యున్నత స్థానమును మరియు ఆధిక్యతను ప్రసాదించు, మరియు (తీర్పు దినమున) నీవు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకు వాగ్దానం చేసిన స్వర్గంలో శ్రేష్ఠమైన మరియు మరియు అత్యున్నతమైన స్థానానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను పంపు) అని పలుకుతాడో తీర్పు దినమున అతనికి నా మధ్యవర్తిత్వం ఖచ్చితంగా లభిస్తుంది."

62- “మీలో ఎవరైనా తన నమాజు లో (తన నమాజులో ఉండగా) సందేహములో పడిపోతే, తను ఎన్ని (రకాతులు) ఆచరించినాడు? మూడా, నాలుగా అతనికి తెలియకపోతే – అతడు తన సందేహాన్ని (ప్రక్కకు) విసిరేసి, ఖచ్చితంగా ఎన్ని రకాతులు పూర్తి అయినాయని విశ్వసిస్తున్నాడో, దానిపై తన నమాజు ను ఆధారం చేసుకుని పూర్తి చేయాలి; తరువాత సలాం చెప్పే ముందు (సలాంతో నమాజు పూర్తి చేసే ముందు) రెండు సజ్దాలు చేయాలి*. ఒకవేళ అతడు 5 రకాతులు చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు అతడి నమాజు ను (సరి సంఖ్యగా) పరిపూర్ణం చేస్తాయి. ఒకవేళ అతడు నాలుగు (రకాతులు) చదివి ఉంటే, ఈ రెండు సజ్దాలు షైతానుకు పరాభవంగా మారుతాయి.”

71- “ముఅజ్జిన్ అజాన్ పలుకుతున్నపుడు మీరు విన్నట్లయితే, అతను పలుకునట్లుగానే మీరూ పలకండి, తరువాత నాపై శాంతి మరియు శుభాలకొరకు ప్రార్థించండి (దరూద్ పఠించండి)* ఎవరైతే నాపై ఒకసారి దరూద్ పఠిస్తాడో, అల్లాహ్ దానికి పది రెట్లు ఎక్కువగా అతనిపై శాంతి, శుభాలు కురిపిస్తాడు. తరువాత నాకు ‘అల్-వసీలహ్’ ప్రసాదించమని అల్లాహ్ ను వేడుకొనండి. అది (అల్-వసీలహ్) స్వర్గములో ఒక సమున్నతమైన స్థానము. అది కేవలం ఒకరికి మాత్రమే ప్రసాదించబడుతుంది. ఆ ఒక్కరు నేనే కావాలని నా ఆశ. ఎవరైతే నా కొరకు వసీల ప్రసాదించమని ప్రార్థిస్తాడో, (తీర్పు దినము నాడు) అతని కొరకు (అల్లాహ్ వద్ద) సిఫారసు చేయడం నాపై విధి అవుతుంది.”

72- “ఉథ్మాన్ బిన్ అఫ్ఫాన్ రజియల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మస్జిదును (మస్జిద్-ఎ-నబవీను) పునర్నిమించాలని అనుకున్నారు. కానీ ప్రజలు అలా చేయడాన్ని ఇష్టపడలేదు. వారు మస్జిదు యధాతథ స్థితిలోనే ఉండాలని కోరుకున్నారు. అపుడు ఆయన ఇలా అన్నారు “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించగా నేను విన్నాను – “@ఎవరైతే అల్లాహ్ కొరకు ఒక మస్జిదును నిర్మిస్తాడో, అల్లాహ్ అతని కొరకు స్వర్గములో దానిని పోలిన ఒక గృహాన్ని నిర్మిస్తాడు.”

75- “ఎప్పుడైనా, మీలో ఎవరైనా మస్జిదులోనికి ప్రవేశిస్తే అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మఫ్’తహ్ లీ అబ్వాబ రహ్మతిక” (ఓ అల్లాహ్! నా కొరకు నీ కరుణాకటాక్షముల ద్వారములను తెరువుము); అలాగే మస్జిదు నుండి బయటకు వెళ్ళునపుడు అతడు ఇలా పలకాలి “అల్లాహుమ్మ! ఇన్నీ అస్అలుక మిన్ ఫద్’లిక” (ఓ అల్లాహ్! నేను నీ శుభాలలో నుండి నా కొరకు ప్రసాదించమని నిన్ను వేడుకుంటున్నాను).”

77- కొంతమంది మగవారు సహ్’ల్ బిన్ స’ఆద్ అస్’సఈదీ రజియల్లాహు అన్హు వద్దకు వచ్చారు. వారు "ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపయోగించిన వేదిక (మింబర్) దేనితో తయారు చేసి ఉంటారు" అనే విషయంలో వాదులాడుకోసాగినారు. వారు అతడిని దాని గురించి అడిగినారు. అతడు ఇలా అన్నాడు: “అల్లాహ్ సాక్షిగా చెబుతున్నాను, అది దేనితో తయారు చేయబడినదో నాకు తెలుసు, అది ఇక్కడికి తీసుకు రాబడి ఇక్కడ స్థాపించబడిన మొదటి రోజునే నేను దానిని చూసాను, (స్థాపించబడిన తరువాత) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపై మొదటిసారి కూర్చోవడం కూడా చూసాను. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒకరిని ఫలానా స్త్రీ ఇంటికి పంపారు. సహ్’ల్ ఆ స్త్రీ పేరును కూడా చెప్పారు. ఆమెతో “మీ వద్ద ఉన్న వడ్రంగి సేవకుడిని "నేను (మస్జిదులో) ప్రజలను సంబోధించి ప్రసంగించ వలసి వచ్చినపుడు కూర్చోవడానికి గానూ ఎత్తైన ఒక వేదికను తయారు చేయమని" పురమాయించండి” అని చెప్పమని పంపినారు. ఆమె అతనిని (వడ్రంగి సేవకునికి) ఆ పని కొరకు పురమాయించింది. అతడు ఆ వేదికను, అల్-ఘాబా నుండి ‘తమరిస్క్’ వృక్షపు కలపను తెప్పించి దానిని తయారు చేసినాడు. ఆ మెంబర్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు పంపబడింది. వారు దానిని అదుగో ఇక్కడే స్థాపించమని అదేశించినారు. తరువాత (దాని మెట్లు ఎక్కి) ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దానిపైకి వెళ్ళడాన్ని, దానిపై ఆయన నమాజు ఆచరించడాన్ని చూసాను. దానిపై ఉండగా ఆయన (“అల్లాహు అక్బర్” అని) తక్బీర్ పలికి నమాజును ప్రారంభించి, దానిపై ఉండగానే రుకూ చేసినారు. తరువాత వారు అడుగులు వెనుకకు వేస్తూ వేదిక మెట్లుదిగి, మెట్ల ప్రక్కన సజ్దా చేసినారు. (రెండు సజ్దాలు చేసిన) తరువాత వారు తిరిగి మెట్లు ఎక్కి వేదికపైకి వెళ్ళినారు. (ఆ విధంగా) వారు నమాజును పూర్తిచేసి ముగించిన తరువాత ప్రజల వైపునకు తిరిగి “@ఓ ప్రజలారా! కేవలం నేను నమాజును ఏ విధంగా ఆచరినానో మీరు చూడాలని, ఆ విధంగా మీరు అనుసరించాలని, నమాజును ఏ విధంగా ఆచరించాలో మీరు నేర్చుకోవాలని మాత్రమే ఇలా చేసినాను” అన్నారు.

81- “రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం రుకూ నుండి తన నడుమును పైకి లేపునపుడు ఇలా పలికినారు “సమి’అల్లాహు లిమన్ హమిదహ్*, అల్లాహుమ్మ, రబ్బనా లకల్ హందు, మిల్’అస్సమావాతి, వ మిల్ అల్ అర్ధి, వ మిల్ అమా షి’త మిన్ షైఇన్ బ’ద్” (తనను స్తుతించిన వారి స్తోత్రములను అల్లాహ్ విన్నాడు. ఓ అల్లాహ్! మా ప్రభువా! సకల స్తోత్రములూ నీ కొరకే, ఆకాశాన్ని నింపినంత, భూమిని నింపినంత మరియు ఆ తర్వాత నీవు కోరుకున్నంత స్తోత్రం నీకొరకే).”

82- “ముగీరహ్ ఇబ్న్ షు’బహ్ రజియల్లాహు అన్హు ఇలా నాకు చెబుతూ నా చేత ము’ఆవియహ్ రజియల్లాహు అన్హు కు ఇలా ఒక లేఖ వ్రాయించినారు “*ప్రతి ఫర్జ్ సలాహ్ (నమాజు) తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా పలికేవారు “లా ఇలాహ ఇల్లల్లాహు, వహ్’దహు, లా షరీకలహు, లహుల్ ముల్కు, వలహుల్ హందు, వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్; అల్లాహుమ్మ లా మాని’అ, లిమా అ’అతైత, వలా ము’తియ లిమా మన’త, వలా యన్’ఫఉ జల్’జద్ది మిన్కల్ జద్దు” (అల్లాహ్ తప్ప ఆరాధనకు అర్హుడైన నిజ ఆరాధ్యుడు ఎవరూ లేరు, ఆయన ఏకైకుడు, ఆయనకు సాటి ఎవరూ లేరు, విశ్వ సామ్రాజ్యము ఆయనకు చెందినదే, సకల స్తోత్రములూ ఆయనకు చెందినవే, ఆయన సర్వసమస్తము పై ఆధిపత్యము, అధికారము కలవాడు. ఓ అల్లాహ్! నీవు ప్రసాదించదలిచిన దానిని ఎవరూ ఆపలేరు, నీవు ఆపివేసిన దానిని ఎవరూ ప్రసాదించలేరు. ఐశ్వర్యవంతునికి అతనిసంపద, నీకు వ్యతిరేకంగా దేనికీ పనికిరాదు.)”

86- రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం మస్జిద్‌లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఒక వ్యక్తి వచ్చి నమాజ్ (సలాహ్) చేసినాడు. ఆ పిదప అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. అపుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి సమాధానం ఇచ్చి ఇలా అన్నారు: "@నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ ను సరిగ్గా చేయలేదు."* అతను తిరిగి వెళ్లి మళ్లీ అదే విధంగా నమాజ్ చేసినాడు. ఆ తరువాత వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు సలాం చెప్పినాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనితో మళ్లీ అలాగే చెప్పినారు: "నీవు తిరిగి వెళ్లి నమాజ్ చేయి, ఎందుకంటే నువ్వు నమాజ్ సరిగ్గా చేయలేదు." ఇలా మూడు సార్లు జరిగింది. ఇక ఆ వ్యక్తి ఇలా అన్నాడు: "మిమ్ముల్ని సత్యంతో పంపినవాడిపై ప్రమాణం చేస్తూ చెబుతున్నాను, నేను దీని కంటే మెరుగ్గా నమాజు చేయలేను. కాబట్టి, దయచేసి మీరు నాకు నేర్పండి." అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతనికి ఇలా బోధించినారు: "నీవు నమాజ్‌ కొరకు నిలబడినప్పుడు మొట్టమొదట తక్బీర్ (అల్లాహు అక్బర్) చెప్పు. తర్వాత నీకు సాధ్యమైనంత ఖుర్ఆన్ చదువు. ఆ తరువాత రుకూలోనికి వెళ్లి, రుకూలో పూర్తిగా ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత నిలబడు, అంటే పూర్తిగా నిటారుగా నిలబడు. ఆ తరువాత సజ్దాలోకి వెళ్ళు, సజ్దాలో ప్రశాంతంగా ఉండు. ఆ తరువాత కూర్చో, కూర్చోవడంలో ప్రశాంతంగా ఉండు. నీ నమాజ్ మొత్తం ఇలాగే చేయి."

88- "ఒకవేళ ప్రజలు అదాన్ (నమాజు కొరకు పిలుపు) ఇవ్వడం మరియు మొదటి వరుసలో (సలాహ్ చేయడంలో) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, దానిని పొందడానికి లాటరీ వేసుకోవాల్సి వచ్చినా, వారు తప్పనిసరిగా లాటరీ వేసుకునే వారు*. వారు ముందుగా మస్జిద్‌కు రావడంలో (తహ్జీర్) ఉన్న గొప్ప ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, అందరూ ముందుగా రావడానికి పోటీ పడేవారు. వారు ఇషా (రాత్రి నమాజ్) మరియు ఫజర్ (ఉదయం నమాజ్) లో ఉన్న ప్రతిఫలం గురించి తెలుసుకుంటే, ఎంత కష్టమైనా, నడవలేకపోయినా, కదలలేకపోయినా, చాలా కష్టంగా అయినా, చేతుల మీద నడుస్తూ రావలసి వచ్చినా, ఆ నమాజులకు తప్పకుండా హాజరవుతారు."

89- "ఏడు రకాలవారు ఉన్నారు — అల్లాహ్ తన (అర్ష్) నీడను - ఆ రోజు (ప్రళయ దినం) ఆయన (అర్ష్) నీడ తప్ప మరే నీడ* ఉండదు - వారికి ఇస్తాడు: న్యాయమైన పాలకుడు (ఇమామ్ అదుల్), తన యవ్వనాన్ని అల్లాహ్ ఆరాధనలో గడిపిన యువకుడు, మస్జిదుతో మనసు ముడిపడిన వ్యక్తి, అల్లాహ్ కోసం పరస్పరం ప్రేమించేవారు — ఆ ప్రేమ కోసం కలిసేవారు, దాని మీదే విడిపోయేవారు, ఒక మహిళ (పదవీ, అందం కలిగినది చెడుపనికి) పిలిచినప్పుడు — "నేను అల్లాహ్‌ను భయపడుతున్నాను" అని చెప్పిన పురుషుడు, దానం చేసినప్పుడు — తన కుడిచేతి దానం ఎడమచేతికి కూడా తెలియకుండా రహస్యంగా ఇచ్చినవాడు, ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ ఏకాంతంలో అల్లాహ్‌ను జ్ఞాపకం చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నవాడు"